ఇండియన్ల కోసం సిద్ధమవుతున్న Honda 0 α ఎలక్ట్రిక్ SUV - 75kWh బ్యాటరీతో సూపర్ పవర్!
హోండా 0 α (ఆల్ఫా) ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ జపాన్‌లో రివీల్ అయింది. 2027లో ఇండియాలో లాంచ్ కానుంది. Maruti e Vitara కు గట్టి పోటీగా రాబోతోన్న ఈ SUV, 65kWh-75kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది.

Honda 0 Alpha Electric SUV Concept Car: "జపాన్ మొబిలిటీ షో 2025"లో, హోండా తన కొత్త ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ “హోండా 0 ఆల్ఫా (α)”ను ఆవిష్కరించింది. ఇది హోండా 0 సిరీస్‌లోని మొదటి మోడల్‌గా నిలుస్తుంది. ఈ SUV 2027లో ఇండియాలో ప్రొడక్షన్ వెర్షన్‌గా లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఆసక్తికరంగా, ఈ వాహనం ఇండియాలోనే తయారవుతుంది. అంటే, ఇది ఇండియన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రాజెక్ట్.
డిజైన్‌లో ఫ్యూచరిస్టిక్ ఫీల్
హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV డిజైన్ చూస్తే ఫ్యూచర్ వాహనాల మాదిరిగా ఉంటుంది. ఇది, పెద్ద హోండా 0 SUV స్టైలింగ్‌ను కొనసాగిస్తుంది కానీ కొంచెం చిన్నగా ఉంటుంది. ముందు భాగంలో ఇల్యూమినేటెడ్ హోండా లోగోతో పాటు ఛార్జింగ్ పోర్ట్ ఉంది. 19 అంగుళాల షార్ప్ డిజైన్ అల్లాయ్ వీల్స్, హై గ్రౌండ్ క్లియరెన్స్, యారో స్టైల్ బాడీ క్లాడింగ్‌తో SUV లుక్‌ను మరింత అగ్రెసివ్‌గా చూపిస్తుంది.
రియర్ భాగంలో ఫుల్-విడ్త్ U-షేప్ టెయిల్‌ల్యాంప్స్, ఫోక్స్ బాష్ ప్లేట్ & MPV తరహాలో కనిపించే C-పిల్లర్ ఈ SUV కి బోల్డ్ అప్పీల్ ఇస్తాయి. మొత్తంగా, ఈ కాన్సెప్ట్ వాహనం “Thin, Light and Wise” డిజైన్ ఫిలాసఫీతో రూపొందించినట్లు హోండా చెబుతోంది.
ఇంజినీరింగ్ & టెక్నికల్ హైలైట్స్
హోండా ఇంకా అఫిషియల్‌గా టెక్నికల్ స్పెసిఫికేషన్లు బయటపెట్టలేదు. కానీ, చీఫ్ ఇంజినీర్ తోషికాజు హిరోసే మాట్లాడుతూ, వీల్‌బేస్ 2700-2800mm మధ్యలో ఉంటుందని, లోపలి స్థలాన్ని గరిష్టంగా ఉపయోగించామని చెప్పారు.
Honda 0 Alpha Electric SUV రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది - 65kWh & 75kWh. ఈ రెండూ LFP టెక్నాలజీతో ఉంటాయి. అంటే వేడి వాతావరణానికి (ఇండియా లాంటి దేశాలకు) అనుకూలం. ప్రారంభంలో ఈ మోడల్ సింగిల్ మోటార్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ సెటప్‌లో లభించనుంది.
ప్రొడక్షన్ వెర్షన్ దగ్గరగా ఉన్న కాన్సెప్ట్
హోండా డిజైన్ ఎగ్జిక్యూటివ్ టాకు ఫుకుయి మాట్లాడుతూ, “ఈ కాన్సెప్ట్ మోడల్ దాదాపు ప్రొడక్షన్ వెర్షన్‌కి దగ్గరగా ఉంది. చాలా డిజైన్ డీటైల్స్ అదే విధంగా ఫైనల్ వెర్షన్‌లో కనిపిస్తాయి” అని తెలిపారు. అంటే 2027లో మనం చూసే వాహనం దాదాపుగా ఇదే లుక్‌లో ఉండే అవకాశం ఎక్కువ.
ధర అంచనా & పోటీదారులు
హోండా 0 ఆల్ఫా SUV ధర రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండొచ్చని అంచనా. ఇది రాబోయే Maruti e Vitara, Mahindra BE 6, Tata Curvv EV, Hyundai Creta Electric, MG ZS EV లాంటి వాహనాలకు నేరుగా పోటీగా నిలుస్తుంది.
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్ వేడెక్కుతున్న ఈ సమయంలో, హోండా 0 ఆల్ఫా ఎంట్రీని ఒక గేమ్ ఛేంజర్‌గా చూస్తున్నారు. 2027లో ఇది రోడ్లపైకి వచ్చినప్పుడు, హోండా EV ప్లాన్‌కు ఇది కొత్త వేగం అందించవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















