EV స్కూటర్ మార్కెట్‌లో Bajaj దూకుడు - కొత్త Chetak లాంచ్ డేట్, ధర అంచనాలు ఇవే
బజాజ్ కంపెనీ, జనవరి 14న కొత్త Chetak ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయనుంది. ప్రస్తుతం ఉన్న స్కూటర్ల కంటే కాస్త తక్కువ ధరలో రావచ్చనే అంచనాలతో EV మార్కెట్‌లో ఆసక్తి పెరుగుతోంది.

New Bajaj Chetak Price And Launch Date: భారతదేశ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో Bajaj Chetak దూకుడు పెరిగింది, ఈ కొత్త సంవత్సరంలో కొత్త రూపంలో రాబోతోంది. బజాజ్ ఆటో సంస్థ, జనవరి 14వ తేదీన కొత్త Chetak మోడల్‌ను లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే పంపిన లాంచ్ ఇన్‌వైట్ ఈ కొత్త మోడల్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఈ ఇన్‌వైట్‌లో కనిపించిన ముఖ్యమైన మార్పు ఏమిటంటే... కొత్త టెయిల్ లైట్ డిజైన్. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న Chetakలో స్ప్లిట్ LED టెయిల్ లైట్ సెటప్ ఉంటుంది. మధ్యలో Chetak బ్యాడ్జ్, రెండు వైపులా వెర్టికల్ లైట్లు ఉంటాయి. అయితే కొత్త మోడల్‌లో హారిజాంటల్ LED టెయిల్ లైట్, రెండు చివరల వద్ద ఇండికేటర్లు, పైభాగంలో Chetak బ్రాండింగ్ కనిపిస్తోంది. ఇది స్కూటర్‌కు మరింత ఆధునిక లుక్ ఇవ్వనుంది.
EV మార్కెట్‌లో Bajaj Chetakకి కీలక షేర్
ప్రస్తుతం, భారతదేశ EV స్కూటర్ మార్కెట్‌లో Bajaj Chetak కి 21 శాతం మార్కెట్ షేర్ ఉంది, ఇదేమీ చిన్న విషయం కాదు. ముఖ్యంగా, TVS iQubeతో టాప్ పొజిషన్ కోసం గట్టి పోటీ ఇస్తోంది. 2025 సంవత్సరంలో బజాజ్ దాదాపు 2.70 లక్షల Chetak యూనిట్లను విక్రయించింది. ఇది కంపెనీకి ఒక పెద్ద మైలురాయి. ఆ ఏడాది జూలై-ఆగస్టు నెలల్లో రేర్ ఎర్త్ మాగ్నెట్ల సరఫరా సమస్యల వల్ల ఉత్పత్తి ప్రభావితమైనప్పటికీ, మొదటిసారి 2 లక్షల వార్షిక అమ్మకాల మార్క్‌ను దాటింది.
ప్రస్తుత Bajaj Chetak వేరియంట్లు
ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న Chetak రేంజ్‌లో 3kWh, 3.5kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిని 3001, 35 సిరీస్‌లుగా విభజించారు. 35 సిరీస్‌లో 3501, 3502, 3503 సబ్ వేరియంట్లు ఉన్నాయి.
3501, 3502 వేరియంట్లలో TFT డాష్, యాప్ కనెక్టివిటీ లాంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.
కొత్త మోడల్ ధర అంచనా
జనవరి 14న రాబోతున్న కొత్త Bajaj Chetak, తక్కువ ధరలో ఉండే అవకాశం ఉంది. అయితే ఇది బజాజ్ నుంచి వచ్చే అత్యంత చౌకైన EV స్కూటర్ కాకపోవచ్చని అంచనా.
తెలుగు రాష్ట్రాల్లో, ప్రస్తుతం, బజాజ్ చేతక్ ఎక్స్-షోరూమ్ ధర ₹1,02,400 నుంచి ప్రారంభమవుతుంది, టాప్ మోడల్ ధర ₹1,34,500 లక్షలు.
హైదరాబాద్‌లో బజాజ్ చేతక్ ఆన్-రోడ్ ధర
ఎక్స్-షోరూమ్ ₹ 1,02,400
RTO ₹ 1,500
ఇన్సూరెన్స్ (కాంప్రహెన్సివ్) ₹ 6,087
ఆన్-రోడ్ ధర ₹ 1,09,987
విజయవాడలో బజాజ్ చేతక్ ఆన్-రోడ్ ధర
ఎక్స్-షోరూమ్ ₹ 1,02,400
RTO ₹ 13,788
ఇన్సూరెన్స్ (కాంప్రహెన్సివ్) ₹ 6,048
ఆన్-రోడ్ ధర ₹ 1,22,236
రంగులు & వేరియంట్లు
Bajaj Chetak ప్రస్తుతం Brooklyn Black, Citrus Rush, Cyber White, Hazelnut, Indigo Metallic, Velluto Russo వంటి 6 రంగుల్లో, 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
కొత్త డిజైన్, విశ్వసనీయ బ్రాండ్, ఇప్పటికే నిరూపించుకున్న అమ్మకాలతో కొత్త Bajaj Chetak లాంచ్ EV స్కూటర్ మార్కెట్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారే అవకాశం ఉంది. ఈ బండి గురించి జనవరి 14న పూర్తి వివరాలు వెల్లడవుతాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















