panchayat funds: పంచాయతీల డబ్బులు "నొక్కేసిన" జగన్ సర్కార్..! కోర్టుకెళ్తే ఏమవుతుందో తెలుసా..?
గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను ఏపీ ప్రభుత్వం మళ్లించినట్లు తెలుస్తోంది. సొమ్మును డ్రా చేయాలంటే.. ఓ పద్ధతి ఉంటుంది. పంచాయతీ తీర్మానం చేయాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే.. నిధులు డ్రా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధుల మళ్లింపులో రికార్డులు సృష్టిస్తోంది. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులు కూడా వదిలి పెట్టడం లేదు. ఏపీలో గ్రామ పంచాయతీలకు రూ. 345 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. అలా విడుదల చేయగానే.. ఇలా రాష్ట్ర ప్రభుత్వం వాటిని.. కరెంట్ బకాయిలు అంటూ... డిస్కంల ఖాతాళకు మళ్లించేసింది. ఇలా గ్రామ పంచాయతీల ఖాతాలో క్రెడిట్ కావడం.. వాటిని క్షణాల్లో ప్రభుత్వం మళ్లించేయడం జరిగిపోయింది. నిజానికి ఈ సొమ్ములు డ్రా చేయాలంటే.. ఓ పద్ధతి ఉంటుంది. పంచాయతీ తీర్మానం చేయాలి. కానీ ఇక్కడ అలాంటి ప్రక్రియ ఏమీ పాటించలేదు.
వచ్చిన నిధులను వచ్చినట్లుగా తీసేసుకుంది. గ్రామాల అభివృద్ధి కోసం.. ఆర్థిక సంఘం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ, అంతర్గత వీధులు, మురుగు కాలువల నిర్వహణ, అంటువ్యాధుల నియంత్రణ, సామాజిక ఆస్తుల అభివృద్ధి, నిర్వహణ, శ్మశాన వాటికల ఏర్పాటు, నిర్వహణకు ఆ నిధులు ఖర్చు చేయవచ్చు. ఇతర అవసరాలకు ఖర్చు చేయకూడదు. నేరుగా ఆ నిధులు పంచాయతీలకు జమ అవుతాయి. వాటిని సర్పంచ్‌లు తమ ఊరి అభివృద్ధితో పాటు.. ఆర్థిక సంఘం నిర్దేశించిన లక్ష్యాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని కోసం.. సర్పంచ్‌లకు చెక్ పవర్ కూడా ఇచ్చారు.
ఇప్పుడు ఏపీ సర్కార్ వచ్చిన నిధులను వచ్చినట్లుగా ఊడ్చేయడం వల్ల.. పంచాయతీలతో సంబంధం లేకుండానే నిధులన్నీ మాయం అయిపోయినట్లయ్యాయి. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని.. ప్రభుత్వం తప్పిదానికి పాల్పడిందని.. సర్పంచ్‌లో మండిపడుతున్నారు. కానీ ప్రభుత్వం ఎవరి మాటా వినే పరిస్థితి లేదు. ప్రత్యేకంగా జీవో ఇచ్చి మరీ ఈ నిధులన్నింటినీ లాగేశారు. ఈ కారణంగా పంచాయతీల్లో చిన్న అభివృద్ధి పని కూడా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. కేంద్రానికి ఫిర్యాదులు చేయడం లేదా.. హైకోర్టులో కేసులు వేయడం వంటి చర్యలను తీసుకోవాలని పలువురు విపక్ష పార్టీలకు చెందిన సర్పంచ్‌లు పరిశీలిస్తున్నారు.
పంచాయతీ నిధులు ఎప్పుడూ ప్రభుత్వాలు ఏకపక్షంగా తీసుకోవు. అలా తీసుకుంటే రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. ఇప్పటికే అనేక రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా.. పంచాయతీల నిధుల విషయంలోనూ అలాంటి విమర్శలే ఎదుర్కొంటోంది. నిధులు లేక అల్లాడిపోతున్నఏపీ సర్కార్‌కు.. ఏ ఖాతాలో కనీస మొత్తం కనిపించినా.. కళ్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఓ అవసరం తీరుతుందని అనుకుంటోంది. ఎవరేమనుకున్నా.. తర్వాత రాజ్యాంగ సంస్థల నుంచి చీవాట్లు పడినా.. వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదు.