YS Sharmila: 20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
Talliki Vandanam Scheme Cuts: రాష్ట్రంలో 87 లక్షల మంది పిల్లలు చదువుతూంటే వారిలో 67 లక్షల మందికే తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయించడం దారుణమని షర్మిల అన్నారు. అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

APCC Chief Sharmila Slams Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలు తీరుపై ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మోసాలనే తలపిస్తున్నాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం తీరును ఆమె తల్లికి వందనానికి పంగనామం-బిడ్డలకు ఎగనామం అంటూ ఘాటుగా అభివర్ణించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అసలైన రాజకీయ వారసుడిగా వ్యవహరిస్తున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒక్క బిడ్డకే పథకాన్ని పరిమితం చేసి తల్లులను పచ్చిమోసం చేసిందని ఆమె గుర్తుచేశారు. అయితే, ఎన్నికల ప్రచారంలో నీకు 15 వేలు, నీకు 15 వేలు.. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తాం అని ఆర్భాటంగా ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిలువునా నయవంచన చేస్తున్నారని ఆరోపించారు. గతంలో జగన్‌ను కోతల రాయుడు అని విమర్శించిన బాబుగారే, ఇప్పుడు మళ్లీ కోతలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ధ్వజమెత్తారు.
2023 జూన్ 29న చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉంటూ నాటి వైసీపీ ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నలను షర్మిల ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాడు రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఎంతమందికి ఇస్తున్నారని ప్రశ్నించిన మీరు, ఇప్పుడు చేస్తున్నదేంటి అని నిలదీశారు. 15 వేల చొప్పున ఇస్తామని చెప్పి 2 వేల కోతలు ఎందుకు పెడుతున్నారని, 300 యూనిట్ల కరెంట్ వాడకం, జీవనోపాధి కోసం కారు ఉందనే సవాలక్ష సాకులు, కొర్రీలతో లబ్ధిదారులను ఎందుకు అనర్హులుగా మారుస్తున్నారని నాడు చంద్రబాబు ప్రశ్నించిన అంశాలను తిరిగి ఆయనపైకే ప్రయోగించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి షర్మిల సూటి ప్రశ్నలు సంధించారు. అమ్మఒడి పేరుతో నాడు జగన్ చేసిన మోసానికి ప్రజలు బుద్ధి చెప్పి కూటమికి పట్టం కడితే.. మీరిప్పుడు చేస్తున్న న్యాయం ఇదేనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 83 లక్షల మంది బిడ్డలుంటే కేవలం 67 లక్షల మందికే ఈ పథకాన్ని పరిమితం చేస్తూ, మిగిలిన 20 లక్షల మంది బిడ్డలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధి పేరుతో 2,000 కోత విధించడం పచ్చి దోపిడీ కాదా అని నిలదీశారు. జగన్ నాన్న బుడ్డీని దోచుకుంటే, మీరు ఏకంగా బుడ్డీనే మాయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
“తల్లికి వందనానికి పంగనామం-బిడ్డలకు ఎగనామం” ఇదే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీ. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి వారసుడు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. గత YCP మోసాలను తూచ తప్పకుండా పాటించడం కూటమి ప్రభుత్వ @JaiTDP @JanaSenaParty @BJP4Andhra విధానం.
— YS Sharmila (@realyssharmila) July 17, 2026
అమ్మఒడి… pic.twitter.com/ZPFQGQKuWQ
కూటమి ప్రభుత్వానికి నిజంగానే మహిళలు, పిల్లల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. యూడైస్ తాజా లెక్కల ప్రకారం గత మూడేళ్లలో పెరిగిన 4 లక్షల మంది విద్యార్థులను కలుపుకుని రాష్ట్రంలోని మొత్తం 87 లక్షల మంది బిడ్డలకూ తల్లికి వందనం వర్తింపజేయాలని స్పష్టం చేశారు. ఎలాంటి నిబంధనల కొర్రీలు, తప్పుడు కటింగ్‌లు లేకుండా ప్రతి బిడ్డ ఖాతాలోనూ పూర్తి స్థాయిలో 15,000 జమ చేయాలని, అర్హులైన మిగతా 20 లక్షల మంది బిడ్డలకు తక్షణమే న్యాయం చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు గట్టిగా డిమాండ్ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















