కైలాక్ నుంచి కొడియాక్ వరకు బాదుడు.. స్కోడా కార్ల ధరలు రూ.20,000 వరకు పెంపు
అక్టోబర్ 1 నుంచి స్కోడా కార్ల ధరలు పెరిగాయి. కైలాక్, స్లావియా, కుషాక్, కొడియాక్ ధరలపై గరిష్ఠంగా రూ.20,000 వరకు పెంపు అమల్లోకి వచ్చింది.

Skoda hike prices from October 2026: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నవాళ్లకు షాకింగ్ న్యూస్. స్కోడా కారు కొనాలంటే ఇకపై జేబుకు మరింత చిల్లు పడనుంది. ఇండియన్ మార్కెట్‌లో తన కార్ల ధరలను స్కోడా పెంచింది. అక్టోబర్ 1, 2026 నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి వచ్చింది.
స్కోడా ఇండియా పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడళ్లపై ధరలు గరిష్ఠంగా 1.2 శాతం వరకు పెరిగాయి. అయితే, పెంచిన ధర ఏ మోడల్‌ను బట్టి మారుతుంది. వేరియంట్‌ను బట్టి కూడా ధర మారుతుంది. ధరల పెంపును గరిష్ఠ రూ.20,000కు పరిమితం చేసినట్లు స్కోడా తెలిపింది.
ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం & నిర్వహణ వ్యయాలు అధికం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్కోడా వెల్లడించింది. ప్రస్తుతం ఈ కంపెనీ భారత మార్కెట్‌లో కైలాక్, స్లావియా, కుషాక్, కొడియాక్ మోడళ్లను విక్రయిస్తోంది.
మోడళ్లు - పెరిగిన ధరలు
Kylaq ధర ప్రస్తుతం రూ.7.59 లక్షల నుంచి రూ.12.99 లక్షల వరకు ఉంది. గరిష్ఠంగా 1.2 శాతం పెంపును లెక్కిస్తే రూ.15,588 వరకు అదనపు భారం పడుతుంది.
Slavia ధర ప్రస్తుతం రూ.10 లక్షల నుంచి రూ.18.19 లక్షల వరకు ఉంది. ఈ మోడల్‌పై గరిష్ఠంగా రూ.20,000 వరకు ధర పెరగొచ్చు.
Kushaq ధర రూ.10.69 లక్షల నుంచి రూ.18.99 లక్షల మధ్య ఉంది. ఈ కారుపైనా గరిష్ఠంగా రూ.20,000 వరకు పెంపు ఉంటుంది.
Kodiaq ధర రూ.36.99 లక్షల నుంచి రూ.66.99 లక్షల వరకు ఉంది. ఈ ప్రీమియం ఎస్‌యూవీపై గరిష్ఠంగా రూ.20,000 వరకు ధర పెరగొచ్చు.
ఇది కూడా చదవండి: Renault Triber 7-సీటర్ ఫ్యామిలీ కారు.. రూ.1.16 లక్షల డౌన్‌పేమెంట్ చాలు, మిగిలింది EMIల్లో చూసుకోవచ్చు
పైన చెప్పిన లెక్కలు గరిష్ఠంగా 1.2 శాతం పెంపును ఆధారంగా చేసుకుని చేసిన అంచనాలు మాత్రమే. మోడల్ & వేరియంట్ వారీగా ఖచ్చితమైన కొత్త ధరలను స్కోడా ఇంకా ప్రకటించలేదు. కాబట్టి వాస్తవ ధరల పెంపు కొంత తక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది.
ఇది రెండోసారి
స్కోడా కార్ల ధరలు ఈ ఏడాది ఇప్పటికే ఒకసారి పెరిగాయి. జనవరిలో జరిగిన ధరల సవరణలో స్లావియా, కైలాక్, కుషాక్ కొనేవాళ్లకు షాక్ తగిలింది. స్లావియా ధర గరిష్ఠంగా రూ.34,000 వరకు పెరిగింది. కైలాక్ రేటు రూ.19,000 వరకు పెరిగింది. కుషాక్ ధర రూ.5,000 నుంచి రూ.7,000 వరకు పెరిగింది.
ఇప్పుడు మరోసారి ధరల పెంపుతో కొత్త కారు కొనేవాళ్లపై అదనపు భారం పడనుంది. ముఖ్యంగా, ఈ పండుగల సీజన్‌లో కార్లకు డిమాండ్ పెరిగే సమయంలో ఈ నిర్ణయం అమల్లోకి రావడం గమనార్హం.
ఇదిలా ఉంటే, స్లావియా ఫేస్‌లిఫ్ట్ (Slavia Facelift) అక్టోబర్ 6న మార్కెట్‌లోకి రానుంది. ఈ కొత్త మోడల్ కోసం ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.
ఇది కూడా చదవండి: Renault Triber కొనేవాళ్ల అసలు ఛాయిస్ ఇదే.. ఈ వేరియంట్‌లో ఫీచర్లు & పవర్ రెండూ పక్కా!
ఇటీవల, మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా, మహీంద్రా & టాటా మోటార్స్ వంటి కంపెనీలు కూడా ధరలను పెంచాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















