Car Emergency Tips: బ్రేక్ ఫెయిల్యూర్ నుంచి బ్యాటరీ డౌన్ వరకు - ఎమర్జెన్సీలో ఈ ట్రిక్స్ మీ ప్రాణాలను కాపాడతాయి!
Emergency Secret Button In Car: మీ కారులో మీరు అత్యవసర పరిస్థితిలో చిక్కుకుంటే మీ ప్రాణాలను కాపాడే ఒక సీక్రెట్ బటన్ దాగి ఉందని మీకు తెలుసా? ఈ హిడెన్ బటన్‌ను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

Car Hidden Button For Emergency: నేటి ఆధునిక కార్లు లగ్జరీ & పనితీరు కోసం మాత్రమే కాకుండా, ప్రయాణీకుల భద్రత & అత్యవసర పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందుతున్నాయి. అయితే, మన దేశంలో కోట్లాది మంది కార్లను నడుపుతున్నప్పటికీ, డ్రైవింగ్‌లో ఉద్ధండ పిండాలుగా పేరు తెచ్చుకున్నప్పటికీ వారిలో చాలా మందికి కారులో ఉన్న కీలక ఎమర్జెన్సీ ఫీచర్ల గురించి తెలియదు. ఆఖరికి, డ్రైవింగ్ స్కూల్ పెట్టుకుని, కారు డ్రైవింగ్ నేర్పే శిక్షకులకు కూడా కొన్ని సీక్రెట్ హ్యాక్స్ గురించి తెలీదు. వాటిని ట్రిక్స్ అనొచ్చు లేదా టిప్స్ అనొచ్చు - పేరు ఏదైనా సంక్షోభ సమయాల్లో మీ ప్రాణాలను కాపాడే ఉపాయాలు అవి.
కారు గేరు లాక్ అయిందా? ఈ ట్రిక్ ప్రయత్నించండి
మీ కారు గేర్ మోడ్ నుంచి బయటకు రాకపోతే లేదా 'కీ'ని ఇన్‌సెర్ట్ చేసిన తర్వాత కూడా ఇంజిన్ స్టార్ట్ కాకపోతే, భయపడాల్సిన అవసరం లేదు. గేర్ షిఫ్టర్ దగ్గర ఒక చిన్న పసుపు బటన్ లేదా స్లైడింగ్ కవర్ ఉంటుంది. అక్కడ మీ కారు 'కీ'ని చొప్పించి తేలికగా నొక్కండి, ఇది గేర్ లాక్‌ను రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మీరు కారును మాన్యువల్ మోడ్‌లో న్యూట్రల్‌లోకి మార్చవచ్చు. ముఖ్యంగా టోయింగ్ లేదా పార్కింగ్ సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
స్మార్ట్ కీ బ్యాటరీ అయిపోయిందా? అయినా తలుపు తెరుచుకుంటుంది
స్మార్ట్ కీ (Key Fob) బ్యాటరీ డెడ్ అయి రిమోట్ పనిచేయకపోతే, కారు తలుపును మాన్యువల్‌గా తెరవడం కూడా సాధ్యమే. డోర్ హ్యాండిల్ కింద ఒక చిన్న రంధ్రం లేదా కవర్ ఉంటుంది. దానిని ఓపెన్ చేసి, మీ మెకానికల్ కీని ఉపయోగించి తలుపు తెరవచ్చు. ఈ ఫీచర్ దాదాపు ప్రతి కారులో అందుబాటులో ఉంది, కానీ చాలా తక్కువ మందికి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసు.
బ్రేకులు ఫెయిల్ అయితే సురక్షితంగా ఎలా బయటపడాలి?
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు బ్రేకులు విఫలమైతే, ముందుగా టెన్షన్ పడొద్దు. హ్యాండ్ బ్రేక్‌ను నెమ్మదిగా పైకి లాగి పట్టుకోండి, ఇది క్రమంగా వాహనం వేగాన్ని తగ్గిస్తుంది. ఇక్కడ కచ్చితంగా గుర్తుంచుకోవలసిన విషయం అకస్మాత్తుగా హ్యాండ్ బ్రేక్‌ను లాగడం వల్ల మీ వాహనం నియంత్రణ తప్పి బోల్తా కొట్టవచ్చు. కాబట్టి, బ్యాండ్ బ్రేక్ లాగే ప్రక్రియను నెమ్మదిగా & నియంత్రిత పద్ధతిలోనే చేయాలి.
కారులో ఇరుక్కుపోతే ఎలా బయటపడాలి?
మీరు ఎప్పుడైనా ప్రమాదంలో కారు లోపల లేదా ట్రంక్‌లో ఇరుక్కుపోతే, తప్పించుకోవడానికి ఒక మార్గం రెడీగా ఉంటుంది. కారు వెనుక సీట్ల దగ్గర ఒక బటన్ లేదా లివర్ ఉంటుంది, దానిని నొక్కి ఆ సీటును మడవవచ్చు. దీని తర్వాత, ట్రంక్ వద్దకు వెళ్లండి, అక్కడ ఎమర్జెన్సీ స్విచ్ ఉంటుంది. బాణం సూచించిన దిశలో ఈ స్విచ్‌ను నొక్కండి, ట్రంక్ తెరుచుకుంటుంది & మీరు సులభంగా బయటపడవచ్చు.
కారు డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరు ఈ బటన్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా, తాను సురక్షితంగా ఉండడంతో పాటు కారులోని ఇతరుల ప్రాణాలను కూడా కాపాడగలుగుతారు. ఇంకా.. కారులో అదనంగా ఒక టైరు, పంక్చర్ పడిన టైరును మార్చే సామగ్రి, ఒక మెడికల్ కిట్, ఒకటి లేదా రెండు వాటర్ బాటిల్స్ పెట్టుకోండి. అత్యవసర సమయాల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి.





















