2026 మారుతి బలెనోలో ఏం మారింది? ఇంజిన్ పవర్, మైలేజ్, ఫీచర్లు పెరిగాయా, తగ్గాయా?
2026 మారుతి బలెనోలో కొత్త ఇంజిన్, మెరుగైన మైలేజ్, ADAS, సేఫ్టీ ఫీచర్లు వచ్చాయి. పాత బలెనోతో ఉన్న కీలక తేడాలు ఇవే.

2026 Maruti Baleno Price, Mileage And Features Telugu: మారుతి సుజుకీ, తన పాపులర్ ఫ్యామిలీ కారు బలెనోకు కొత్త రూపాన్ని ఇచ్చింది. నాలుగేళ్లకు పైగా మార్కెట్లో ఉన్న రెండో తరం బలెనో ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ అవతార్‌లో అందుబాటులో ఉంది. నెక్సా డీలర్షిప్స్ ద్వారా విక్రయించే ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌కు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రతి నెలా అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో బలెనో చోటు దక్కించుకుంటోంది.
కొత్త 2026 బలెనోలో ఇంజిన్ నుంచి ఫీచర్ల వరకు చాలా మార్పులు జరిగాయి. అయితే కారు మొత్తం డిజైన్‌లో మాత్రం పెద్దగా మార్పులు లేవు.
ఇంజిన్
ముందుగా ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త బలెనోలో జెడ్-సిరీస్ ఇంజిన్‌ను మారుతి తీసుకొచ్చింది. ఇదే ఇంజిన్ స్విఫ్ట్ & డిజైర్ కార్లలోనూ ఉంది. సామర్థ్యం 1.2 లీటర్లుగానే ఉంది. అయితే పాత బలెనోలో నాలుగు సిలిండర్లు ఉండగా.. కొత్త మోడల్లో మూడు సిలిండర్లు మాత్రమే ఉన్నాయి.
పెట్రోల్ వెర్షన్లో కొత్త బలెనో 82hp శక్తిని, 112Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్ 90hp శక్తి & 113Nm టార్క్ అందించేది. అంటే కొత్త కారులో పవర్ తగ్గింది. అయితే మైలేజ్ మాత్రం పెరిగింది.
కొత్త బలెనో పెట్రోల్ మాన్యువల్ వెర్షన్ 23.80kpl మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెర్షన్ 24.77kpl ఇస్తుంది. పాత మోడల్లో ఇవి వరుసగా 22.35kpl & 22.94kplగా ఉన్నాయి.
CNG వెర్షన్లోనూ మైలేజ్ మెరుగుపడింది. కొత్త బలెనో 33.61km/kg మైలేజ్ ఇస్తుంది. పాత మోడల్ 30.61km/kg మాత్రమే అందించేది. కొత్త కారులో సీఎన్జీ టార్క్ కూడా స్వల్పంగా పెరిగింది.
డిజైన్
కారు డిజైన్‌లో.. ముందుభాగంలోనే ప్రధాన మార్పులు కనిపిస్తాయి. కొత్త బలెనోకు పెద్ద గ్రిల్ ఇచ్చారు. ఇందులో మూడు క్రోమ్ స్ట్రిప్స్ ఉన్నాయి. సుజుకి లోగోను గ్రిల్ పైభాగంలోకి మార్చారు.
బంపర్ డిజైన్ కూడా మారింది. వెడల్పుగా ఉన్న బ్లాక్ ట్రిమ్‌తో డ్యూయల్ టోన్ లుక్ వచ్చింది. దీంట్లో దీర్ఘచతురస్రాకార ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. షార్క్ ఫిన్ యాంటెన్నా & ముందు ఫెండర్లపై క్రోమ్ గార్నిష్ కూడా కొత్తగా వచ్చాయి.
మిగిలిన డిజైన్ దాదాపు పాత మోడల్‌నే పోలి ఉంటుంది. అల్లాయ్ వీల్స్ డిజైన్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, క్రోమ్ విండో బెల్ట్లైన్లో పెద్ద మార్పులు లేవు. వెనుక భాగాన్ని పరిశీలిస్తే పాత బలెనోకు కొత్త బలెనోకు తేడా గుర్తించడం కూడా కష్టమే.
ఫీచర్లు
ఫీచర్ల విషయంలో మాత్రం భారీ మార్పులు జరిగాయి. వైర్లెస్ ఫోన్ ఛార్జర్‌కు యాక్టివ్ కూలింగ్ ఇచ్చారు. క్లారియన్ సౌండ్ సిస్టమ్ & ముందు సీట్లకు వెంటిలేషన్ కూడా ఉన్నాయి. సెగ్మెంట్లో ముందు సీట్ల వెంటిలేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఇది కూడా చదవండి: 398cc Triumph Scrambler 400 X: నెలకు రూ.6600 కడితే ఈ బైక్ మీదే! డౌన్‌పేమెంట్, ఈజీ EMI ప్లాన్స్ ఇవే!
సేఫ్టీ
అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా ఇచ్చారు. వెనుక సీటులోని మధ్య సీటు ప్రయాణికుడి కోసం ప్రత్యేక హెడ్రెస్ట్ & మూడు పాయింట్ల సీట్‌బెల్ట్ కూడా ఉన్నాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ను కూడా అందించారు.
అత్యంత కీలకమైన అప్డేట్ లెవల్ 2 ADAS. ఈ టెక్నాలజీతో బలెనో మరింత అధునాతనంగా మారింది. భారత మార్కెట్లో ఈ ఫీచర్ ఉన్న ప్రధాన హ్యాచ్‌బ్యాక్‌లలో బలెనో ప్రత్యేకంగా నిలుస్తుంది. మారుతి సుజుకి కాంపాక్ట్ కార్ల విభాగంలోనూ ఇది కీలకమైన ఫీచర్‌గా మారింది.
క్యాబిన్
క్యాబిన్లో మాత్రం పెద్ద మార్పులు లేవు. బ్లాక్ & బ్లూ థీమ్ కొనసాగింది. మల్టీ లేయర్డ్ డ్యాష్‌బోర్డ్ డిజైన్ కూడా అలాగే ఉంది. వైర్లెస్ ఛార్జర్ & సీటు వెంటిలేషన్ నియంత్రణల కోసం డ్యాష్‌బోర్డ్ దిగువ భాగంలో మార్పులు చేశారు. పాత మోడల్లోని ఫ్యాబ్రిక్ సీట్ల స్థానంలో సెమీ లెదర్యెట్ అప్హోల్స్టరీ వచ్చింది.
ధర
2026 బలెనో ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ.5.99 లక్షలు. పాత బలెనో ప్రారంభ ధర కూడా రూ.5.99 లక్షలు. అంటే కొత్త, పాత మోడళ్ల ప్రారంభ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
కొత్త బలెనోలో సిగ్మా, డెల్టా, జీటా & ఆల్ఫా వేరియంట్లు కొనసాగుతున్నాయి. కొత్తగా ఆల్ఫా(O) వేరియంట్ కూడా వచ్చింది. ఇది ఆల్ఫా కంటే పైన ఉంటుంది. ఇందులోనే లెవల్ 2 ADAS లభిస్తుంది.
ఇది కూడా చదవండి: పవర్ తగ్గినా పెర్ఫార్మెన్స్లో తగ్గేదేలే.. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 X రియల్ రోడ్ టెస్ట్ రిజల్ట్స్
మొత్తంగా చూస్తే.. కొత్త బలెనోలో పవర్ తగ్గినా మైలేజ్ పెరిగింది. డిజైన్‌లో మార్పులు పరిమితంగానే ఉన్నాయి. అయితే ఫీచర్లు & సేఫ్టీ విషయంలో మాత్రం గణనీయమైన అప్‌గ్రేడ్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్, వెంటిలేటెడ్ సీట్లు & లెవల్ 2 ADAS వంటివి కొత్త బలెనోను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















