Mansas Trust Controversy: మాన్సాస్ ట్రస్ట్‌లో వారసత్వ పోరు... తెరపైకి మరో వ్యక్తి... కోర్టులో ఇంకో పిటిషన్...
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం మరోసారి కోర్టుకెక్కింది. అశోక్ గజపతి రాజును తొలగించి తనను ఛైర్‌పర్సన్ గా నియమించాలని ఆనంద గజపతి రాజు మరో కుమార్తె ఊర్మిళ గజపతి రాజు హైకోర్టులో పిటిషషన్ వేశారు.
మాన్సాస్ ట్రస్ట్ వివాదం మరో కీలక మలుపు తీరిగింది. ప్రస్తుతం ట్రస్ట్ ఛైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించి, తనన ఛైర్మన్ గా నియమించాలని కోరుతూ ఆనంద గజపతి రాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె అయిన సంచయిత, రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతి రాజును వారసులుగా గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె కోర్టుకు విన్నవించారు. సంచయిత ఛైర్మన్ కాని పక్షంలో తనను ఛైర్మన్‌గా నియమించాలని ఊర్మిళ కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై సోమవారం వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.
అసలు ఈ వివాదం గతేడాది మొదలైంది. ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయితను మాన్సాస్ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం గతేడాది మార్చిలో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే వంశపారంపర్యంగా వస్తున్న ట్రస్టులో వయస్సులో పెద్ద వారు ట్రస్టీగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అశోక్ గజపతిరాజు వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, సంచయితను ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని కొట్టివేసింది. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా అశోక్ గజపతిరాజును తిరిగి నియమించాలని ఆదేశాలు జారీచేసింది.
సింహాచల దేవస్థానం ట్రస్టు బోర్డు, మాన్సాస్ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించడంపై పెద్ద దుమారమే రేగింది. సింహాచల దేవస్థానం ఛైర్మన్‌గా అనంద గజపతిరాజు రెండో కుమార్తె సంచయిత గజపతిరాజును రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నియమించింది. ఆ తర్వాత మాన్సాస్ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా కూడా ఆమెను నియమించింది. అశోక్ గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు తర్వాత ఆయన పెద్ద కుమారుడు.. అశోక్ గజపతి రాజు అన్నయ్య ఆనంద గజపతి రాజు ఈ ట్రస్టుకు ధర్మకర్తగా వ్యవహరించారు. 2016లో ఆనంద గజపతి మరణించారు. ఆ తర్వాత అశోక్ గజపతిరాజు సింహాచల దేవస్థానం ధర్మకర్తగా వ్యవహరించారు.
మాన్సాస్ ట్రస్ట్ ఏర్పాటు
1958 నవంబర్ 12న విజయనగరం పూసపాటి గజపతి రాజుల వంశంలో చివరి యువరాజు అయిన పూసపాటి విజయరాం గజపతి రాజు తన తండ్రి జ్ఞాపకార్ధం మహారాజా అలక నారాయణ సోసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్(మాన్సాస్)ను స్థాపించారు. మాన్సాస్ నిర్వహణ కోసం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో కలపి మొత్తం దాదాపు 14,800 ఎకరాల భూమిని ఈ ట్రస్టు నియంత్రణలో ఉంచారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో 108 ఆలయాలు, వాటి భూములు కూడా ఈ ట్రస్ట్ పరిధిలో ఉన్నాయి. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 విద్యా సంస్థలు ఉన్నాయి. 1,800 మంది ఉద్యోగులు, 15,000 మంది విద్యార్ధులు ఈ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. 1994లో పీవీజీ రాజు మరణించిన అనంతరం ఆనంద గజపతి రాజు మాన్సాస్ ట్రస్ట్ కు ఛైర్మన్ అయ్యారు. 2016లో ఆనంద గజపతి రాజు మరణం అనంతరం అశోక్ గజపతిరాజు ఛైర్మన్ అయ్యారు. కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు కారణంగా... 2020 మార్చి 4న ఆనందగజపతి రాజు రెండో కుమార్తె సంచయిత గజపతిరాజు తెరపైకి వచ్చారు.
సింహాచలం భూములపై విజిలెన్స్ విచారణ
సింహాచలం దేవస్థానానికి సంబంధించి వేల ఎకరాలు దేవుడి భూములు కాదంటూ ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించడంపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తేల్చిచెప్పాలని అధికారులను ఆదేశించింది. దేవదాయ శాఖ చట్ట నిబంధనలను ఉల్లంఘించిన బాధ్యులను గుర్తించాలని సూచించింది. ఈ అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది. 3 నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందించాలని నిర్దేశించింది.