Will Jagan Attend Stalin Meeting: కేటీఆర్ రెడీ - స్టాలిన్ సమావేశానికి జగన్ వెళ్తారా?
Stalin Meeting: డీ లిమిటేషన్ అంశంపై చర్చించేందుకు 22వ తేదీన జరగనున్న సమావేశానికి హాజరు కావాలని కేటీఆర్ నిర్ణయించారు. మరి జగన్ హాజరవుతారా?

YSRCP Jagan: దక్షిణాది సెంటిమెంట్‌తో రాజకీయాలను మలుపు తిప్పేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా డీలిమిటేషన్ లో సీట్లు తగ్గబోతున్నాయని దక్షిణాది అంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతే కాదు ఓ జేఏసీగా ఏర్పడదామని ఆయన దక్షిణాదిలోని కీలక పార్టీలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఈ సమావేశానికి హాజరవ్వాలని నిర్ణయించింది. జగన్ ను కూడా డీఎంకే ప్రతినిధులు కలిసి ఆహ్వానించారు. అయితే హాజరవుతారా వద్దా అన్నదానిపై ఇంకా ఎలాంటి ప్రకటనలు వైసీపీ వైపు నుంచి రాలేదు.
ఇండియా కూటమికి జగన్ దగ్గర అవుతారా ?
స్టాలిన్ ఇండియా కూటమిలో కీలక నేత. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై ఆయన ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అయిన కర్ణాటక,తెలంగాణ ముఖ్యమంత్రులు లేదా డిప్యూటీ సీఎంలు హాజరవుతారు. అలాగే ఇతర పార్టీలు హాజవుతాయి. బీఆర్ఎస్ కూడా హాజరవుతమని ప్రకటించింది. మరి జగన్ తీసుకునే నిర్ణయం ఆయన రాజకీయ అడుగులు ఎటు వైపు అన్నదానిపై నిర్ణయించే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గతంలో ఢిల్లీలో ధర్నా నిర్వహించినప్పుడు ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతు పలికాయి. అయితే జగన్ మాత్రం ఆయా పార్టీలకు ఎప్పుడూ మద్దతు తెలియచేయలేదు.
బీజేపీకి కోపం వచ్చే పనులేమీ చేయని వైసీపీ
ఇప్పుడు తమ ప్రత్యర్థులు అయిన టీడీపీ, జనసేన బీజేపీతో కలిసి ఎన్డీఏలో ఉన్నాయి. బీజేపీతో ఎలాంటి సన్నిహిత సంబంధాలు కొనసాగించినా దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. అలాగని ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కూటమితో కలిసే అవకాశం లేదు. స్టాలిన్ తో సమావేశానికి వెళ్లినా.. కాంగ్రెస్ కూటమికి దగ్గరయ్యారన్న ప్రచారం జరుగుతుంది. ఇది బీజేపీ కోపం తెప్పిస్తే మరన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైసీపీ నేతలు అనుకునే అవకాశం ఉంది. దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ చేస్తున్న వాదనపై ఇప్పటి వరకూ వైసీపీ నేతలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
బీజేపీకి వ్యతిరేక స్టాండ్ తీసుకుంటే హాజరయ్యే చాన్స్
బీజేపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవాలన్న ఆలోచన ఇప్పటి వరకూ జనగ్ చేయలేదని అనుకోవచ్చు. కూటమి లో టీడీపీ, జనసేన పార్టీలను విమర్శిస్తారు కానీ బీజేపీని పల్లెత్తు మాట అనే ప్రయత్నం అసలు చేయరు. మోదీని కానీ.. కేంద్ర ప్రభుత్వాన్ని కాని అసలు విమర్శించారు. అలాంటి పరిస్థితి వస్తే.. ఖచ్చితంగా ఇక బీజేపీతో యుద్ధమే అనే పాలసీ తీసుకుంటేనే నేరుగా కాంగ్రెస్ కూటమి పార్టీల సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. లేకపోతే హాజరు కారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాదికి అన్యాయంపై కూడా వైసీపీ నేరుగా తన వాదన వినిపించలేని పరిస్థితుల్లో ఉన్నారని అంటున్నారు.





















