BYD MPV e6: ఒక్కసారి చార్జ్ చేస్తే 520 కిలోమీటర్లు.. సూపర్ ఎలక్ట్రిక్ కారు ఇదే!
చైనీస్ కార్ల తయారీ కంపెనీ బీవైడీ మనదేశంలో మొదటి కారును లాంచ్ చేసింది. అదే బీవైడీ ఎంపీవీ ఈ6. ఈ ఎలక్ట్రిక్ కారు ఏకంగా 520 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు.
ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ కార్లను రూపొందించే బీవైడీ అనే చైనీస్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీ కారును మనదేశంలో లాంచ్ చేసింది. మనదేశంలో కంపెనీ లాంచ్ చేసిన మొదటి ఉత్పత్తి ఇదే. ఇందులో 71.7 కేడబ్ల్యూహెచ్ బ్లేడ్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే డబ్ల్యూఎల్‌టీసీ(సిటీ) రేంజ్‌లో 520 కిలోమీటర్లు, డబ్ల్యూఎల్‌టీసీ(కంబైన్డ్) 415 కిలోమీటర్లను ఈ కారు అందించనుంది.
మనదేశంలో అత్యధిక రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లలో ఇది కూడా ఒకటి అని కంపెనీ అంటోంది. ఈ కార్ ఇంజిన్ 180 నానోమీటర్ టార్క్‌ను అందించనుంది. 130 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ను ఇది అందించనుంది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, అహ్మదాబాద్, కొచ్చి, చెన్నై నగరాల్లో ఈ కారు అందుబాటులో ఉంది.
ఏసీ, డీసీ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. డీసీ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ద్వారా 30 శాతం నుంచి 80 శాతం చార్జింగ్‌కు 35 నిమిషాల్లో చార్జింగ్ ఎక్కనుంది. దీని బూట్ కెపాసిటీ 580 లీటర్లుగా ఉండనుందని కంపెనీ అంటోంది. ఇందులో లెదర్ సీట్లు, 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్, ఫ్రంట్ పాసింజర్ సీట్లు ఉన్నాయి.
వీటితోపాటు 10.1 అంగుళాల టచ్ స్క్రీన్, ఎయిర్ ఫిల్టర్, స్పీడ్ సెన్సింగ్ ఆటోమేటిక్ లాకింగ్, రేర్ వ్యూ కెమెరా కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ వాహనానికి మూడేళ్లు లేదా 1.25 లక్షల కిలోమీటర్ల పాటు వారంటీని అందించనున్నారు. ఈ రెండిట్లో ఏది ముందు పూర్తయితే అప్పటికి వారంటీ ముగిసిపోనుందన్న మాట. ట్రాక్షన్ మోటర్ వారంటీ అయితే 8 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్లుగా ఉంది.
ప్రస్తుతానికి కొన్ని నగరాల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. 7 కిలోవాట్ చార్జర్‌తో కలిపి దీని ధర రూ.29.6 లక్షలుగా ఉండగా.. చార్జర్ లేకుండా రూ.29.15 లక్షలుగా ఉంది. ప్రస్తుతానికి బీవైడీ ఇండియన్ సబ్సిడరీకి మనదేశంలో రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని కార్లు మనదేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది.
Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!