మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందని టెన్షన్ వద్దు.. ఇంట్లో కూర్చునే ఎలా రెన్యువల్ చేసుకోవాలంటే?
డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైర్ అయితే ఎలా రెన్యువల్ చేసుకోవాలి? అవసరమైన పత్రాలు, ఫీజు, ఆన్‌లైన్ విధానం, గడువు వివరాలను 2026 గైడ్‌లో తెలుసుకోండి.

Driving Licence renewal in India 2026: డ్రైవింగ్ లైసెన్స్ అనేది ప్రతి వాహనదారుడికి ఎంతో కీలకమైన డాక్యుమెంట్. రోడ్లపై చట్టబద్ధంగా వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఇది చాలా సందర్భాల్లో గుర్తింపు పత్రంగానూ ఇది ఉపయోగపడుతుంది. అయితే చాలామంది తమ లైసెన్స్ గడువు తేదీని గుర్తించుకోరు. గడువు ముగిసిన తర్వాతే రెన్యువల్ గురించి ఆలోచిస్తారు.
ఒకవేళ మీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పటికే ఎక్స్‌పైర్ అయిందా? అయినా భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియలో ఎక్కువ భాగం ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం పరివాహన్ (Parivahan portal) సేవలను ఉపయోగించుకోవచ్చు. లైసెన్స్ ఎప్పుడు ఎక్స్‌పైర్ అయిందనే విషయాన్ని బట్టి కొన్ని అదనపు నిబంధనలు వర్తించవచ్చు.
లైసెన్స్ రెన్యువల్ ఎందుకు ముఖ్యం?
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత, చట్టప్రకారం వాహనం నడపడం కుదరదు. ట్రాఫిక్ తనిఖీల సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రమాదం జరిగినప్పుడు కూడా చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకపోవడం సమస్యగా మారుతుంది. బీమా క్లెయిమ్ సమయంలోనూ ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే లైసెన్స్ గడువు ముగిసేలోపే రెన్యువల్ చేసుకోవడం మంచిది. గడువు ముగిసిపోయినా వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయడం ఉత్తమం.
రెన్యువల్ కోసం ఏ పత్రాలు అవసరం?
ప్రస్తుతం ఉన్న మీ డ్రైవింగ్ లైసెన్స్ (గడువు ముగిసినా సరే), గుర్తింపు ధ్రువీకరణ పత్రం, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఫొటోలు వంటి పత్రాలు అవసరం కావచ్చు. వయస్సు లేదా వాహన కేటగిరీని బట్టి వైద్య ధ్రువీకరణ పత్రం కూడా అవసరం కావచ్చు.
ఆన్‌లైన్‌లో ఎలా రెన్యువల్ చేసుకోవాలి?
ముందుగా పారివాహన్ అధికారిక వెబ్‌సైట్ (Parivahan portal)లోకి వెళ్లాలి. అక్కడ, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన సేవలను ఎంచుకోవాలి. అనంతరం రెన్యువల్ ఆప్షన్‌ను ఎంచుకుని లైసెన్స్ వివరాలు నమోదు చేయాలి. అడిగిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అవసరమైన ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఆ తర్వాత దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌లోనే పరిశీలించవచ్చు.
ఇది కూడా చదవండి: Hyundai i20 ఆఫర్: మీకు కార్ లోన్ ఎంత వస్తుంది? ఆన్-రోడ్ ధర, EMI వివరాలు
రెన్యువల్ ఫీజు ఎంత?
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌కు సాధారణంగా రూ.200 వరకు ఫీజు ఉండొచ్చు. స్మార్ట్ కార్డు కోసం అదనంగా రూ.200 నుంచి రూ.500 వరకు ఛార్జీలు ఉండే అవకాశం ఉంది. వైద్య ధ్రువీకరణ పత్రం అవసరమైతే దానికి అదనపు ఖర్చు ఉంటుంది. గడువు దాటిన సందర్భాల్లో ఆలస్య రుసుము కూడా వర్తించవచ్చు. రాష్ట్రం & RTOను బట్టి ఫీజుల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
లైసెన్స్ ఎంతకాలం చెల్లుబాటు అవుతుంది?
లైసెన్స్ చెల్లుబాటు డ్రైవర్ వయస్సు & లైసెన్స్ కేటగిరీపై ఆధారపడి ఉంటుంది. 40 ఏళ్ల లోపువారికి సాధారణంగా 20 ఏళ్ల వరకు లేదా 40 ఏళ్ల వయస్సు వచ్చే వరకు చెల్లుబాటు ఉంటుంది. 40 నుంచి 50 ఏళ్ల మధ్య వారికి 10 ఏళ్ల వరకు చెల్లుబాటు ఉంటుంది. 50 ఏళ్లు దాటిన వారికి సాధారణంగా 5 ఏళ్ల చెల్లుబాటు ఉంటుంది. రవాణా వాహనాల లైసెన్స్‌లకు వేర్వేరు నిబంధనలు ఉండొచ్చు.
రెన్యువల్‌లో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. వ్యక్తిగత వివరాలు సరిగ్గా ఉన్నాయో తనిఖీ చేయాలి. చెల్లింపులు అధికారిక ప్రభుత్వ పోర్టల్‌లోనే చేయాలి. రసీదు & దరఖాస్తు వివరాలను భద్రంగా ఉంచుకోవాలి.
ఇది కూడా చదవండి: Honda Elevate: రూ.3 లక్షల డౌన్‌పేమెంట్ చేసి హోండా ఎలివేట్ కొనొచ్చా? EMI ఎంత పడుతుంది?
సాధారణంగా, లైసెన్స్ ఎక్స్‌పైర్ కావడానికి కనీసం నెల రోజుల ముందే రెన్యువల్ ప్రక్రియ ప్రారంభించడం మంచిది. ఒకవేళ ఇప్పటికే ఎక్స్‌పైర్ అయితే ఆలస్యం చేయకుండా రెన్యువల్ పనిని మొదలు పెట్టండి. దీనివల్ల అనవసరమైన జరిమానాలు, చట్టపరమైన ఇబ్బందులు & ఇతర సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















