Adani Group: అదానీ గ్రూప్ సంస్థల విలీనం? - ఒకే బ్యానర్ కిందకు 4 కంపెనీలు!
Adani Group Cement Business: అదానీ గ్రూప్ గత రెండేళ్లలో 4 సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేసింది. ఇప్పుడు వాటిని ఒకే బ్యానర్ కిందకు తీసుకురావాలని భావిస్తోంది.
Merger Of Adani Group Cement Companies: గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ చేస్తున్న కీలక వ్యాపారాల్లో సిమెంట్ బిజినెస్ ఒకటి. ఈ రంగంలో సొంతంగా అభివృద్ధి చెందడంతో పాటు మరికొన్ని కంపెనీలను కూడా కొని తన ఉనికిని విస్తరిస్తోంది. త్వరలో, తన సిమెంట్ వ్యాపారం మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అంటే, గ్రూప్‌లోని సిమెంట్ కంపెనీలన్నింటినీ విలీనం చేసి, ఒకే కంపెనీగా మార్చే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి సంవత్సరాల్లో, అదానీ గ్రూప్ దేశంలోని కొన్ని పెద్ద సిమెంట్ కంపెనీలను ఒకదాని తర్వాత ఒకటి కొనుగోలు చేసింది. ఆ లిస్ట్‌లో... ఏసీసీ (ACC), అంబుజా సిమెంట్ (Ambuja Cement), సంఘీ ఇండస్ట్రీస్ (Sanghi Industries) ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో బలంగా పాతుకుపోయిన పెన్నా సిమెంట్‌ను (Penna Cement) కొనడానికి, అదానీ గ్రూప్‌లోని అంబుజా సిమెంట్ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 4 సిమెంట్ కంపెనీల విలీనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నిస్తోంది.
రెండో అతి పెద్ద సిమెంట్ కంపెనీ
అదానీ గ్రూప్... 2022 సెప్టెంబర్‌లో, ACC, అంబుజా సిమెంట్‌ను సుమారు 6.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ కంపెనీల కొనుగోలు తర్వాత, అదానీ గ్రూప్ దేశంలో రెండో అతి పెద్ద సిమెంట్ కంపెనీగా అవతరించింది. అల్ట్రాటెక్ సిమెంట్ తొలి స్థానంలో ఉంది. సిమెంట్ కంపెనీల విలీనానికి అయ్యే ఖర్చు వల్ల ఆ కంపెనీలపై పెద్దగా భారం పడదని అదానీ గ్రూప్ అభిప్రాయపడింది. అయితే... మైనారిటీ & మెజారిటీ వాటాదార్ల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత విలీన ప్రక్రియ ముందుకు సాగుతుంది.
ఈ నెలలో పెన్నా సిమెంట్ కొనుగోలు
2023 డిసెంబర్‌లో, సంఘీ ఇండస్ట్రీస్‌ను రూ.5,185 కోట్లకు అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ డబ్బు కోసం అప్పు చేయలేదు, అంతర్గత వనరుల నుంచి సేకరించింది. హైదరాబాద్‌కు చెందిన పెన్నా సిమెంట్‌ను రూ. 10,420 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. ఈ డబ్బును కూడా ఇంటర్నల్ సోర్సెస్ నుంచే సమీకరించింది. పెన్నా సిమెంట్ కొనుగోలు తర్వాత, అంబుజా సిమెంట్స్ వార్షిక సిమెంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యానికి మరో 14 మిలియన్ టన్నులు యాడ్ అవుతుంది, మొత్తం సామర్థ్యం ఏడాదికి 89 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. 2028 నాటికి సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మిలియన్ టన్నులకు పెంచాలని అంబుజా సిమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం, ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ 152.7 MTPA సామర్థ్యంతో దేశంలోనే అతి పెద్ద సిమెంట్ కంపెనీగా ఉంది.
మెరుగుపడుతున్న అంబుజా సిమెంట్ ఆర్థిక పరిస్థితి
పెన్నా సిమెంట్ కొనుగోలు ద్వారా దక్షిణ భారతదేశంలో అదానీ గ్రూప్ స్థానం బలపడుతుందని జెఫ్రీస్ లెక్కగట్టింది. అలాగే, అదానీ సిమెంట్‌కు చెందిన సముద్ర రవాణా వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. కోల్‌కతా, గోపాల్‌పూర్, కారైకల్, కోచి, కొలంబోలో ఐదు బల్క్ సిమెంట్ టెర్మినల్స్ అదానీ గ్రూప్ చేతిలో ఉన్నాయి. మరోవైపు, అంబుజా సిమెంట్ ఆర్థిక పనితీరు కూడా మెరుగుపడుతోంది. ఈ కంపెనీ షేర్లు ఈ ఏడాదిలో 21% పైగా పెరిగాయి.
మరో ఆసక్తికర కథనం: స్వాతంత్ర్య కాలం నాటి ఫ్యాక్టరీ మూసేస్తున్న బిస్కెట్ కంపెనీ - ఉద్యోగులందరికీ గుడ్‌బై