Political Unlucky Persons : ఎమ్మెల్సీగానే కాదు ఎమ్మెల్యేగానూ గెలుపు ముంగిట బోర్లా - పాపం కోలా గురువులు !
రాజకీయాల్లో గెలుపు దాకా వచ్చి ఓటమి పాలవుతున్న నేత కోలా గురువులు. ఆయనకు రెండో సారి ఇలాంటి పరిస్థితి ఎదురయింది.
Political Unlucky Persons : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో గోలా గురవులు విజయం సాధించారు. జయ మంగళ వెంకటరమణ పరాజయం పాలయ్యారు..అని మీడియాలో బ్రేకింగ్ చూసి కోలా గురువులు అనుచరులు విశాఖ సౌత్ నియోజకవర్గంోని ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. టపాసుల శబ్దం ఇలా ముగియగానే అలా వారికి మైండ్ బ్లాంక్ అయ్యే విషయం తెలిసింది. అదేమిటంటే గెలిచింది గురువులు కాదు జయ మంగళ వెంకటరమణ అని. దీంతో ముందస్తు సంబరాలు చేసుకున్నందుకు అనుచరులు ఫీలయ్యారు. అసెంబ్లీ కౌంటింగ్ దగ్గర ఉన్న కోలా గురువులుకు గతం గుర్తొచ్చి ఉంటుంది.ఎందుకంటే ఇలా గెలుపు చేతుల్లోకి వచ్చి చేజారిపోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి.
ప్రజారాజ్యం తరపున పోటీ చేసి తృటిలో గెలుపును కోల్పోయిన గురువులు
కోలా గురువులు ప్రజా రాజ్యం నుంచి రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆయన విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. 2009లో విశాఖ సౌత్ నుంచి ప్రజారాజ్యం తరుపున కోలా గురువులు, టీడీపీ తరుపున వాసుపల్లి గణేష్, కాంగ్రెస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ పోటీచేశారు. గురువులు, గణేష్ ఇద్దరు మత్స్య కార వర్గం వాడ బలిజ సామాజికవర్గం. పోరు హోరాహోరీగా సాగింది. ముగ్గురికి పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కోలా గురువులు స్వల్ప ఆధిక్యతలో ఉంటూ వచ్చారు. దీంతో రెండో స్థానంలో ఉన్న ద్రోణంరాజు శ్రీనివాస్ ఇక తన ఓటమి ఖాయమనుకుని వెళ్లిపోయారు.
మొదట గెలిచినట్లుగా భావించినా చివరికి స్వల్ప తేడాతో ఓటమి
కౌంటింగ్ హాల్ నుంచి ప్రత్యర్థి వెళ్లిపోయాడని తెలిసి కోలా గురువులు అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. గురువులు కూడా ఇక తాను గెలిచానని అనుకున్నారు. తీరా కౌంటింగ్ మెత్తం పూర్తయ్యే సరికి ఫలితం తిరగబడింది. 341 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ద్రోణం రాజు శ్రీనివాస్ .. ప్రజారాజ్యం అభ్యర్థి కోలా గురువులు మీద గెలిచారు. దీంతో ఆయన పరాజయం పాలయ్యారు. ఎమ్మెల్యే అవ్వాలన్న కల నెరవేరలేదు. ఆ తర్వాత కూడా ఆయన రాజకీయంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొని ప్రజల్లోనే ఉంటున్నారు. తర్వాత కోలా గురువులు వైసీపీలో చేరారు. 2014లో గురువులు వైసీపీ , గణేష్ టీడీపీ, ద్రోణంరాజు కాంగ్రెస్ తరపున పోటీపడగా గణేష్ గురువుల మీద దాదాపు 18 వేల మెజారిటీతో గెలిచారు.
ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే తరహా ఓటమి
2019 ఎన్నికల ముందు ద్రోణంరాజు వైసీపీలో చేరి టికెట్ ఎగరేసుకొని పోయారు. గురువులు ద్రోణం రాజుకు మద్దతు ఇచ్చారు కానీ గణేష్ దాదాపు నాలుగువేల మెజారిటీతో గెలిచారు. వైసీపీ 151 సునామిలో కూడా వైజాగ్ లోని నాలుగు సీట్లు టీడీపీ గెలిచింది. ద్రోణం రాజు కోవిడ్ తో 2020లో మరణించారు. టీడీపీ తరపున గెలిచిన గణేష్ వైసీపీలోకి ఫిరాయించారు. గురువులకు మొదట మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.. 2009 ఎమ్మెల్యే గా నిన్న ఎమ్మెల్సీ గా పక్కా గెలుపు అనుకున్నా కోలా గురువులను దురదృష్టం వెంటాడింది, అధ్యక్షా అనే అవకాశం దక్కలేదు. అందుక కోలా గురువులు రాజకీయాల్లో అన్ లక్కీ పర్సన్ అని సహచరులు సానుభూతి తెలుపుతున్నారు.