Rains in AP Telagana: తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీలో 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు
Rains in AP and Telangana | అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
IMD issues orange alert and yellow alert | హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం సోమవారం ఉదయం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బలమైన అల్పపీడనముగా మారనుంది. అలాగే కదులుతూ దక్షిణ బంగాళాఖాతము మరికొన్ని గంటల్లో చేరనుంది. మరో 2 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా మరింత కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను చేరుకుంటుంది. దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, దానిని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతాలలో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభం కానున్నాయి.
దేశంలోని పలు రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనానికి పరిస్థితులు అనుకూలమని, అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం అవుతాయని భారత వాతావరణశాఖ తెలిపింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, అస్సాం, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకుంటున్నాయిని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాంతో పాటు ఉత్తర బంగాళాఖాతంలో మరికొన్ని చోట్ల 2 రోజులలో ఈశాన్య రుతుపవనాలు ప్రభావం ప్రారంభమవుతుంది.
సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది క్రమంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపునకు వంగి ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైప సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీరం వరకు ఉన్న ద్రోణి బలహీన పడినట్లు పేర్కొన్నారు.
District forecast of Andhra Pradesh dated 14-10-2024 #IMD #APWeather #APforecast #MCAmaravati #CEOAndhra #AndhraPradeshCM #dgpapofficial #IMDWeather pic.twitter.com/Rg5TF16pcS
— MC Amaravati (@AmaravatiMc) October 14, 2024
ఏపీలో మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో వార్నింగ్
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనలతో ఈ జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లులకు అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలకు వెళ్లే వారు అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు అంత మంచిది కాదని సూచిస్తున్నారు. మత్స్యకారులు రెండు రోజులపాటు వేటకు వెళ్లకూడదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురవనున్నాయి. అక్టోబర్ 15న మధ్యాహ్నం వరకు ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి,జగిత్యాల, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) October 14, 2024
మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు.
రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనివర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలలో పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.