Dasthagiri: 'సీఎం జగన్ నుంచి ప్రాణహాని' - రక్షణ కల్పించాలని సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్
Andhra News: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి రక్షణ కోసం సీబీఐ కోర్టును ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు.
Dastagiri Petition in Cbi Court: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్ గా దస్తగిరి (Dastagiri) సీబీఐ కోర్టులో తాజాగా ప్రొటక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబానికి ఏపీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కుమారుడు చైతన్య రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించేలా ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. విట్ నెస్ ప్రొటెక్షన్ స్కీం కింద.. కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ పిటిషన్ పై మంగళవారం సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు, ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలని కూడా దస్తగిరి హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, ఈ కేసులో ఏ5 నిందితునిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల కానున్నారు.
దస్తగిరి తండ్రిపై దాడి
అయితే, కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని దస్తగిరి తండ్రిపై ఇటీవల దాడి జరిగింది. పులివెందులలో ఆటో నడుపుకుంటూ షేక్ హజీ వల్లి జీవనం సాగిస్తున్నాడు. ఇదే క్రమంలో ఈ నెల 8న శివరాత్రి సందర్భంగా నామాల గుండు వద్దకు వెళ్లాడు. అక్కడ తనపై ముగ్గురు వ్యక్తులు దాడికి దిగారని బాధితుడు తెలిపాడు. 'దస్తగిరి తండ్రివి నీవేనా అని అడిగి.. జగన్ రెడ్డిని విమర్శించి ఆయనతో పోటీ పడే స్ధాయి నీ కొడుకుకు ఉందా?... దస్తగిరిని ఎలాగైనా చంపేస్తాం' అని సదరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పాడు. వీరు వైసీపీకి చెందిన వారేనని ఆయన ఆరోపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, ఈ దాడి ఘటనను సీనియర్ లాయర్, జై భీమ్ భారత్ పార్టీ చీఫ్ జడ శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసే మొనగాడా అంటూ దస్తగిరి తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపటానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రయత్నించారని మండిపడ్డారు. దస్తగిరి పోటీలో నుంచి విరమించుకోకపోతే కుటుంబం మొత్తాన్ని హతమారుస్తామంటూ హెచ్చరించారన్నారు. దస్తగిరి గత వారం జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన అభ్యర్థిత్వంపై ఏమీ చేయలేక దస్తగిరి కుటుంబ సభ్యులపై దాడి చేయటం దారుణమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతోనే ఈ దారుణం జరిగిందని శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
పులివెందుల నుంచి పోటీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పులివెందుల నుంచి పోటీ చేస్తానని.. సీఎం జగన్‌ను ఢీకొడతానని దస్తగిరి సవాల్ చేశారు. ఆయన, వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారి బెయిల్ పై విడుదలయ్యారు. మరోవైపు, కోడికత్తి కేసు నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడి కత్తి శ్రీను వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. రానున్న ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు సోమవారం రాత్రి ప్రకటించారు. విజయవాడలోని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. పేదవాడి కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏ ఒక్క కులం, మతం కోసమో తాను రాజకీయాల్లోకి రావడం లేదని, చట్టసభల్లో అడుగుపెట్టాలన్నారు. పేదవాళ్ల సమస్యల కోసం పోరాడాలని నిర్ణయం తీసుకున్నానని ఈ సందర్భంగా శ్రీనివాసరావు వెల్లడించారు.
Also Read: Dharmana Prasada Rao : ఇవే చివరి ఎన్నికలు - మరో అవకాశం ఇవ్వండి- ధర్మాన సంచలన వ్యాఖ్యలు