Vizianagaram Rains : కొత్తవలసలో వర్ష బీభత్సం,14 గ్రామాలకు రాకపోకలు బంద్
Vizianagaram Rains : విజయనగరం జిల్లా కొత్తవలసలో భారీ వర్షం కురిసింది. దీంతో రైల్వే అండర్ బ్రిడ్జిలో వరద నీరు చేరింది. పశువులను తరలిస్తు్న్న ఓ వాహనం ఈ వరద నీటిలో చిక్కుకుంది.
Vizianagaram Rains : విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో భారీ వర్షానికి ఆర్వోబీ అంతర మార్గం పూర్తిగా జలమయం అయింది. నీటిని గమనించకుండా వచ్చిన పశువుల రవాణా వాహనం నీటిలో చిక్కుకుంది. వాహనం ఇంజిన్ లోకి నీరు చేరి నిలిచిపోయింది. రైల్వే అండర్ బిడ్జి లో కింద నీరు చేరడంతో సుమారు పద్నాలుగు గ్రామాలు, రెండు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రైల్వే అండర్ బ్రిడ్జి వరదలో చిక్కుకున్న వాహనం
విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి ఆర్వోబీ మార్గంలో అయిదు అడుగుల మేర వర్షపు నీరు నిలిచింది. దీంతో సుమారు పద్నాలుగు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పశువులను తరలించే వాహనం రైల్వే బిడ్జ్ మార్గంలో ఇరుక్కుపోవడంతో సుమారు గంటసేపు శ్రమించి స్థానికులు ట్రాక్టర్ సాయంతో దానిని బయటకు తీశారు. విశాఖ అరకు ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న వీర సాగరం గడ్డ వాగు పొంగడంతో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులకు పడుతున్నారు. ఆంజనేయ పేట, గడ్డపేట, బాబాలు ఎస్సీ కాలనీ, వీరబ్రహ్మం గుడి శివాలయం వీధిలో వర్షపు నీరు చేరడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సుమారు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే బిడ్జ్ ను నిర్మించారు. అయినా ప్రజలు కష్టాలు తీరడంలేదు. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి వర్షపు నీరు నిల్వలేకుండా ఉండేటట్లు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రైల్వే బిడ్జ్ లోని నీరును పంపుల ద్వారా బయటకు తోడే ప్రయత్నం చేస్తున్నారు రైల్వే అధికారులు.
ఏపీలో వర్షాలు
ఉత్తర కోస్తాంధ్రయ యానాంలలో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. ఏపీలో నేటి నుంచి నాలుగు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉభయ గోదావరి జిల్లాల్లో పీడనం బలపడి, కాకినాడ జిల్లాలోని తుని వైపు భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ నగరంలో, అనకాపల్లి, నర్సీపట్నంలోనూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు అధికంగా ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు, ఎల్లుండి సైతం తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్ష సూచన ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.