265km రేంజ్‌తో వచ్చిన Simple One Gen 2 ఎలక్ట్రిక్ స్కూటర్లు: పాత మోడల్‌తో పోలిస్తే ధర, బ్యాటరీ, ఫీచర్లలో ఏం మారింది?
Simple One Gen 2 స్కూటర్ కొత్త బ్యాటరీ ఆప్షన్లు, 265km IDC రేంజ్, అప్‌డేటెడ్ ఫీచర్లతో లాంచ్ అయ్యింది. Gen 1.5తో పోలిస్తే డిజైన్, పవర్, ధరలో వచ్చిన మార్పులు తెలుసుకోండి.

Simple One Gen 2 Price And Specifications: భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో Simple Energy మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న Simple One Gen 1.5ను బేస్‌గా తీసుకుని, ఇప్పుడు కంపెనీ Simple One Gen 2ను ప్రవేశపెట్టింది. ఇది పూర్తిగా కొత్త మోడల్ కాకపోయినా, Gen 1.5లో ఉన్న బలాలను మరింత మెరుగుపరుస్తూ, డైలీ యూజ్‌కి ఇంకా అనుకూలంగా మార్చారు.
డిజైన్ & నిర్మాణంలో మార్పులు
చూడటానికి Simple One Gen 2, Gen 1.5కు చాలా వరకు ఒకేలా కనిపిస్తుంది. అయితే, బాడీ లోపల మాత్రం కొన్ని కీలక మార్పులు చేశారు. స్కూటర్ నిర్మాణంలో ఉన్న స్ట్రక్చరల్ జాయింట్స్‌ను మెరుగుపరచడంతో రిజిడిటీ పెరిగింది. దీనివల్ల రైడ్ మరింత షార్ప్‌గా, ప్రెడిక్టబుల్‌గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
సస్పెన్షన్‌ను కూడా రీట్యూన్ చేశారు. సీటు ఎత్తు 16mm తగ్గి 780mmకు చేరింది. అదే సమయంలో, సీటు ఫోమ్‌ను ఇంకాస్త గట్టిగా మార్చారు. ఇవన్నీ కలిపి రైడర్‌కు మంచి కంఫర్ట్ అందించేలా రూపొందించారు.
మరొక ముఖ్యమైన మార్పు బరువు విషయంలో కనిపిస్తుంది. Gen 2లో కర్బ్ వెయిట్ (పెట్రోల్, ఆయిల్స్ నింపిన తర్వాత బరువు) 7 కిలోలు తగ్గి 129 కిలోలకు వచ్చింది. అండర్ సీట్ స్టోరేజ్ సామర్థ్యం కూడా 35 లీటర్లకు పెరిగింది, అంటే పాత మోడల్‌తో పోలిస్తే 1 లీటర్ ఎక్కువ.
బ్యాటరీ, పవర్ & రేంజ్
Gen 1.5లో కేవలం 5kWh బ్యాటరీ మాత్రమే ఉండేది. కానీ Gen 2లో ఇప్పుడు 4.5kWh, 5kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు అందిస్తున్నారు.
5kWh వేరియంట్‌లో పీక్ పవర్ 8.6kW నుంచి 8.8kWకి పెరిగింది. ఇది 0 నుంచి 40kmph వేగాన్ని కేవలం 2.55 సెకన్లలో అందుకుంటుంది. టాప్ స్పీడ్ 115kmph. ముఖ్యంగా IDC రేంజ్ 248km నుంచి 265kmకి పెరగడం పెద్ద అప్‌డేట్.
4.5kWh బ్యాటరీ వేరియంట్ 6.4kW పీక్ పవర్, 236km IDC రేంజ్ ఇస్తుంది.
ఈ రెండు వేరియంట్లకూ 750W పోర్టబుల్ చార్జర్‌తో హోమ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అదనంగా, మోటార్ & బ్యాటరీపై లైఫ్‌టైమ్ వారంటీ ఇవ్వడం Simple Energy ప్రత్యేకతగా నిలుస్తోంది.
ఫీచర్లు & సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్
Gen 2లో SimpleOS సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో పాటు రెండు కొత్త రైడింగ్ మోడ్స్ వచ్చాయి, అవి: EcoX మోడ్, SonicX మోడ్.
EcoX మోడ్: థ్రాటిల్, స్పీడ్, రైడింగ్ పరిస్థితులను విశ్లేషించి గరిష్ట రేంజ్ అందించేలా పనిచేస్తుంది.
SonicX మోడ్: స్కూటర్ పూర్తి శక్తిని విడుదల చేసి 115kmph టాప్ స్పీడ్‌ను అందిస్తుంది.
ఇవే కాకుండా నాలుగు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్, నాలుగు లెవెల్స్ రీజెనరేటివ్ బ్రేకింగ్, రెండు లెవెల్స్ క్రూజ్ కంట్రోల్ ఉన్నాయి. హిల్ హోల్డ్ అసిస్ట్, వాహనం పడిపోతే పవర్ కట్ అయ్యే ఫీచర్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ లైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొత్త స్విచ్‌గియర్, 4-వే జాయ్‌స్టిక్‌తో TFT ఆపరేషన్ మరో హైలైట్.
ధర & కలర్ ఆప్షన్లు
Simple One Gen 2 ధరలు రూ.1.70 లక్షల నుంచి రూ.1.78 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధర) ఉన్నాయి.
4.5kWh వేరియంట్: రూ.1.70 లక్షలు
5kWh వేరియంట్: రూ.1.78 లక్షలు
కొత్తగా Sonic Red, Aero X, Asphalt X అనే మూడు కలర్ ఆప్షన్లు అందిస్తున్నారు. ఆసక్తికరంగా, 4.5kWh Gen 2 ధర, పాత Gen 1.5 (5kWh) కంటే సుమారు రూ.4,000 ఎక్కువ.
మొత్తమ్మీద, Simple One Gen 2 పెద్దగా రూపం మార్చుకోకపోయినా.... రేంజ్, ఫీచర్లు, బరువు తగ్గింపు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ పరంగా గణనీయమైన మెరుగుదల చూపిస్తోంది. రోజువారీ సిటీ రైడ్స్‌తో పాటు లాంగ్ రేంజ్ అవసరాలు ఉన్నవారికి ఇది మరింత ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మారింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















