GST Cut Offer: జీఎస్టీ కోత తర్వాత Honda Activa, TVS Jupiter ధరలు ఎంత తగ్గాయో తెలుసా?
Cheapest Scooter India 2025: కొత్త GST రేట్ల ప్రకారం స్కూటర్లు, బైక్‌లు & కార్లపై పన్ను తగ్గింది. దీంతో, Honda Activa & TVS Jupiter వంటి పాపులర్ స్కూటర్లు చౌకగా మారాయి.

GST Reduction Impact On Scooters Price: కేంద్ర ప్రభుత్వం, ఇటీవల, వాహనాలపై జీఎస్టీ రేట్లలో భారీ కోతను ప్రకటించింది. గతంలో ద్విచక్ర వాహనాలపై 28% జీఎస్టీ విధించగా, ఇప్పుడు దానిని 18% కి తగ్గించారు. కొత్త పన్ను స్లాబ్ ఈ నెలలోనే, సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తుంది. స్కూటర్లు & మోటార్ సైకిళ్లను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఈ పండుగ టైమ్‌లో ఇది ఒక బంపర్ ఆఫర్, నేరుగా ప్రయోజనం లభిస్తుంది. జీఎస్టీ రేట్లలో 10% భారీ కోత తర్వాత, Honda Activa & TVS Jupiter వంటి తెలుగు ప్రజలకు ఇష్టమైన స్కూటర్ల ధరలు ఎంత తగ్గాయో తెలుసుకుందాం.
ద్విచక్ర వాహనాలకు ఎక్కువ ప్రయోజనం
భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అమ్ముడవుతున్న చాలా టూవీలర్లు 350cc కంటే తక్కువ సామర్థ్యం గల ఇంజిన్లతో ఉన్నాయి. ఇది మెజారిటీ ప్రజల విభాగం కాబట్టి, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం GST రేటును తగ్గించింది. దీని అర్థం.. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో అత్యధికంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాలైన హోండా యాక్టివా & TVS జూపిటర్ వంటి స్కూటర్లు ఇప్పుడు మునుపటి కంటే చాలా చౌకగా మారతాయి.
హోండా యాక్టివా & టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ కొత్త ధరలు
తెలుగు రాష్ట్రాల్లో...
Honda Activa 100 ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,173 (28% GSTతో కలిపి). కొత్త GST శ్లాబ్ అమలు తర్వాత, ఈ స్కూటర్ దాదాపు రూ. 76,000 కు అందుబాటులో ఉంటుంది. అంటే, కస్టమర్లకు దాదాపు రూ. 8,000 ప్రత్యక్ష ఆదా అవుతుంది.
TVS Jupiter 110 ప్రస్తుత ధర రూ. 81,831. ఇది 22 సెప్టెంబర్ 2025 నుంచి రూ. 74,000 కి తగ్గుతుంది. అంటే, ఈ స్కూటర్ కూడా దాదాపు రూ. 7,000 చౌకగా మారుతుంది.
Suzuki Access 125 ధర కూడా తగ్గుతుంది. ప్రస్తుతం, 28% GSTతో కలిపి, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 87,351 గా ఉండగా, ఇప్పుడు కొత్త పన్ను తర్వాత దాదాపు రూ. 79,000 గా మారుతుంది.
మోటార్ సైకిళ్లపైనా తగ్గింపు ప్రభావం
స్కూటర్లు మాత్రమే కాకుండా, 22 సెప్టెంబర్ 2025 నుంచి మోటార్ సైకిళ్ళు కూడా చౌకగా లభిస్తాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడైన హీరో స్ప్లెండర్ బైక్ కొనే కస్టమర్లు పెద్ద ప్రయోజనం పొందుతారు. దీని ప్రస్తుత ధర రూ. 79,426, ఇది జీఎస్టీ తగ్గింపు తర్వాత రూ. 71,483 కు తగ్గుతుంది. అంటే, స్ప్లెండర్ ధర దాదాపు రూ. 7,943 తగ్గుతుంది.
పండుగ సీజన్‌లో అమ్మకాలు పెరుగుతాయని అంచనా
తెలుగు రాష్ట్రాల ప్రజలు సహా యావత్ దేశం ప్రధాన పండుగ సీజన్‌కు (దసరా & దీపావళి) సిద్ధమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకుంది. దసరా, ధంతేరస్ & దీపావళి సమయాల్లో కొత్త వాహనాలను కొనుగోలు చేయడం ప్రజలు శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి, స్కూటర్లు & మోటార్ సైకిళ్ల ధరల తగ్గింపు నిర్ణయం, టూవీలర్ల అమ్మకాలలో భారీ పెరుగుదలకు దారితీస్తుందని భావిస్తున్నారు. ఇది కంపెనీలు & కస్టమర్లు ఇద్దరికీ ఒక పండుగ బహుమతి అవుతుంది.





















