Longest Range Car: సింగిల్ ఛార్జ్‌తో 3 దేశాలకు నాన్‌స్టాప్ ప్రయాణం, లాంగెస్ట్ రేంజ్‌తో ప్రపంచ రికార్డ్ సృష్టించిన ఎలక్ట్రిక్ కారు
Lucid Air Electric Car: లండన్ వ్యాపారవేత్త ఉమిత్ సబాన్సి ఈ కారును యూరప్‌లోని మూడు దేశాలలో 1200 కిలోమీటర్లకు పైగా ఆగకుండా నడిపి రికార్డు సృష్టించారు.

Lucid Air Electric Car Price, Range And Features In Telugu: ప్రపంచవ్యాప్తంగా, ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ అవుతున్నాయి. EV కొనే కస్టమర్ ప్రధానంగా చూసే విషయం ఆ కారు ఇచ్చే డ్రైవింగ్ రేంజ్. కాబట్టి, కారు కంపెనీలు కూడా లాంగెస్ట్ రేంజ్ కార్లను అందించడానికి పోటీ పడుతున్నాయి. బ్యాటరీ టెక్నాలజీకి పదును పెట్టి, ఎక్కువ రేంజ్ ఇచ్చే కార్లను లాంచ్ చేయడానికి ఆరాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు ఏది అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా?. లేదా, ఇదే ప్రశ్నను మిమ్మల్ని ఎవరైనా అడిగారా?. ఒక కొత్త ప్రపంచ రికార్డు తర్వాత, ఈ ప్రశ్నకు సమాధానం లభించింది.
మూడు దేశాలకు నిరంతర ప్రయాణం
అమెరికన్ కంపెనీ లూసిడ్ ఎయిర్ (Lucid Air), తన గ్రాండ్ టూరింగ్ (Grand Touring) మోడల్‌తో, ఫుల్ ఛార్జ్‌తో ఎక్కడా ఆగకుండా ఒకేసారి 1207 కి.మీ. దూరాన్ని కవర్ చేసింది. ఈ నాన్-స్టాప్ జర్నీలో ఈ ఎలక్ట్రిక్ కారు ఏకంగా రెండు దేశాలను దాటి మూడో దేశంలోకి ప్రవేశించింది. లూసిడ్ ఎయిర్ గ్రాండ్ టూరింగ్ మోడల్ ఎలక్ట్రిక్ కారు, స్విట్జర్లాండ్‌లోని సెయింట్ మోరిట్జ్‌లో ప్రయాణం మొదలు పెట్టి జర్మనీలోని మ్యూనిచ్ వరకు ప్రయాణించి 750 మైళ్ల (1207 కి.మీ.) దూరాన్ని కవర్ చేసింది. ఈ ప్రయాణంలో ఈ కారు మధ్యలో ఎక్కడా ఆగలేదు, ఎక్కడా బ్యాటరీ ఛార్జ్ జరగలేదు.
ఈ కారును ఎవరు నడిపారు?
లండన్ వ్యాపారవేత్త ఉమిత్ సబాన్సి ఈ కారు ఓనర్. యూరప్‌లోని మూడు దేశాలలో 1200 కిలోమీటర్లకు పైగా ఆగకుండా Lucid Air Grand Touring కారును నడిపి ఆయన రికార్డు సృష్టించారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్రోఫీని కూడా పొందనుంది. ఈ 3 దేశాల నాన్-స్టాప్ ప్రయాణంలో విభిన్న రకాల రోడ్లపై ఆయన ప్రయాణించారు.
విభిన్న రహదారి పరిస్థితులు
ఈ ఎలక్ట్రిక్ కారును మలుపులు తిరిగే పర్వత రోడ్లు, హై స్పీడ్ హైవేలు, బిజీగా ఉండే సిటీ రోడ్లలో ఉమిత్ సబాన్సి ప్రయాణం సాగింది. రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ దీనికి చాలా సహాయపడింది & కారు ఎక్కువ రేంజ్ సాధించింది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో రేంజ్ పరంగా లూసిడ్ ఎయిర్ కంపెనీ అగ్రస్థానంలో ఉందని ఇది నిరూపించింది.
లూసిడ్ ఎయిర్ గ్రాండ్ టూరింగ్ మోడల్ ఫీచర్ల విషయానికి వస్తే... ఈ ఎలక్ట్రిక్ కారు 831 హార్స్‌పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 1.89 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సెడాన్‌గా కూడా పేరు తెచ్చుకుంది. దీని గరిష్ట వేగం గంటకు 270 కి.మీ. కంటే ఎక్కువ. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 2 కోట్ల కంటే ఎక్కువే ఉంటుందని రిపోర్ట్స్‌ను బట్టి తెలుస్తోంది.





















