Weather Latest Update: రుతుపవనాల ఎఫెక్ట్! రెండ్రోజులు ఏపీలో పెద్ద వర్షాలు, తెలంగాణకు ఇంకాస్త టైం - ఐఎండీ వెల్లడి
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
నైరుతి రుతుపవనాలు రాగల 2, 3 రోజుల్లో ద్వీపకల్ప దక్షిణ భారతదేశంలోని మరికొన్ని భాగాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం (జూన్ 21) ఓ ప్రకటనలో తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు అక్కడక్కడ వడగాల్పులు రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగాం జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో వీచే అవకాశం ఉంది.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తీవ్ర వడగాలులు ఆదిలాబాద్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలో అక్కడక్కడ వడగాలుల పరిస్థితులు నెలకొన్నాయి.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 49 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించి వ్యాపిస్తున్న నైరుతి పవనాలు జూన్ 21, 22 తేదీల్లో మరింత చురుగ్గా పని చేస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. జూన్ 21న మన్యం, అనకాపల్లి, అల్లూరి , కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, YSR, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని తెలిపారు.
నైరుతి రుతు పవనాలు విస్తరించే అవకాశం ఉండటంతో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో జూన్ 21, 22 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 25 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడి ఒడిశా మీదుగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial