Honda Activa నిజమైన మైలేజ్ రిజల్ట్స్ వచ్చేశాయి! - రియల్ లైఫ్ టెస్ట్‌లో ఏం తెలిసింది?
హోండా ఆక్టివా నిజమైన మైలేజ్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేశాయి. సిటీ, హైవే రూట్లలో ఎక్స్‌పర్ట్స్ చేసిన రియల్ వరల్డ్ టెస్టింగ్‌లో ఆక్టివా ఇచ్చిన ఫ్యూయల్ ఎకానమీ ఎంత అనే వివరాలను ఈ స్టోరీలో చదవండి.

Honda Activa Mileage Test: భారత మార్కెట్లో, ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు దశాబ్దాలుగా హోండా ఆక్టివా ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. నమ్మకమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్, మంచి ఫ్యూయల్ ఎకానమీతో మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకుంది. ప్రత్యేకించి, 110cc స్కూటర్ల మైలేజీ విషయంలో ఆక్టివా ఒక బెంచ్‌మార్క్‌లా ఉంటుంది. తాజా జనరేషన్ ఆక్టివా నిజమైన మైలేజ్ తెలుసుకోవడానికి, ఆటోమొబైల్ ఎక్స్‌పర్టులు రియల్ వరల్డ్ ఫ్యూయల్ ఎకానమీ టెస్ట్ చేశారు.
హోండా ఆక్టివా రియల్ వరల్డ్ ఫ్యూయల్ ఎకానమీ
ఎక్స్‌పర్టులు నిర్వహించిన కంబైన్డ్ టెస్ట్‌లో ఆక్టివా లీటరు పెట్రోల్‌కు 60 km మైలేజ్ ఇచ్చింది. 110cc స్కూటర్లలో ఇది చాలా మంచి ఫలితం. మొదట హైవే మీద 50 కిలోమీటర్లకు పైగా నడిపిన తర్వాత ట్యాంక్ మళ్లీ ఫుల్ చేయడానికి 800 ml పెట్రోల్ మాత్రమే అవసరమైంది. దీని ద్వారా హైవే ఫ్యూయల్ ఎకానమీ 66.2 kmpl గా నమోదైంది. ఆ తర్వాత, సౌత్ ముంబై ట్రాఫిక్‌లో మరో 50 కిలోమీటర్ల రైడ్ చేశారు. ఆ తర్వాత ట్యాంక్ ఫుల్ చేయడానికి కేవలం 900 ml పెట్రోల్ అవసరం పడింది. దీంతో సిటీ మైలేజ్ 54.4 kmpl గా వచ్చింది.
మైలేజ్ ఎందుకు అంత బాగుంది?
110cc స్కూటర్లలో హోండా ఆక్టివా ఎప్పుడూ మంచి ఎకానమీ ఇస్తుందనే విషయం అందరికీ తెలుసు. అయితే కొన్ని ప్రత్యేక లక్షణాలు దీనిని ఇంకా మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియెన్సీ దిశగా తీసుకెళ్లాయి, అవి:
తక్కువ బరువు - కేవలం 105 kg: ఆక్టివా 110, మన మార్కెట్లో లభించే లైట్ వెయిట్ స్కూటర్లలో ఒకటి. ఇంజిన్ తక్కువ బరువును మోయడం వల్ల దహన సామర్థ్యం మెరుగుపడి మైలేజ్ కూడా పెరుగుతుంది.
లాంగ్-స్ట్రోక్ ఇంజిన్ ట్యూనింగ్: ఆక్టివా ఇంజిన్ ఎక్కువ పనితీరును లోయర్ రేవ్ రేంజ్‌లోనే ఇస్తుంది. దీంతో సాధారణ వేగాల్లో స్కూటర్ స్మూత్‌గా నడవడానికి ఎక్కువ థ్రాటిల్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ: హోండా అందిస్తున్న ఐడల్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్ ట్రాఫిక్‌లో ఆగినప్పుడు ఇంజిన్‌ను కొన్ని సెకన్లలోనే ఆపేస్తుంది. మళ్లీ స్టార్ట్ చేయడానికి ఆక్సిలరేటర్ తిప్పితే వెంటనే స్కూటర్ ముందుకు కదులుతుంది. ఈ టెక్నాలజీ, పెట్రోల్ సేవ్ అయ్యేలా చేస్తుంది.
ఎక్స్‌పర్టుల టెస్టింగ్ ఎలా జరిగింది?
ఫ్యూయల్ ఎకానమీ టెస్ట్ కోసం, ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్స్, ముందుగా స్కూటర్ ట్యాంక్‌ను పూర్తిగా ఫుల్ చేసారు. హోండా కంపెనీ సూచించిన టైర్ ప్రెజర్‌ను సరిగ్గా మెయింటెయిన్ చేశారు. ఆ తరువాత, ముందుగా నిర్ణయించుకున్న సిటీ & హైవే రూట్లలో, నిజమైన డ్రైవింగ్ పరిస్థితులకు దగ్గరగా ఉండే స్పీడ్‌లతో స్కూటర్‌ను నడిపారు. రైడర్ బరువు & అదనపు లోడ్‌ను ఒకేలా ఉంచి ప్రతి టెస్ట్‌లో స్థిరత్వాన్ని తీసుకువచ్చారు. చివరిగా, ట్యాంక్‌ను మళ్లీ ఫుల్ చేసి, అప్పటికే వినియోగించిన పెట్రోల్ ఆధారంగా ఖచ్చితమైన మైలేజ్‌ను లెక్కించారు.
హోండా ఆక్టివా రియల్ వరల్డ్ ఫ్యూయల్ ఎకానమీ టెస్ట్, ఈ స్కూటర్ జనానికి ఎందుకు బెస్ట్ అనే విషయాన్ని మరోసారి నిరూపించింది. నగరంలో 54.4 kmpl, హైవేపై 66.2 kmpl ఇవ్వడం చిన్న విషయం కాదు. ఆక్టివా కొనేవాళ్లకు ఇది ఎంతో సానుకూలమైన ఫలితం.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















