Weather Latest Update: రాయలసీమలో ఠారెత్తుతున్న ఎండ, ఈ ఏరియాలో 46 డిగ్రీల దాకా! తెలంగాణలోనూ అంతే
రాగల మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారుగా 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.
తెలంగాణలో దిగువ స్థాయిలో గాలులు వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో బుధవారం (మే 17) తెలిపారు. దీని ప్రభావం వల్ల రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణమే కొనసాగుతుందని అధికారులు చెప్పారు. రాగల మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారుగా 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. రేపటి నుండి హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఈ రోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాలలో, రేపు ఈ జిల్లాలలో పాటు ఈసాన్య జిల్లాలలో 43 డిగ్రీలు , 44 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27.2 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 42 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కూడా వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుందని అధికారులు తెలిపారు. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ ఎక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.
‘‘రాయలసీమ జిల్లాల్లో వేడి విపరీతమైంది. నిన్నటి వరకు కోస్తాంధ్రలో కొనసాగిన తీవ్రమైన ఎండలు ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో విస్తరిస్తోంది. తెలంగాణ నుంచి వీస్తున్న పొడి గాలుల వలన రాయలసీమ జిల్లాల్లో వేడి గరిష్టంగా నమోదవుతోంది. తిరుపతి జిల్లాలోని పలు భాగాలు, నెల్లూరు జిల్లాలోని పలు భాగాలు, కడప, అన్నమయ్య, నంద్యాల కర్నూలు జిల్లాల్లో వేడి 45-46 డిగ్రీలను తాకుతోంది.
నేడు కోస్తాంధ్రలో ఎండ వేడి కాస్తంత తగ్గుముఖం పట్టనుంది. మరీ ఎక్కువగా ఎండ ఉండదు కానీ వేడి అనేది కొంచం ఉంటుంది. నేడు పశ్చిమ గాలులు తగ్గుముఖం పట్టింది కాబట్టి, సముద్రపు గాలులు సాయంకాలంలోపు మధ్య ఆంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. దీని వలన ఉపసమనం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందువలనే నేడు ఉష్ణోగ్రతలు 43 C నుంచి 44 Cకి మాత్రమే పరిమితం అవుతుంది. కొన్ని ప్రదేశాల్లో మాత్రం 45 C ని తాకుతుంది. అలాగే రాయలసీమ జిల్లాల్లో మాత్రం నిన్నటికంటే నేడు వేడి ఎక్కువగా ఉంటుంది. కడప, అనంతపురం, నంధ్యాల, అన్నమయ్య జిల్లాలతో పాటుగా చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లోనూ 40-44 C ని తాకనుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు జిల్లాల్లో మాత్రం సాయంకాలం సమయంలో అక్కడక్కడ వర్షాలను చూడగలం’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.