Independence Day 2025: ఇండియన్ ఆర్మీ వాహనాల్లో చేసే ప్రత్యేక మార్పులేంటి? - సాధారణ కార్ల కంటే అవి ఎందుకు భిన్నం?
Military Cars Vs Normal Cars: ఇండియన్ ఆర్మీ కార్లు సాధారణ వాహనాల కంటే భిన్నంగా ఉంటాయి. 4x4 పవర్, బుల్లెట్ ప్రూఫ్ బాడీ & ప్రత్యేక మార్పులు వాటిని ప్రతి పరిస్థితికి ఎలా సిద్ధంగా ఉంచుతాయి.

Special Features Of Indian Army Vehicles: భారత సైన్యం ప్రతి క్లిష్ట పరిస్థితిలోనూ దేశాన్ని రక్షిస్తుంది - ఎత్తైన హిమాలయాల్లో గడ్డ కట్టిన మంచులో అయినా, మండుతున్న ఎడారి ఇసుకలో అయినా లేదా భీకరంగా ఎగసిపడే నడి సముద్రంలో అయినా, అనంతమైన ఆకాశంలో అయినా. ఎలాంటి పరిస్థితులలో ఉన్నా సైన్యానికి బలమైన సైనికులు మాత్రమే కాకుండా ప్రత్యేక వాహనాలు కూడా అవసరం. ఈ వాహనాలు సాధారణ కార్ల కంటే చాలా భిన్నంగా ఉంటాయి & అవసరాలకు అనుగుణంగా వాటిలో చాలా ప్రత్యేకమైన మార్పులు చేస్తారు. తద్వారా అవి ఎలాంటి కఠిన పరిస్థితిలోకైనా సులభంగా పరిగెత్తగలవు & సైనికులను, దేశాన్ని రక్షించగలవు. ఈ వాహనాల బుల్లెట్ ప్రూఫ్ బాడీ & ప్రత్యేక మార్పులు వాటిని ప్రతి విపత్కర పరిస్థితికి సిద్ధంగా ఉంచుతాయి.
భారత సైన్యం సాధారణ కార్లను కూడా ఉపయోగిస్తుందా?
నిజానికి, సైన్యం వద్ద Mahindra Scorpio, Tata Safari, Toyota Hilux & Maruti Gypsy వంటి సాధారణ ప్రజలు కూడా కొనుగోలు చేయగల అనేక వాహనాలు ఉన్నాయి. అయితే, ఈ కార్లను ఆర్మీ వెర్షన్‌లో రూపొందిస్తారు. క్లిష్టమైన రోడ్లు & ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉపయోగించేందుకు సైన్యాన్ని సిద్ధం చేసేలా అనేక ఫీచర్లను యాడ్ చేస్తారు.
ప్రతి వాహనానికి 4x4 ఆఫ్-రోడింగ్ సామర్థ్యం
సరిహద్దుల్లో, సాధారణ కార్లు వెళ్ళలేని కఠినమైన రోడ్లపై ఆర్మీ కార్లు ప్రయాణించాలి. అందుకే ప్రతి ఆర్మీ వాహనానికి 4x4 పవర్ యాడ్ చేస్తారు. తద్వారా అవి బురద, మంచు, పర్వతాలు లేదా ఎడారులలో కూడా సులభంగా దూసుకెళ్లగలవు.
ప్రత్యేక ఆకుపచ్చ పెయింటింగ్
మీరు ఎంత వెతికినా ఎరుపు, నీలం, తెలుపు లేదా సిల్వర్ కలర్స్‌లో ఉన్న ఆర్మీ వాహనాలు కనిపించవు. వాటిని ప్రత్యేక ఆర్మీ గ్రీన్ కలర్‌లో మాత్రమే పెయింట్ చేస్తారు. శత్రువుల కళ్లకు కనిపించకుండా చేయడానికి & వాటికి సైనిక గుర్తింపును ఇవ్వడానికి ఈ రంగు సాయపడుతుంది.
ఆయుధాలు నిల్వ చేయడానికి ఒక స్థలం
సాధారణ కార్లలో ఉండే ట్రంక్ సామాను నిల్వ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ సైనిక వాహనాలలో, ఆయుధాలు & అవసరమైన సామగ్రిని ఉంచడానికి ప్రత్యేక స్థలం కూడా ఉంటుంది, తద్వారా వాటిని అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు.
బుల్లెట్ ప్రూఫ్ రక్షణ
చాలా ఆర్మీ వాహనాలు బుల్లెట్ ప్రూఫ్ రక్షణతో ఉంటాయి. అంటే, ఈ వాహనాల్లో ప్రయాణించే సైనికులకు శత్రువుల బుల్లెట్ల నుంచి రక్షణ ఉంటుంది & ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా వారు ఎమర్జెన్సీ మిషన్లను నిర్వహించగలరు.
హుక్ & టోయింగ్ సామర్థ్యం
ప్రతి సైనిక వాహనంలో బలమైన టో హుక్స్ అమరుస్తారు. అవసరమైతే ఇతర వాహనాలు లేదా వస్తువులను ఇవి లాక్కెళ్లగలవు.
ఈ ప్రత్యేక మార్పులన్నీ, సైనిక వాహనాలను రవాణా సాధనంగా మాత్రమే కాకుండా దేశ భద్రతకు నమ్మకమైన వెహికల్స్‌గా చేస్తాయి. అందుకే, ప్రతి సైనిక వాహనం కూడా ఒక ఆయుధమే.





















