YS Jagan Family : వేర్వేరుగా ప్రార్థనలు.. నివాళులు... ! జగన్, విజయమ్మ మధ్య కూడా మాటల్లేవా ?
వైఎస్ జగన్, తల్లి విజయలక్ష్మి పులివెందులలో వేర్వేరుగా పర్యటించారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నా.. చెరో వైపుకూర్చుకున్నారు. కనీసం పలకరింపుగా కూడా మాట్లాడుకోలేదు.
క్రిస్మస్ పండుగను కూడా వైఎస్ కుటుంబసభ్యులు కలసిమెలిసి చేసుకోలేకపోయారు. కుటుంబసభ్యుల మధ్య విభేదాలు పెరిగిపోయిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఎం జగన్, విజయమ్మ వేర్వేరుగా వైఎస్ఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రార్థనల్లో పాల్గొన్నారు కానీ.. చెరో వైపు కూర్చున్నారు. పలకరింపుగా కూడా మాట్లాడుకోలేదు. ఈ అంశం పులివెందులలోనూ చర్చనీయాంశమయింది. ప్రతీ ఏటా క్రిస్మస్ పండుగ సందర్భంగా.. వైఎస్ కుటుంబసభ్యులందరూ పులివెందుల వస్తారు. క్రిస్మస్ ముందు రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పిస్తారు.
Also Read: ఏపీ పోలీసులపై కేంద్రం డేగకన్ను, త్వరలోనే అదంతా జరుగుతుంది.. సీఎం రమేశ్ సంచలనం
ఈ సారి క్రిస్మస్‌కు షర్మిల, విజయమ్మ, సీఎం జగన్ కూడా ఒక రోజు ముందుగానే పులివెందులకు వచ్చారు. అయితే వీరంతా మాట్లాడుకున్నారో లేదో స్పష్టత లేదు కానీ ఉదయమే ముందుగా వైఎస్ విజయలక్ష్మి వైఎస్ఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. ఆ తర్వాత సీఎం జగన్ వచ్చారు. ఆ తర్వాత నెమళ్ల పార్కులో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విజయమ్మ, జగన్ పాల్గొన్నారు. కానీ ఒకే సారి కాదు. మొదట విజయమ్మ వేడుకల్లో పాల్గొని వెళ్లిపోయిన తర్వాత జగన్ వచ్చారు. వేడుకల్లో పాల్గొని వెళ్లారు.
షర్మిల పులివెందులకు వచ్చినప్పటికీ మరోమారు తీవ్ర విభేదాలు తలెత్తడంతో రాత్రికి రాత్రి వెనుదిరిగి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. గత రెండేళ్లుగా వైఎస్ఆర్ జయంతి, వర్థంతితో పాటు క్రిస్మస్ వంటి వేడుకలకు కుటుబంసభ్యులంతా కలసి హాజరవడం లేదు. వేర్వేరుగా హాజరవుతున్నారు. దీంతో కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జగన్, విజయమ్మ, షర్మిల అందరూ కలిసి ప్రార్థనలు చేశారు. దీంతో గొడవలు సమసిపోయాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ పెరిగాయని తెలుస్తోంది.
వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించారు. ఇది సీఎం జగన్‌కు ఇష్టం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రకటించారు. ఆ తర్వాత షర్మిల స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయాలు చేసుకుంటున్నారు. అయితే కుటుంబ పరంగా తేల్చుకోవాల్సిన కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో అందరూ ఎడమొహం..పెడ మొహం అయ్యారని పులివెందుల ప్రజల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో వైఎస్ వివేకా హత్య .., తదనంతర పరిణమాలు కూడా కుటుంబంలో కలతలకు కారణం అయ్యాయని చెబుతున్నారు.
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి