YSRCP Nominated posts: వైసీపీలో త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ-ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహం
ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో పదవుల పంపకానికి సిద్ధమయ్యారు. త్వరలోనే నామినేటెడ్ పదువులను భర్తీ చేయాలని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలే సమయం ఉంది. ఈసారి 175కి 175 కొట్టాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేస్తున్న సీఎం జగన్... పార్టీపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. టికెట్ల కేటాయింపు తర్వాత... నేతల్లో అసంతృప్తి పెరగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ నేతలకు ఆ దిశగా.. కీలక సూచనలు కూడా చేశారు. ఆశించిన వారందరికీ టికెట్లు ఇవ్వలేకపోయినా బాధపడాల్సి అవసరం లేదని... వారికి అండగా ఉంటామని ప్రకటించారు సీఎం జగన్. టికెట్లు రానివారు తన వారు కాదని అనుకోవద్దని ముందస్తు సూచనలు చేశారు. అంతేకాదు... టికెట్లు రాని వారికి తగిన న్యాయం చేస్తామని తెలిపారు. అన్నట్టుగానే సీఎం జగన్.. ముందస్తు వ్యూహరచన చేస్తున్నారా? అంటే వైసీపీ వర్గాలు అవుననే చెప్తున్నాయి.
ఎన్నికల ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు మినహా మిగిలిన కార్పొరేషన్లు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులకు భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. రెండు రోజుల్లో జాబితాను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోయిన వారికి... ముందే నామినేటెడ్ పదవులు ఇస్తే... వారిని కాస్త శాంతింపజేసే అవకాశం ఉంటుందని సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వైసీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందలో భాగంగా... నిన్న (మంగళవారం) సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్... ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ ముఖ్యనేతలు వైవీ సుబ్బారెడ్డితోపాటు పలువురితో భేటీ అయ్యి చర్చలు జరిపారు. పార్టీలోని నేతలందరికీ న్యాయం జరిగేలా... పదవి రాలేదని ఎవరూ బాధపడకుండా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. రెండున్నరేళ్ల పదవీ ఫార్ములాను నామినేటెడ్ పదవుల్లో కూడా అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలా అయితేనే.. పార్టీ కొసం పనిచేసేవారందరికీ న్యాయం చేయగలమని.. కొత్తవారికి కూడా అవకాశం కల్పించగలమనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అన్యాయం జరగకుండా వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని సీఎం జగన్ ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే నామినేటెడ్ పోస్టుల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. అభ్యర్థులు జాబితా కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆ లిస్టును కేంద్ర పార్టీ కార్యాలయ ఇన్‌చార్జ్ లేళ్ల అప్పిరెడ్డి అధిష్టానానికి సమర్పించినట్టు సమాచారం. త్వరలోనే 15 కార్పొరేషన్లు, డైరెక్టర్లకు సంబంధించి నామినేటెడ్ నియామకాలు జరుగాయని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. కొన్ని కార్పొరేషన్లకు పదవీకాలానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. దసరాకు తన క్యాంప్ ఆఫీసుకు విశాఖకు మారుస్తున్నట్టు ప్రకటించిన సీఎం జగన్... నామినేటెడ్ పదవులను కూడా దసరా బొనంజాగా ప్రకటిస్తారని సమాచారం.
ఇక, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా చైర్మన్‌గా ఈదా రాజశేఖర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. చెర్టెర్డ్ అకౌంటెంట్ అయిన రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం రెరా సభ్యునిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ను చైర్మన్‌గా నియమించిన జగన్ సర్కార్. నిన్న (మంగళవారం) రెరా ఆఫీసులో ఆయన బాధ్యతలు చేపట్టారు. తనకు పదవి ఇచ్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు ఈదా రాజశేఖర్‌రెడ్డి.