Ola Electric Motorcycle : ఓలా నుంచి తొలిసారి ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల.. ప్రారంభ ధర కేవలం రూ.74,999 మాత్రమే
Ola Electric Roadster Series Bikes: ఓలా ఎలక్ట్రిక్ తొలిసారిగా మార్కెట్లోకి మోటార్ సైకిళ్లను విడుదల చేసింది. రోడ్‌స్టర్ సిరీస్‌లో విడుదల చేసిన ఈ బైక్స్ ప్రారంభ ధర కేవలం రూ. 74,999 గానే ఉంది.
Ola First ever Electric Motorcycles launched: మార్కెట్‌లో ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తొలి స్థానంలో ఉంది. అయితే ఇప్పటి వరకూ ఆ కంపెనీ కేవలం స్కూటర్లను మాత్రమే విడుదల చేసింది. తాజాగా రోడ్‌స్టర్ సిరీస్ (Ola Electric Roadster Series Bikes) కింద భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంకల్ప్ 2024 పేరుతో ఓలా ఎలక్ట్రిక్ నిర్వహిహించిన ఈవెంట్‌లో ఈ బైక్స్‌ని ప్రవేశపెట్టింది. ఆ కంపెనీ విడుదల చేసిన రోడ్‌స్టర్ సిరీస్‌లో మూడు వేరియంట్లు ఎనిమిది బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి. అవి రోడ్‌స్టర్ X, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రోగా ఉన్నాయి. వీటి వివరాలు మీ కోసం..
ఓలా రోడ్‌స్టర్ X (Ola Electric Roadster X)
ఇది బేస్ వేరియంట్‌గా ఉంది. ఈ రోడ్‌స్టర్ ఎక్స్ ప్రారంభ ధర రూ.74,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇంత తక్కువ ధరలో ఈ బైక్‌ని ప్రవేశపెట్టం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇందులో 2.5 kW బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ వేరియంట్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరతో సమానంగా బైక్ ధరలు కూడా ఉండటం గమనార్హం. ఈ రోడ్‌స్టర్ X 3.5kW, 4.5kW బ్యాటరీ ప్యాక్‌లలోనూ అందుబాటులో ఉంది. 3.5kW బ్యాటరీ ప్యాక్ వెర్షన్ ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 4.5kW బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే టాప్-స్పెక్ మోడల్ ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.
ఓలా రోడ్‌స్టర్ (Ola Electric Roadster)
మిడ్-రేంజ్ ఓలా రోడ్‌స్టర్ వేరియంట్ ఈ వేరియంట్ మొత్తం 3 బ్యాటరీ ఆప్షన్స్‌తో వస్తుంది. రోడ్‌స్టర్ మిడ్-వేరియంట్ 3.5 kW బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్), 4.5 kW బ్యాటరీ ప్యాక్‌తో కూడిన వెర్షన్ ధర రూ. 1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్), టాప్-స్పెక్ మోడల్ రూ. 1.40 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది.
ఓలా రోడ్‌స్టర్ ప్రో (Ola Electric Roadster Pro)
ఈ సిరీస్‌లో ప్రీమియం ఆఫర్ ఓలా రోడ్‌స్టర్ ప్రో వేరియంట్. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 8kW ప్యాక్ కోసం రూ. 2.00 లక్షలు (ఎక్స్-షోరూమ్), 16kW ప్యాక్ కోసం రూ. 2.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)చెల్లించాల్సి ఉంటుంది. దీనికి కొనసాగింపుగా ఇంకా వేరియంట్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఓలా వెల్లడించింది.
వీటిలో ఓలా తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ లైనప్‌ను స్పోర్ట్స్ (యారోహెడ్ మరియు డైమండ్‌హెడ్), అడ్వెంచర్ మరియు క్రూయిజర్ వంటి కొత్త సిరీస్‌లతో విస్తరించాలని యోచిస్తోంది. ఈ సిరీస్‌కి వచ్చే ఆదరణను బట్టి మోటార్‌సైకిళ్ల విభాగంలో తమ మార్కెట్ అవసరాలకు తగినట్లుగా ఓలా ప్రణాళికలు సిద్ధం చేసుకోనుంది.
Also Read: భారత్‌లో మహీంద్రా థార్ రోక్స్ లాంచ్ - ధర, టాప్ 5 ఫీచర్లు ఇవే