Accenture Q1 Forecast: అంచనాల కంటే తగ్గిన యాక్సెంచర్ ఆదాయం, జాగ్రత్త మరి!
మన ఐటీ రంగానికి సంబంధించి యాక్సెంచర్ నంబర్లను చాలా కీలకంగా చూడాలి.
Accenture Q1 Forecast: గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) సర్వీసెస్ మేజర్ యాక్సెంచర్ (Accenture Plc) ఆదాయం అంచనాల కంటే తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఐటీ రంగానికి సంబంధించి, యాక్సెంచర్‌ను ఒక టార్చ్ బేరర్‌గా చూడవచ్చు. ఇది ఐరిష్-అమెరికన్ కంపెనీ. డబ్లిన్‌లో ప్రధాన కార్యాలయం ఉంది. గ్లోబల్ ఐటీ ఫర్మ్స్‌లో, త్రైమాసిక ఫలితాల వివరాలను ముందుగా ఈ కంపెనీ ప్రకటిస్తుంది. దీని ఆదాయాల ఆధారంగా మన దేశంలో ఐటీ కంపెనీల ఆదాయాలు ఎలా ఉండవచ్చో మార్కెట్ అంచనా వేస్తుంది. కాబట్టి, మన ఐటీ రంగానికి సంబంధించి యాక్సెంచర్ నంబర్లను చాలా కీలకంగా చూడాలి.
2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (సెప్టెంబర్-నవంబర్) ఆదాయ అంచనాలను నిన్న (గురువారం) యాక్సెంచర్ వెల్లడించింది. సెప్టెంబర్ నుంచి ఆగస్టు వరకు ఉన్న కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా ఈ కంపెనీ లెక్కేస్తుంది కాబట్టి, సెప్టెంబర్-నవంబర్ కాలం దీనికి మొదటి త్రైమాసికం అవుతుంది.
తగ్గనున్న ఆదాయం
సెప్టెంబర్-నవంబర్ త్రైమాసికంలో ఆదాయం తగ్గవచ్చని ఈ కంపెనీ వెల్లడించింది. ఇతర రంగాలు ఐటీ ప్రాజెక్టుల కోసం చేసే వ్యయాలను తగ్గించుకోవడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బలమైన డాలర్ ప్రతికూల ప్రభావాల కారణంగా ఆదాయం తగ్గవచ్చని తెలిపింది.
Refinitiv డేటా ప్రకారం.. సెప్టెంబర్-నవంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ సగటు $16.07 బిలియన్ల ఆదాయాన్ని నమోదు చేయవచ్చన్నది విశ్లేషకుల అంచనా. అయితే, ఈ త్రైమాసిక ఆదాయాన్ని $15.20 - $15.75 బిలియన్ల మధ్య కంపెనీ అంచనా వేసింది.
డాలర్ ప్రభావం
గతంలో ఎన్నడూలేని విధంగా డాలర్ ఇండెక్స్ బలపడుతుండడం వల్ల, ఈ కంపెనీకి విదేశీ కరెన్సీల రూపంలో వచ్చే ఆదాయం తగ్గింది. ఫలితంగా, విదేశీ మారకం అంశం తమ ఆదాయంపై 8.5 శాతం ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని యాక్సెంచర్ లెక్క వేసింది.
కరెన్సీస్ బాస్కెట్‌తో పోలిస్తే, అమెరికన్ డాలర్ రెండు దశాబ్దాల గరిష్ట స్థాయికి వెళ్లింది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు 16% పెరిగింది. యాక్సెంచర్, తన మూడో త్రైమాసికం ఫలితాల సమయం నుంచి డాలర్ కష్టాలను భరిస్తోంది. కేవలం డాలర్ బలపడడం వల్లే దీని ఆదాయం తగ్గుతోంది.
2023 ఆర్థిక సంవత్సరానికి, లోకల్ కరెన్సీలో 8% నుంచి 11% ఆదాయ వృద్ధిని, $11.09 నుండి $11.41 వరకు EPSని యాక్సెంచర్ ఆశిస్తోంది.
గ్లోబల్ మేజర్లకూ కష్టకాలం
డాలర్ బలపడిన నేపథ్యంలో, మైక్రోసాఫ్ట్ (Microsoft), సేల్స్‌ఫోర్స్ (Salesforce), IBM సహా ప్రముఖ విదేశీ సంస్థల కార్యకలాపాల మీదా ప్రభావం పడింది. విదేశాల్లోని కార్యకలాపాల ద్వారా వచ్చిన అక్కడి కరెన్సీలను తిరిగి డాలర్లుగా మార్చుకునే క్రమంలో, గతంలో కంటే తక్కువ డాలర్లు వస్తాయి కాబట్టి వీటి ఆదాయం, లాభం రెండూ ప్రభావితమవుతాయి.
సేల్స్‌ఫోర్స్ కూడా, తన వార్షిక ఆదాయం & లాభాల అంచనాలను తగ్గించింది. తన క్లయింట్లు ఆచితూచి ఖర్చు పెడుతుండడాన్ని ప్రస్తావిస్తూ అంచనాలను తగ్గించింది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే గందరగోళంగా ఉన్న ఐటీ సెక్టార్ మీద దీర్ఘకాలిక ఆర్థిక మందగమనం బలమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, ఐటీల ఆదాయాన్ని తగ్గిస్తుందని ఎక్స్‌పర్ట్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ ఐటీ కంపెనీల విషయంలోనూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది కాబట్టి, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటే మంచిది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.