(Source: ECI/ABP News/ABP Majha)
Fashion Brand Re-entry: మింత్రా, జుడియోకు పోటీగా చైనీస్ బ్రాండ్ - నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ!
Chinese Fashion Brand: నిషేధానికి గురైన చైనీస్ కంపెనీని ముఖేష్ అంబానీ తిరిగి భారత గడ్డ మీదకు తీసుకువస్తున్నారు. ఫలితంగా, చవకైన ఫాస్ట్ ఫ్యాషన్ దుస్తులు భారతీయులకు మళ్లీ అందుబాటులోకి వస్తున్నాయి.
Chinese Fashion Brand Shein's Re-entry: నాలుగేళ్ల క్రితం భారత్‌లో నిషేధానికి గురైన చైనీస్ కంపెనీ మళ్లీ తెరపైకి వస్తోంది. చైనీస్ ఫ్యాషన్ బ్రాండ్ షీఇన్ (Shein) ఇండియాలోకి పునరాగమనం చేస్తోంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ చొరవ కారణంగా, ఈ దుస్తుల కంపెనీ భారతదేశంలోకి తిరిగి ప్రవేశిస్తోంది. ఇది, మింత్ర, జుడియోకు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
రిలయన్స్ రిటైల్ స్టోర్లలో షీఇన్
చైనాకు చెందిన ప్రముఖ ఫాస్ట్ ఫ్యాషన్ రిటైల్ కంపెనీ షీఇన్ ఉత్పత్తులను మళ్లీ రిలయన్స్ రిటైల్ స్టోర్లలో చూసే అవకాశం ఉంది. భారత్‌లో ఫ్యాషనబుల్ వేర్ అమ్మడానికి రిలయన్స్ రిటైల్ - షీఇన్ మధ్య గత సంవత్సరం ఒప్పందం కుదిరింది. ఈ భాగస్వామ్యం వల్ల, షీఇన్ ఉత్పత్తులు రిలయన్స్ రిటైల్ యాప్‌లో & ఫిజికల్ స్టోర్‌లలో అందుబాటులోకి వస్తాయి.
నాలుగేళ్ల క్రితం, షీఇన్ కంపెనీ అమ్మకాలను భారత్‌లో నిషేధించారు. ఇప్పుడు ఈ బ్రాండ్, రిలయన్స్ రిటైల్ వెంచర్ ద్వారా భారతదేశంలో తన దుస్తులను విక్రయించనుంది. మరికొన్ని వారాల్లోనే షీఇన్ బ్రాండ్ దుస్తుల అమ్మకాలు ప్రారంభం అవుతాయని సమాచారం. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, షీఇన్ ఉత్పత్తులను రిలయన్స్ రిటైల్ స్టోర్లు & యాప్ ద్వారా విక్రయించవచ్చు.
షీఇన్‌ను ఎందుకు నిషేధించారు?
భారత్-చైనా సరిహద్దులో జరిగిన గల్వాన్ ఘటన తర్వాత, చైనీస్ ఉత్పత్తులపై భారత ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించింది. ఫలితంగా, 2020 సంవత్సరంలో, భద్రత కారణాల దృష్ట్యా కొన్ని చైనీస్ యాప్‌లను నిషేధించింది. భద్రత కారణాలు, సమాచారం సేకరణ, చైనా సైన్యం నుంచి గూఢచర్యం వంటి రిస్క్‌లు ఉన్నాయనే కారణంతో ఆ యాప్‌లను బ్యాన్ చేశారు. నిషేధానికి గురైన యాప్‌ల లిస్ట్‌లో షీఇన్ పేరు కూడా ఉంది. దీంతో, ఈ కంపెనీ అమ్మకాలు భారత్‌లో నిలిచిపోయాయి.
ఫాస్ట్ ఫ్యాషన్ దుస్తులను అతి చౌక ధరలకు విక్రయించడం షీఇన్ కంపెనీ ప్రత్యేకత. దీంతో, అతి తక్కువ సమయంలోనే ప్రజల మనస్సులను, ముఖ్యంగా యువత మనస్సులు గెలుచుకుంది. చైనీస్ ఆన్‌లైన్ ఫాస్ట్-ఫ్యాషన్ రిటైలర్‌గా గుర్తింపు పొందింది. దీని మొదటి స్టోర్‌ను 2008లో చైనాలోని నాన్‌జింగ్‌లో ప్రారంభించారు. వాస్తవానికి, తొలుత ఇది షిప్పింగ్ కంపెనీగా ప్రారంభమైంది, ఆ తర్వాత బట్టలు అమ్మడం ప్రారంభించింది. క్రమంగా తన పరిధిని విస్తరిస్తూ ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ప్రస్తుతం, ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్ ఫ్యాషన్ దుస్తుల సెల్లర్‌గా షీఇన్ గుర్తింపు తెచ్చుకుంది. 2022 ఏప్రిల్ నాటికి 150 దేశాల్లో ఈ కంపెనీ అమ్మకాలు జరుగుతున్నాయి, ఆ లావాదేవీల విలువ 100 బిలియన్ డాలర్లు. ఈ కంపెనీ వ్యాపారం మొత్తం దాని వెబ్‌సైట్, యాప్ ద్వారానే జరుగుతుంది. దాదాపు 25,000 చిన్న & మధ్య తరహా స్థానిక దుస్తుల సంస్థల నుంచి బట్టలు కొనుగోలు చేసి వాటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంది.
షీఇన్‌ను కొనడానికి ట్రై చేసిన రిలయన్స్!
వాస్తవానికి, భారత్‌లో నిషేధం ఎదుర్కొంటున్న షీఇన్ బ్రాండ్‌ను కొనడానికి రిలయన్స్ రిటైల్ గట్టిగా ప్రయత్నించిందని సమాచారం. ఈ సంస్థను దక్కించుకుంటే ఫ్యాషన్ విభాగంలో మరింత లోతుగా పాతుకుపోవచ్చని ప్లాన్ వేసింది. అయితే, చర్చలు ఏ దశలో ఉన్నాయన్నదానిపై స్పష్టత లేదు. షీఇన్‌ను కైవసం చేసుకుంటే, రిలయన్స్ రిటైల్‌కు ఫాస్ట్-ఫ్యాషన్ సెగ్మెంట్‌లో దూసుకెళ్లే సత్తా వస్తుంది, మార్కెట్ షేర్ మెరుగుపడుతుంది.
రిలయన్స్ స్టోర్లు, యాప్ ద్వారా షీఇన్ భారతదేశంలోకి తిరిగి ప్రవేశించడం వల్ల... భారత్‌లో ఇప్పటికే పాతుకుపోయిన మింత్ర, టాటా గ్రూప్ యాజమాన్యంలోని జూడియో వంటి బ్రాండ్‌లకు గట్టి పోటీ ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: మీ కుమార్తెకు రూ.46 లక్షలు గిఫ్ట్ - ఈ స్కీమ్‌లో గ్యారెంటీ ఉంది