Weather Updates: రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు... ఏపీ, తెలంగాణలపై ఉపరితల ఆవర్తనం ప్రభావం
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రాలు అంచనా వేశాయి. ఏపీ, తెలంగాణలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండడం వల్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపాయి.
తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి. తెలంగాణలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విదర్భ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో వర్షాలు
ఏపీ, తెలంగాణ మీదుగా 3.1 ఎత్తున ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండడం వల్ల రాగల మూడు రోజులు తెలంగాణ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తాయని తెలిపింది. శనివారం ఉరుములు మెరుపులతో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం అసిఫాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి.
Also Read: ZyCoV-D Vaccine Emergency Approval: దేశంలో మరో టీకాకు అనుమతి.. 'జైకోవ్-డీ'కి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్
ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాల ప్రభావం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనాల ప్రభావంతో దాదాపుగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో శనివారం నుంచి మూడు రోజు పాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఉపరిత ఆవర్తనం ప్రభావం వల్ల ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు ఉంటాయని ప్రకటించింది. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరులోనూ అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
రైతుల్లో సంతోషం
బంగాళాఖాతంలో అల్పపీడనాల ప్రభావం, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో ఏపీలో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు తగిన సమయానికి పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఉపరితల ఆవర్తనం కారణంగా మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలతో ప్రభుత్వం అధికారుల్ని అఫ్రమత్తం చేసింది. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాబోయే మూడు రోజుల పాటు తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
Also Read: Gold-Silver Price: మరింత ఎగబాకిన పసిడి ధర.. దిగొచ్చిన వెండి, మీ నగరంలో నేటి ధరలివీ..