(Source: ECI/ABP News/ABP Majha)
Brahma kamalam: హిమాలయాలలో వికసించే దివ్య పుష్పం బ్రహ్మ కమలం గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?
Brahma kamalam: బ్రహ్మ కమలం ఒక దైవిక పుష్పం, దీనిని రాత్రి రాణి అని కూడా అంటారు. రాత్రిపూట వికసించి ఉదయానికి వాడిపోయే ప్రత్యేక పుష్పం. బ్రహ్మ కమలం మతపరమైన ప్రాముఖ్యం, పౌరాణిక నేపథ్యం మీకు తెలుసా?
Brahma kamalam: బ్రహ్మ కమలం గురించి విన్నారా..? ఈ అందమైన పువ్వు హిమాలయ ప్రాంతంలో కనిపిస్తుంది. బ్రహ్మ కమలం.. శాస్త్రీయ నామం సస్సూరియా ఓబ్‌వల్లట అని చెబుతారు. హిందూ ధర్మంలో అనేక పౌరాణిక, మతపరమైన ప్రాముఖ్యతలను కలిగి ఉన్న ఈ పుష్పం పొద్దుతిరుగుడు కుటుంబానికి చెందినది. ఈ చరాచర సృష్టికి కారకుడైన బ్రహ్మ ధ్యానం చేస్తున్నప్పుడు ఈ పువ్వుపై కూర్చున్నాడని నమ్ముతారు. ఈ పవిత్ర పుష్పం సంవత్సరానికి ఒకసారి అదీ ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. హిమాలయాల్లో వికసించిన ఈ బ్రహ్మ కమలాన్ని చూస్తే శుభం కలుగుతుందని విశ్వసిస్తారు.
చూడ్డానికి అందంగా ఉండే ఈ పువ్వు ఆధ్యాత్మికతకు, స్వచ్ఛతకు ప్రతీక. పురాణ రహస్యాలతో కూడిన ఈ సొగసైన పుష్పం శతాబ్దాలుగా మానవుల ఊహల్లో కొనసాగింది. కొంతకాలంగా చాలామంది ఇళ్లలోనూ బ్రహ్మ కమలం మొక్కలను పెంచుతున్నారు. బ్రహ్మ కమలం మతపరమైన, పౌరాణిక ప్రాముఖ్యత తెలుసుకుందాం.
1. బ్రహ్మ కమలం పౌరాణిక ప్రాముఖ్యత
హిందూ పురాణాల ప్రకారం, బ్రహ్మకమలం ఒక ఖగోళ పుష్పం, ఇది సంవత్సరంలో ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. హిందూ గ్రంధాల ప్రకారం, బ్రహ్మ విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన కమలం నుండి జన్మించాడు. అందుకే ఈ కమలాన్ని బ్రహ్మ కమలం అని పిలుస్తారు. ఈ పుష్పాన్ని విశ్వానికి సృష్టికర్తగా పరిగణించే బ్రహ్మ దైవిక జననానికి సాక్షిగా పేర్కొంటారు.
2. శుభాలను కలిగించే పుష్పం
- ఈ పువ్వు సంవత్సరంలో ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది, ఉదయానికి వాడిపోతుంది. ఈ పుష్పం ఔషధ లక్షణాలను కూడా కలిగి ఉంది. ప్రకృతివైద్యాన్ని అభ్యసించే, విశ్వసించే వారు బ్రహ్మ కమలాన్ని పూజిస్తారు.
- మరొక ఆసక్తికరమైన విశ్వాసం ఏమిటంటే.. బ్రహ్మ కమలం వికసించినప్పుడు, ఎవరైతే తమ మనసులోని కోరికలు ఆ పుష్పానికి చెబుతారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.
- హిమాలయాలలో బ్రహ్మ కమలం వికసించడాన్ని ఉత్సాహంగా వేడుక జరుపుకొనే అనేక స్థానిక సంఘాలు ఉన్నాయి. బ్రహ్మ కమలం వికసించే సమయంలో ఈ సంఘాలు నృత్యం చేసి సంబరాలు చేసుకుంటాయి.
- బ్రహ్మకమలం, దాని అందం, మంగళకరమైన స్వభావం నిజంగా చూడదగిన అరుదైన దృశ్యం! ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, హేమకుండ్, తుంగనాథ్ వద్ద మనం బ్రహ్మకమలాలను చూడవచ్చు.
3. బ్రహ్మ కమలానికి సంబంధించిన కథలు
హిందూ సంస్కృతిలో త్రిమూర్తులుగా పూజలందుకునే ముగ్గురిలో ఒకరైన బ్రహ్మ ఈ బ్రహ్మ కమలం మొక్కను సృష్టించాడని భావిస్తారు. కొన్ని కథల ప్రకారం, బ్రహ్మ దేవుడు ఒకసారి నిద్రలోకి జారుకుని తామరపువ్వుపై తపస్సు చేసాడు. తర్వాత నిద్ర లేచి చూసేసరికి కమలంగా మారిపోయాడు. అప్పుడు ఆ పుష్పానికి బ్రహ్మకమలం అని పేరు వచ్చింది. విశ్వాన్ని సృష్టించడానికి బ్రహ్మ తామర పువ్వును ఉపయోగించాడని చెబుతారు. ఒక రాక్షసుడు తన భార్యను చంపిన తర్వాత విష్ణువు తన భార్య లక్ష్మిని తిరిగి బ్రతికించడానికి ఈ పువ్వును ఉపయోగించాడని మరొక కథనం. ఈ విధంగా మనకు బ్రహ్మ కమలానికి సంబంధించిన అనేక నమ్మకాలు, కథలు ఉన్నాయి.
Also Read : అరుదైన వ్యాధి నివారణలో కలువ పూలే నెంబర్ వన్
బ్రహ్మ కమలం ఏడాదికి ఒకసారి మాత్రమే వికసించే పుష్పం. దీనిని బ్రహ్మదేవుడు అనుగ్రహించిన పుష్పం అని చాలామంది అంటారు. ఈ పువ్వు వికసించే రోజు కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ఇది మతపరమైన, శాస్త్రీయ, పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన అరుదైన పుష్పం.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Also Read : పూజలో కలువ పూలను ఎందుకు వినియోగిస్తారో తెలుసా?