Dastagiri News: పులివెందులలో జగన్‌పై పోటీ చేస్తా - దస్తగిరి, భద్రత కోసం తెలంగాణ సీఎంకు వినతి
Dastagiri Comments: వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు దస్తగిరి హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పారు.
![Dastagiri News: పులివెందులలో జగన్‌పై పోటీ చేస్తా - దస్తగిరి, భద్రత కోసం తెలంగాణ సీఎంకు వినతి Viveka case Dastagiri says he will contest in Pulivendula against CM Jagan Dastagiri News: పులివెందులలో జగన్‌పై పోటీ చేస్తా - దస్తగిరి, భద్రత కోసం తెలంగాణ సీఎంకు వినతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/b1de6fa00063a809d3421aaab9c494e61709035715923234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Viveka Murder Case: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పులివెందుల నుంచి పోటీ చేస్తానని.. సీఎం జగన్‌ను ఢీకొడతానని వివేకా కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సవాలు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన బెయిల్ పైన విడుదల అయ్యారు. ఈ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు దస్తగిరి హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పారు.
ఏపీలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనాత్మకం అయినదని, దాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం తనను ప్రలోభాలకు గురి చేస్తుందని దస్తగిరి ఆరోపించారు. తనను భయభ్రాంతులకు గురిచేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని దస్తగిరి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి అందరూ తనను బెదిరించిన వారిలో ఉన్నారని అన్నారు. వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు అధికారి రాం సింగ్ పై తప్పుడు ఆరోపణలు చేసేలా తనపై ఒత్తిడి చేశారని అన్నారు.
వివేకా కేసు విషయంలో ఏపీలో రాజకీయంగా వైసీపీపై ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి.. ఓట్లు పడని పరిస్థితి ఉంటుందని అన్నారు. అందుకే కేసు నీరుగార్చేందుకు.. తనకు రూ.20 కోట్ల డబ్బులు ఆశ చూపారని దస్తగిరి ఆరోపించారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి ఓ డాక్టర్ తరహాలో జైలులోనికి ప్రవేశించి తనను ప్రలోభాలకు గురిచేశారని అన్నారు. నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వచ్చారు. తనను అరెస్టు చేయాలని ఆర్డర్స్ వచ్చాయని.. అందుకు నాంపల్లి కోర్టుకు వచ్చి రీకాల్ పిటిషన్ వేశానని అన్నారు. న్యాయమూర్తి కూడా దాన్ని అంగీకరించారని దస్తగిరి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తనకు సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని దస్తగిరి కోరారు. మార్చి 12కు కేసు వాయిదా పడినందున అప్పుడు మళ్లీ కోర్టుకు వస్తానని అన్నారు.
ఇటీవల బెయిల్ పై విడుదల
యర్రగుంట్ల, వేముల పోలీసులు పెట్టిన అట్రాసిటీ, దాడి కేసుల్లో బెయిలు మంజూరు కావడంతో జైలు నుంచి దస్తగిరి బయటకు వచ్చారు. కడప జైలు అతిథిగృహంలో సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చి పోలీసు బందోబస్తు మధ్య పులివెందులకు వెళ్లారు. తాను ఎవరికి భయపడేది లేదని పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి సమీపంలోనే తాను నివాసం ఉంటున్నానని దస్తగిరి ఇటీవల అన్నారు. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండంటూ సవాల్ విసిరారు. రాజీకి రావాలని వైసీపీ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని అన్నారు. వివేకా హత్యలో పాల్గొని తప్పు చేశానని మరోసారి అలాంటి తప్పు చేయదల్చుకోలేదని దస్తగిరి తెలిపారు. వివేకా కేసు తర్వాత తనపై వివిధ కేసులు మోపి మళ్లీ జైలుకు పంపారని దస్తగిరి ఆరోపించారు. అలా నాలుగు నెలల తర్వాత బెయిల్ వచ్చిందని అన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కీలక ఆరోపణలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్యను అడ్డం పెట్టుకొని సానుభూతితో జగన్ ఎన్నికల్లో గెలుపొందారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ అదే కుట్రతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)