Weather Latest Update: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, ఈ జిల్లాల్లో భారీగా, ఇక్కడ పిడుగులకు ఛాన్స్: ఐఎండీ
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది.
దక్షిణ తమిళనాడు, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర తమిళనాడు, పొరుగు ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది వచ్చే రెండ్రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఆగ్నేయ, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం వైపు కదులుతుందని చెప్పారు. దీని ప్రభావంతో నవంబరు 08 నాటికి తూర్పు, మధ్య అరేబియా సముద్రం మీదుగా అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.
నిన్న నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఈరోజు తక్కువగా ఉంది.
‘‘పశ్చిమ చిత్తూరుతో పాటుగా పశ్చిమ అన్నమయ్య జిల్లా ప్రాంతం అయిన మదనపల్లి - చిత్తూరు పరిధిలో భారీ వర్షాలు పడేందుకు పరిస్ధితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. కొన్ని చోట్లల్లో భారీ పిడుగులు, వర్షాలను చూడగలం. మదనపల్లి - కుప్పం - వి.కోట బెల్ట్ లో భారీ వర్షాలుంటాయి. పశ్చిమ అనంతపురం జిల్లాలో వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కృష్ణా, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే వర్షాలు విస్తారంగా ఉంటాయి. కోస్తాకి దగ్గరగా ఉన్న భాగాల్లో వర్షాలు పెరగనున్నాయి. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు భాగాలతో పాటుగా ఏలూరు, ఉభయ గోదావరి, కొనసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు విస్తారంగా ఉండనున్నాయి. చిత్తూరు, అన్నమయ్య, కడప, నంద్యాల జిల్లాలతో పాటుగా కర్నూలు జిల్లాలో అక్కడక్కడ వర్షాలుంటాయి. అలాగే అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని పశ్చిమ భాగాల్లో భారీ వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు కనిపిస్తోంది. నేడు మొత్తం మీద అనంతపురం జిల్లాలోని పశ్చిమ భాగాల్లోనే అత్యథిక వర్షాలుంటాయని అంచనా’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
తెలంగాణలో ఇలా..
ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో తూర్పు దిశల్లో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 86 శాతంగా నమోదైంది.
నవంబర్ 7న దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. జోగులాంబ గద్వాల, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాలకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్ష సూచన ఉంది.