Tata Altroz Facelift: టాటా అల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్, రేసర్ మోడల్స్ త్వరలో - టీజ్ చేసిన కంపెనీ!
Tata New Car: ప్రముఖ కార్ల బ్రాండ్ టాటా తన కొత్త కారును మనదేశంలో లాంచ్ చేయనుంది. అదే అల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్.
Tata Altroz Facelift Launch: టాటా మోటార్స్ 2024, 2025లో ఆల్ట్రోజ్, పంచ్ మోడల్స్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కంపెనీ ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ను పరీక్షించడం ప్రారంభించింది. ఇటీవల ఇది పూర్తిగా కవర్ అయిన స్పై షాట్‌లను కూడా విడుదల చేసింది. దీని కారణంగా డిజైన్ వివరాల గురించి ఎక్కువ సమాచారం పొందలేకపోయింది. ఏది ఏమైనప్పటికీ 2024 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ చేసిన బంపర్‌లతో సహా అనేక కాస్మొటిక్ మార్పులను పొందుతుందని అంచనా. దీని డిజైన్ టాటా రాబోయే ఎస్‌యూవీ లైనప్ నుంచి ఇన్‌స్పైర్ కానుంది.
దీని వెలుపలి భాగం ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఉంటుందని అంచనా. అయితే ఇంటీరియర్ చాలా పెద్ద అప్‌గ్రేడ్‌లను పొందవచ్చని భావిస్తున్నారు. కొత్త ఆల్ట్రోజ్ డ్యాష్‌బోర్డ్ మధ్యలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని స్పై షాట్‌లు వెల్లడిస్తున్నాయి. ఈ అప్‌డేట్ అయిన హ్యాచ్‌బ్యాక్‌లో 7.0 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్
2024 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు కనిపించవు. ఇది వరుసగా 88 బీహెచ్‌పీ, 110 బీహెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేసే 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లతో అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌తో కూడా అందుబాటులో ఉండనుంది. ఇది టాటా ట్విన్ సిలిండర్ సీఎన్‌జీ టెక్నాలజీతో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ డీని కలిగి ఉన్న మోడల్ వలెనే ఉంటాయి.
టాటా ఆల్ట్రోజ్ రేసర్ కూడా
ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అయిన తర్వాత టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ రేసర్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీన్ని గత ఏడాది జరిగిన ఆటో ఎక్స్‌పోలో మొదటిసారి ప్రదర్శించారు. ఈ హ్యాచ్‌బ్యాక్ స్పోర్టియర్‌గా, మరింత శక్తివంతమైన వేరియంట్‌గా మార్కెట్లోకి రానుంది. ఆల్ట్రోజ్ రేసర్ అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఇది 120 బీహెచ్‌పీ పవర్‌ని అందించే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ లేదా టాటా కొత్త 125 బీహెచ్‌పీ అందించే 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. దీన్ని త్వరలో రాబోయే టాటా కర్వ్ కూపే ఎస్‌యూవీలో కూడా అందించనున్నారు.
మరోవైపు టాటా నెక్సాన్ ఆధిపత్యం భారతీయ మార్కెట్లో ఇంకా కొనసాగుతోంది. టాటా మోటార్స్ నెక్సాన్ ఆరు లక్షల యూనిట్లను తయారు చేయడం విశేషం. కంపెనీ ఈ సబ్ ఫోర్ మీటర్ ఎస్‌యూవీని మొట్టమొదటిగా 2017లో విడుదల చేసింది. ఈ కారు భారతీయ కస్టమర్ల హృదయాలను గెలుచుకుంది. 2023 ఏప్రిల్‌లో ఈ మోడల్ ఐదు లక్షల యూనిట్ల ఉత్పత్తి మార్కును అధిగమించింది. టాటా నెక్సాన్ భారతదేశంలో ఐసీఈ, ఈవీ మోడల్స్‌లో అందుబాటులో ఉంది.