Maharaja Govt Hospital: మహారాజ ప్రభుత్వాసుపత్రి పేరు మార్పు- భగ్గుమన్న టీడీపీ
Maharaja Govt Hospital: విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆసుపత్రి పేరును సర్వజన ఆసుపత్రిగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే పాత పేరుతో ఉన్న బోర్డులు తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు.
Maharaja Govt Hospital: విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న మహారాజా జిల్లా ఆసుపత్రిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా పేరు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా పేరు మారుస్తూ పాత పేరుతో ఉన్న బోర్డులను తొలగించి కొత్త బోర్డులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై శుక్రవారం ఆసుపత్రి వద్ద టీడీపీ శ్రేణులు నిరసనలు తెలిపారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన మహారాజా ఆసుపత్రి పేరు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. విద్య, వైద్యం కోసం వేలాది ఎకరాలు దానం చేసిన మహారాజుల పేరును ఎలా తొలగిస్తారంటూ మండిపడ్డారు. పేర్లు మార్చడం, రంగులు మార్చడం తప్ప పాలన చేయడం చేతకావట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన పేరును వెంటనే పునరుద్దరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
వైద్య కళాశాలగా అప్ గ్రేడ్ కావడంతో పేరు మార్చాం: సూపరింటెండెంట్
జిల్లా ఆసుపత్రి స్థాయి నుంచి మెడికల్ కళాశాల, టీచింగ్ స్టాఫ్ గా అప్ గ్రేడ్ కావడంతో పేరు మారుస్తూ ఆదేశాలు వచ్చాయని ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ డా.పద్మలీల తెలిపారు. ప్రస్తుతం ఉన్న మహారాజా పేరు పట్ల మరొకసారి తమ అధికారులతో సంప్రదిస్తామని తెలిపారు.
We demand continue to MAHARAJA GOVT HOSPITAL VIZIANAGARAM.... pic.twitter.com/PWyBZPQVLt
— AA RAJU (@aarajutdp) October 7, 2022
ఇటీవలే ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు..
ఇటీవలే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్టీఆర్ వర్సిటీ పేరును తొలగించి వైఎస్సార్ వర్సిటీగా పేరు మార్చింది. దీనిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చే నిర్ణయాన్ని తాను బాగా ఆలోచించే తీసుకున్నానిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ నిర్ణయం తీసుకొనే ముందు తనను తాను కూడా చాలాసార్లు ప్రశ్నించుకున్నానని, అన్నీ కరెక్ట్ అని అనుకున్నాకే ముందడుగు వేసినట్లుగా చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దీనిపై స్పందించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్‌కు ఏం సంబంధమని నిలదీశారు. ఎన్టీఆర్ నిర్మించిన విశ్వవిద్యాలయానికి తండ్రి పేరు ఎలా పెట్టుకుంటాడని నిలదీశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. ఉన్న సంస్థలకు పేర్లు మార్చితే పేరు రాదని, కొత్తగా నిర్మిస్తే పేరు వస్తుందని హితవు పలికారు. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతలే కాదు కొందరు వైసీపీ నేతలు కూడా ఎన్టీఆర్ పేరు మార్పును తప్పు పట్టారు.