Skoda Superb: ఆపేసిన కారు తిరిగి తెచ్చిన స్కోడా - ధరలో మాత్రం షాకింగ్ పెరుగుదల!
Skoda Superb Relaunch: ప్రముఖ కార్ల బ్రాండ్ స్కోడా తన కొత్త కారును మనదేశంలో లాంచ్ చేసింది.
Skoda Superb Relaunch in India: స్కోడా సూపర్బ్ తన రెండో తరం మోడల్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. స్కోడా సూపర్బ్ మార్కెట్లో కేవలం 100 యూనిట్లను మాత్రమే విడుదల చేసింది. ఈ 100 యూనిట్లు భారతదేశంలోకి దిగుమతి అయ్యాయి. గత ఏడాది ఏప్రిల్‌లోనే స్కోడా సూపర్బ్ ఈ మోడల్‌ను భారత మార్కెట్లో నిలిపివేసింది. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత స్కోడా ఈ మోడల్‌ను భారతదేశంలో తిరిగి లాంచ్ చేసింది.
2024 స్కోడా సూపర్బ్ ఫీచర్లు
2024 సంవత్సరంలో స్కోడా సూపర్బ్‌కు సంబంధించి ఒక వేరియంట్ మాత్రమే మార్కెట్లోకి వచ్చింది. స్కొడా సూపర్బ్ ఎల్ అండ్ కే వేరియంట్ ఇంతకు ముందు ఇండియన్ మార్కెట్‌లో ఉంది. దీని ఫీచర్లను 2024 సంవత్సరంలో లాంచ్ చేయబడిన మోడల్‌లో అప్‌డేట్ చేశారు. డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ టెక్నాలజీని 2024 స్కోడా సూపర్బ్‌లో ఉపయోగించారు. దీంతో పాటు యాక్టివ్ టైర్ మానిటరింగ్ ప్రెజర్ సిస్టమ్, సెక్యూరిటీ కోసం 9 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా వాహనంలో అందించారు. స్కోడా సూపర్బ్ కొత్త మోడల్‌లో 9 అంగుళాల కొలంబస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది 2023 మోడల్‌లో లేదు.
Introducing the new Škoda Superb, now available in unique Škoda shades for the first time ever. This luxurious sedan carries on our prestigious heritage and is reintroduced exclusively for you.
— Škoda India (@SkodaIndia) April 3, 2024
Book a test drive: https://t.co/V15Jzyj5bl#SkodaSuperb #SkodaIndia pic.twitter.com/fp8kFkLj6c
2024లో మళ్లీ లాంచ్ చేసిన స్కోడా సూపర్బ్ మోడల్ మూడు ఎక్స్‌టీరియర్ పెయింట్ షేడ్స్‌తో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. రోస్సో బ్రూనెల్లో, వాటర్ వరల్డ్ గ్రీన్, మ్యాజిక్ బ్లాక్ కలర్ వేరియంట్లలో ఈ కారు లాంచ్ అయింది. అలాగే ఇందులో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
2024 స్కోడా సూపర్బ్ ఇంజిన్ ఇలా...
2024 స్కోడా సూపర్బ్ బీఎస్6 ఫేజ్ II-కంప్లైంట్ 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ పవర్ ప్లాంట్‌తో మార్కెట్లోకి వచ్చింది ఇది 190 హెచ్‌పీ పవర్, 320 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రీ లాంచ్ అయిన ఈ కారు ఇంజన్ మునుపటి మోడల్ లాగానే ఉంటుంది. దీని పవర్‌ట్రెయిన్‌లో 7 స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అందించారు.
స్కోడా సూపర్బ్ ధర ఎంత?
2023 సంవత్సరంలో ఆపేసిన మోడల్‌ను స్కోడా మరోసారి తిరిగి తీసుకొచ్చింది. కానీ ఈసారి కంపెనీ స్కోడా సూపర్బ్ ధరను పెంచింది. రీ లాంచ్ చేసిన స్కోడా సూపర్బ్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 54 లక్షలుగా ఉంది. ఇది గత సంవత్సరం కంటే ఏకంగా రూ. 16.71 లక్షలు ఎక్కువ. స్కోడా సూపర్బ్ ధర పెరగడానికి కారణం ఈ కారును పూర్తిగా దిగుమతి చేసుకోవడం. దిగుమతి సుంకాల కారణంగా ధర చాలా ఎక్కువ అయింది.
Also Read: మొదటిసారి అలాంటి కారు తయారు చేయనున్న టెస్లా - భారతదేశం కోసమే!