స్టైలిష్ లుక్, మోడరన్ ఫీచర్లతో వస్తున్న Mahindra Vision SXT Pickup - పిక్నిక్‌లు, బిజినెస్‌లకు బాగా సెట్టవుతుంది!
New Mahindra pickup truck: మహీంద్రా విజన్ SXT కొత్త టీజర్ విడుదలైంది. ఇది, ఈ పికప్ ఎలా ఉంటుందన్న ఓవర్‌లుక్ ఇస్తుంది. భవిష్యత్తులో, దీని ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా రావచ్చు.

Mahindra Vision SXT Pickup Price And Features In Telugu: మహీంద్రా, తన కొత్త పికప్ Vision SXT ని త్వరలో భారతదేశంలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కంపెనీ ఇటీవలే ఈ బండి టీజర్‌ను విడుదల చేసింది. 2023లో, Scorpio-N Pickup గా ప్రపంచవ్యాప్తంగా పరిచయమైన అదే పికప్ ట్రక్ ఇది. కొత్త టీజర్‌ను బట్టి, దీనిలో కొన్ని ప్రత్యేకమైన & ఆకర్షణీయమైన అంశాలు కనిపిస్తున్నాయి.
టీజర్‌లో ఏం కనిపించింది?
మహీంద్రా విడుదల చేసిన కొత్త టీజర్‌లో, విజన్ SXT పికప్ వెనుక భాగం కనిపించింది. ఈ పికప్‌లో రెండు బూట్-మౌంటెడ్ స్పేర్ వీల్స్ కనిపించాయి, ఇది హార్డ్‌కోర్ ఆఫ్-రోడర్ లాగా అనిపిస్తోంది. టు-పీస్ టెయిల్‌గేట్ ఓపెనింగ్ కూడా టీజర్‌లో చూపించారు, దీనిని ఈ విభాగంలో చాలా ప్రాక్టికల్ & కస్టమర్-ఫ్రెండ్లీ లక్షణంగా పరిగణిస్తున్నారు. ఈ ఫీచర్లను బట్టి చూస్తే, మహీంద్రా, విజన్ SXT ని కేవలం ఒక షోపీస్‌గా కాకుండా, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిందని స్పష్టంగా తెలుస్తోంది.
విజన్ SXT అంటే ఏమిటి?
మహీంద్రా విజన్ SXT అనేది స్కార్పియో-N ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన కొత్త కాన్సెప్ట్ పికప్ ట్రక్. ఇది దాని బేస్ మోడల్ కంటే బోల్డ్‌గా & ఆధునికంగా ఉండటమే కాకుండా, సాంకేతికంగానూ అడ్వాన్స్‌డ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. మహీంద్రా విజన్ SXT ని పెట్రోల్ లేదా డీజిల్ వెర్షన్‌లలో మాత్రమే కాకుండా, ఆల్-ఎలక్ట్రిక్ వేరియంట్ (EV)లో కూడా లాంచ్ చేయాలని యోచిస్తోంది. ఈ కారణంగా, ఈ వాహనం SUV & లైఫ్‌స్టైల్ సెగ్మెంట్ మధ్య ఒక ప్రత్యేకమైన ఎంపికగా మారవచ్చు.
విజన్ SXT ప్రత్యేకత ఏమిటి?
ఆఫ్-రోడింగ్ కోసం బలమైన, స్టైలిష్‌గా ఉండే & మెరుగైన వాహనం కోసం చూస్తున్న కస్టమర్లకు మహీంద్రా విజన్ SXT సరైన ఎంపిక కావచ్చు. దీని బోల్డ్ టెయిల్‌గేట్ డిజైన్ & డ్యూయల్ స్పేర్ వీల్స్ దీనికి నిజమైన ఆఫ్-రోడ్ ట్రక్ రూపాన్ని & అనుభూతిని ఇస్తాయి. లాంగ్ డ్రైమ్, టూరింగ్, క్యాంపింగ్, పిక్నిక్ లేదా తేలికపాటి వాణిజ్య ప్రయోజనాల కోసం లైఫ్‌స్టైల్ వెహికల్‌గా ఉపయోగించాలనుకునే వారికి ఈ పికప్ ట్రక్ బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. ముఖ్యంగా, థార్ లేదా గూర్ఖా వంటి టఫర్ వెహికల్స్‌ను ఇష్టపడుతూనే, కొత్త & భిన్నమైన బండి కోసం చూస్తున్న కస్టమర్లను మహీంద్రా విజన్ SXT ఆకర్షిస్తుంది.
విజన్ SXT ఎప్పుడు లాంచ్ అవుతుంది?
మహీంద్రా విజన్ SXT గురించి అధికారికంగా త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే, ప్రొడక్షన్ యూనిట్ లేదా లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. దీనిని 2026 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించే అవకాశం ఉంది లేదా అంతకు ముందు సాఫ్ట్ లాంచ్‌గా కూడా ప్రవేశపెట్టవచ్చు.
భారతదేశంలో పికప్ ట్రక్ విభాగం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు, కానీ ఇటీవలి సంవత్సరాలలో లైఫ్ స్టైల్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. మహీంద్రా, భారతదేశంలో EV వెర్షన్‌తో విజన్ SXT ని విడుదల చేస్తే, ఈ వాహనం Thar, Gurkha & Toyota Hilux వంటి వాహనాలతో నేరుగా పోటీ పడగలదు.





















