Petrol vs CNG vs Hybrid Car: పెట్రోల్ కార్ vs CNG కార్ vs హైబ్రిడ్ కార్ - ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది బెస్ట్
Low Running Cost Cars: ఇంధన ధరలు, మైలేజ్, నిర్వహణ ఖర్చులు, భవిష్యత్తులో వినియోగ ప్రయోజనాల ఆధారంగా 2025లో మీకు బెస్ట్ ఆప్షన్ ఏదో తెలుసుకోండి.

Fuel Efficient Cars Comparison 2025: మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి & సామాన్యుడు అందుకోలేనంత ఎత్తులో, ఇప్పుడవి ఎవరెస్ట్ శిఖరంపైకి ఎక్కి కూర్చున్నాయి. దీంతోపాటు, పర్యావరణ అనుకూలమైన వాహనాల అవసరం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలోనే, CNG (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) & హైబ్రిడ్ కార్లు మార్కెట్లో బాగా అమ్ముడవుతున్నాయి. 2025లో, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, మీరు ఎలాంటి వాహనాన్ని ఎంపిక చేసుకోవాలి? - ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాం.
పెట్రోల్ కార్లు – అందుబాటు ధరల్లో లభిస్తాయి
పెట్రోల్ కార్లు ధరపరంగా అందుబాటులో ఉంటాయి. మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది. అయితే పెట్రోల్ ధరలు పెరిగిన దృష్ట్యా వీటి రన్నింగ్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రోజూ చిన్న ప్రయాణాలకు, తక్కువ కిలోమీటర్లు డ్రైవ్ చేసే వారికి ఇవి బాగుంటాయి.
CNG కార్లు – తక్కువ ఖర్చుతో ప్రయాణం
పెట్రోల్ వాహనాలతో పోలిస్తే CNG వాహనాలు ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. దాదాపు, సగటున లీటర్‌కు 25-30 కిలోమీటర్లు రావచ్చు. కాకపోతే, CNG బూత్‌లు అందుబాటులో లేకపోవడం, ట్యాంక్ స్థలం ఎక్కువ తీసుకోవడం వంటి కొన్ని పరిమితులు ఉంటాయి. రోజూ ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించే వారికి ఇది సరైన ఆప్షన్.
హైబ్రిడ్ కార్లు – భవిష్యత్తుకు సరైన దారి
హైబ్రిడ్ కార్లు.. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు బ్యాటరీని ఉపయోగించుకుని మైలేజ్ పెంచుతాయి. ఇవి ఆటోమేటిక్‌గా బ్యాటరీకి స్విచ్ అవుతుంటాయి, ప్రత్యేకంగా ఛార్జింగ్ అవసరం ఉండదు. టెక్నాలజీ పరంగా ఇవి అధునాతనంగా ఉన్నప్పటికీ, కొంతమంది వాటి ధరను అధికంగా భావించవచ్చు. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఇవి మంచి ఎంపిక.
మెయింటెనెన్స్ వ్యత్యాసం
పెట్రోల్ కార్లు, సాధారణంగా, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఉంటాయి. CNG వాహనాలపై కొంత ఎక్కువ శ్రద్ధ అవసరం. హైబ్రిడ్ వాహనాలు టెక్నాలజీ ఆధారితం కావడం వల్ల, వాటి మెయింటెనెన్స్ కొంచెం ఖరీదుగా ఉండొచ్చు.
కార్ల ఫ్యూయల్ రకాల మధ్య తేడాలు:
| పెట్రోల్ కార్లు | CNG కార్లు | హైబ్రిడ్ కార్లు | |
| ప్రారంభ ధర | తక్కువ | మధ్యస్థం | ఎక్కువ |
| మైలేజ్ (సగటున) | 17-21 కిమీ/లీటరు | 25-30 కిమీ/కిలో | 20-27 కిమీ/లీటరు |
| నిర్వహణ ఖర్చు | సాధారణం | తక్కువ | కొంచెం ఎక్కువ |
| పెర్ఫార్మెన్స్ | శక్తిమంతం | కొంచెం తక్కువ | స్మూత్ & సమర్థవంతమైన |
| లాంగ్‌డ్రైవ్‌కు | అనుకూలం | కొంత అసౌకర్యం | మంచి ఎంపిక |
| పర్యావరణ ప్రభావం | ఎక్కువ కర్బన ఉద్గారం | తక్కువ ఉద్గారం | అత్యల్ప ఉద్గారం |
మీ ప్రయోజనాలపై ఆధారపడి ఎంపిక
మీరు తరచుగా చేసే ప్రయాణాలు, ఇంధన బడ్జెట్, లాంగ్‌టర్మ్ ప్లాన్స్ ఆధారంగా మీకు సరిపడే వాహనాన్ని ఎంపిక చేసుకోవచ్చు. రోజూ ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించే వారు CNG వైపు, అధునాతన టెక్నాలజీ కోరుకునే వారు హైబ్రిడ్ వైపు, తక్కువ ప్రయాణం చేసే వారు పెట్రోల్ వైపు మొగ్గు చూపవచ్చు. 2026 నాటికి ఈ మూడు వర్గాల కార్లన్నీ మరింత మెరుగైన ఫీచర్లతో అందుబాటులోకి రానున్నాయి.





















