పవర్‌ఫుల్ స్పోర్టీ ఇంజిన్‌తో Skoda Octavia RS త్వరలోనే లాంచ్ - ప్రి-బుకింగ్ డేట్ కూడా వచ్చింది
Skoda Octavia RS ఈ ఏడాదే భారతదేశంలో లాంచ్ కానుంది. ప్రి-బుకింగ్స్ త్వరలో ప్రారంభమవుతాయి. ఫీచర్లు, ఇంజిన్ & లాంచ్ వివరాలను నిశితంగా పరిశీలిద్దాం.

Skoda Octavia RS India Launch Pre Booking Date: స్కోడా ఇండియా, మరోసారి తన పెర్ఫార్మెన్స్ కారును భారత ఆటోమొబైల్ మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. Skoda Octavia RS ను మరో రెండు నెలల్లో, అంటే నవంబర్ 2025లో భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు ఈ కంపెనీ ధృవీకరించింది. దీనిని FBU (ఫుల్లీ బిల్ట్ యూనిట్) గా దిగుమతి చేసుకుంటారు. అంతేకాదు, ఈ కారును ఇది పరిమిత సంఖ్యలోనే విక్రయిస్తారు.
స్కోడా ఆక్టేవియా RS ప్రి-బుకింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఆక్టేవియా RS కోసం ప్రి-బుకింగ్స్ దసరా పండుగ తర్వాత, అక్టోబర్ 6, 2025 నుంచి ప్రారంభమవుతాయని స్కోడా ఇండియా ప్రకటించింది. కస్టమర్లు ఈ కారును ఆన్‌లైన్‌లో లేదా అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.
స్కోడా ఆక్టేవియా RS అడ్వాన్స్‌డ్ ఫీచర్లు
కొత్త ఆక్టేవియా RS, అనేక ప్రీమియం & స్పోర్టీ ఫీచర్లతో (Skoda Octavia RS Features) మన దేశంలోకి ప్రవేశిస్తుంది. ఎరుపు రంగు ఇన్సర్ట్స్‌తో పూర్తి నలుపు రంగు ఇంటీరియర్‌తో ఇది వస్తుంది, ఈ కాంబినేషన్ స్పోర్ట్స్ కారు లాంటి లుక్స్ ఇస్తుంది. ఈ కారులో RS బ్యాడ్జింగ్‌తో కూడిన స్పోర్ట్స్ సీట్లు, కార్బన్ ఫైబర్ ఫినిషింగ్, 13-అంగుళాల సెంట్రల్ డిస్‌ప్లే, స్టాండర్డ్ నావిగేషన్ సిస్టమ్ & 10-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. త్రి-స్పోక్ స్టీరింగ్ వీల్, మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్లు, సీట్ కుషన్లు, అల్యూమినియం-ఫినిష్డ్ పెడల్స్ & 64-కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి మోడ్రన్ & ఫీల్ ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. లైటింగ్ ప్యాకేజీలో.. LED మ్యాట్రిక్స్ హెడ్‌లైట్లు, వెనుక LED లైట్లు ఉంటాయి. ఈ కారుకు 18 & 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇస్తారు. ప్రయాణీకుల కోసం చాలా అధునాతన భద్రత లక్షణాలు కూడా అందిస్తున్నారు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పవర్‌ఫుల్ ఇంజిన్‌తో స్పోర్టీ ఎక్స్‌పీరియన్స్
స్కోడా ఆక్టేవియా RS, ఇప్పుడు ఉన్న ఆక్టేవియా కంటే శక్తిమంతమైన ఇంజిన్‌తో (Skoda Octavia RS Engine) వస్తుంది. అంతర్జాతీయంగా, ఇది 2.0-లీటర్ TSI ఇంజిన్‌తో అమ్ముడవుతోంది, ఈ ఇంజిన్ 265 హార్స్‌పవర్ & 370 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ DSG ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమైంది. వేగం పరంగా, ఈ కారు కేవలం 6.4 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ./గం వేగాన్ని అందుకుంటుంది. అంతేకాదు, ఆక్సిలేటర్ తొక్కి పడితే గంటకు గరిష్టంగా 250 కి.మీ. వేగాన్ని (Skoda Octavia RS Top Speed) అందుకుంటుంది, తుపాకీ తూటాకు కూడా దొరకదు. ఈ ఇంజిన్ కాన్ఫిగరేషన్ భారతదేశంలో కూడా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
మీరు, హై ఎండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రీమియం స్పోర్ట్స్ సెడాన్ కోసం చూస్తున్నట్లయితే, స్కోడా ఆక్టేవియా RS మీ అభిరుచికి సరిగ్గా సరిపోవచ్చు. కంపెనీ దీనిని ఈ ఏడాది నవంబర్‌లోనే లాంచ్ చేస్తుంది కాబట్టి, మీ కలల కారు అతి త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ప్రి-బుకింగ్స్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభమవుతాయి. అయితే, తక్కువ యూనిట్లు మాత్రమే అమ్ముతారు కాబట్టి, ఆలస్యం చేస్తే ఆశాభంగం అవుతుంది.



















