Tractor Sales: సెప్టెంబర్‌లో ట్రాక్టర్ సేల్ రికార్డ్ - కొత్త హైట్లకు చేరిన Mahindra, Escorts
Tractor Sales India: GST తగ్గింపు & పండుగ డిమాండ్ పెరగడంతో సెప్టెంబర్ 2025 లో ట్రాక్టర్ అమ్మకాలు పాత రికార్డులను దున్నేశాయి, కొత్త రికార్డును క్రియేట్ చేశాయి.

Tractor Sales Report September 2025 India: సెప్టెంబర్ 2025 భారతదేశ వ్యవసాయ రంగానికి చారిత్రాత్మక నెలగా నిలిచింది. ట్రాక్టర్ అండ్ మెకనైజేషన్ అసోసియేషన్ (Tractor and Mechanization Association - TMA) తాజా డేటా ప్రకారం, దేశవ్యాప్తంగా 1.46 లక్షలకు పైగా ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. సరిగ్గా ఏడాది క్రితం, అక్టోబర్ 2024లో నెలకొల్పిన 1,44,675 యూనిట్ల రికార్డును ఇప్పుడు చెరిగిపోయింది. ఈ దూకుడు వెనుక ప్రధాన కారణాలు GST తగ్గింపు & పండుగ సీజన్‌లో పెరిగిన డిమాండ్.
ట్రాక్టర్లపై GST తగ్గింపుతో రైతులకు ఉపశమనం
భారత ప్రభుత్వం సెప్టెంబర్ 22, 2025 నుంచి ట్రాక్టర్లపై GST రేటు తగ్గింపును ప్రకటించింది. ట్రాక్టర్లపై GST రేటును 12% నుంచి కేవలం 5% కి తగ్గింది. 1,800 cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన రోడ్ ట్రాక్టర్లపై పన్నును 28% నుంచి 18% కి తగ్గించారు. ఈ నిర్ణయంతో ట్రాక్టర్ ధరలు బాగా దిగి వచ్చాయి, వాటిని కొనుగోలు చేయడం రైతులకు సులభం అయింది.
2025 నాటికి ట్రాక్టర్ అమ్మకాలలో 20% పెరుగుదల
సెప్టెంబర్ 2025 అమ్మకాలు జోరుగా సాగడం వల్ల ఈ సంవత్సరం మొత్తం గణాంకాలు కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. జనవరి & సెప్టెంబర్ 2025 మధ్య మొత్తం 7.61 లక్షల ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 20% ఎక్కువ. దీపావళి సీజన్ ముగిసేసరికి ట్రాక్టర్ డిమాండ్ మరింత పెరుగుతుందని నమ్ముతున్నారు. ఈ వేగం కొనసాగితే, భారతదేశ ట్రాక్టర్ మార్కెట్ వార్షిక అమ్మకాలు 10 లక్షల యూనిట్లను అధిగమించగలవు, ఇది ఆల్ టైమ్ హై అవుతుంది. ఈ సంవత్సరం రుతుపవనాలు కూడా సాధారణం కంటే మెరుగ్గా ఉండటం వల్ల వ్యవసాయ రంగానికి ప్రధాన మద్దతు లభించింది. 2025 సెప్టెంబర్ మధ్య నాటికి, దేశంలో సగటు వర్షపాతం 108%, ఇది పంట దిగుబడిని మెరుగుపరిచింది.
కంపెనీల తయారీ & మార్కెట్ వ్యూహం
దేశంలో అతి పెద్ద ట్రాక్టర్ తయారీదారు Mahindra & Mahindra (M&M) పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా తన డీలర్ నెట్‌వర్క్‌కు సరఫరాను 50% పెంచింది. GST రేట్ల తగ్గింపు & పండుగ సమయంలో డిమాండ్ పెరగడం వల్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని కంపెనీ వ్యవసాయ పరికరాల వ్యాపార అధిపతి విజయ్ నక్రా వెల్లడించారు. మంచి వర్షాలు & ఖరీఫ్ సీజన్‌కు సానుకూల అంచనాలు ఈ డిమాండ్‌ను మరింత బలోపేతం చేశాయి.
Escorts & Sonalika Tractors అద్భుతమైన పనితీరు
Escorts Kubota సెప్టెంబర్ 2025లో, ఇప్పటివరకు అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. ఈ కంపెనీ సేల్స్ 49% పెరిగి 17,800 యూనిట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో, Sonalika Tractors 27,800 యూనిట్లను విక్రయించి, అమ్మకాల వృద్ధిని దాదాపు రెట్టింపు చేసింది.
ICRA నివేదిక
ట్రాక్టర్లపై GSTని 5% కు తగ్గించడం వల్ల గ్రామీణ మార్కెట్‌లో డిమాండ్, ముఖ్యంగా పండుగ సీజన్‌లో ఇంకా పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ICRA నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం, కొత్త TREM V ఉద్గార ప్రమాణాలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రాకముందే వినియోగదారులు ముందస్తు కొనుగోళ్లు చేయవచ్చు. ఇది, రాబోయే నెలల్లో ట్రాక్టర్ అమ్మకాలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు.





















