Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ "సామాజిక న్యాయ భేరి" శ్రీకాకుళం నుంచి మొదలైంది. తన విధానాలతో సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంది పలికారని ప్రజలకు వివరించారు మంత్రులు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జరిగిన సామాజిక న్యాయాన్ని వివరించడానికి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర కార్యక్రమానికి శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం ప్రారంభమైన వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు నుంచీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు పాలనలో భాగస్వామ్యం కోసం పోరాటాలు చేశాయన్నారు. ఎటువంటి పోరాటాలు చేయకుండా మొదటిసారిగా 74 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మంత్రులయ్యారని గుర్తు చేశారు. ఇది చరిత్రలో సీఎం వైఎస్ జగన్ ఒక్కరే చేయగలిగారని ప్రశంసించారు. ఇలా చేయమని సీఎం జగన్‌కు ఎవరూ అడగలేదన్న ఆయన... స్వతహాగా ఆలోచించి అణగారిన, బలహీన వర్గాలకు అవకాశం కల్పించిన ఘనత జగన్‌దన్నారు.
తలవంచాల్సిన పని లేదు
ప్రభుత్వ పథకాల్లో 82 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. పేదలకు ప్రభుత్వ నిధులను పంచిపెడితే దాన్ని కొందరు హేళన చేస్తున్నారని ఆరోపించారు. విమర్శలు చేసే వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అవమానించినట్టే అని అభిప్రాయపడ్డారు. గతంలో నాయకులకు సలాం కొడితే పథకాలు ఇచ్చే పరిస్థితి ఉండేదన్నారు. కానీ ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఎవరికీ తల వంచాల్సిన పని లేదని పేర్కొన్నారు ధర్మాన. సీఎం జగన్ వాళ్ళ ఇంటికే పథకాలు అందిస్తున్నారన్నారు.
పథకాల్లో తప్పులు చెప్పారా?
చంద్రబాబు రాష్ట్రమంతా తిరిగారని... కానీ తాము ఇచ్చిన పథకాల్లో తప్పు జరిగిందని చెప్పగలిగారా అని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఏ బీసీ అయినా తల వంచే పరిస్థితి వైఎస్‌ఆర్ ప్రభుత్వంలో లేదని అభిప్రాయపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను సమాజంలో గౌరవంగా బ్రతికేలా సీఎం జగన్ చేశారన్నారు. దానికి సజీవ సాక్ష్యంగా నిలబడాలనే బస్సు యాత్ర చేస్తున్నట్టు పేర్కొన్నారు. మూడేళ్ళలో ఈ వర్గాల్లో అనేక మార్పులు తీసుకొచ్చామని... అవన్నీ ప్రజలకు చెప్తామన్నారు. ఈరోజు దేశానికే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందేశాన్ని పంపారని తెలిపారు.
దేశానికే జగన్ ఆదర్శం
పశుసంవర్ధక శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ... బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్న సంఘసంస్కర్త సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని దేశమంతా చూస్తోంది. మిగిలిన రాష్టాలకు ఆదర్శంగా చేసుకోనే పరిస్థితి ఉందన్నారు. ప్రజలకి వాస్తవాలు వివరించేందుకు బస్సు యాత్ర చేస్తున్నామని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు కృష్ణదాసు, ఇన్‌చార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వైఎస్ విగ్రహంతోపాటు అంబేద్కర్ విగ్రహలకు పూలదండలు వేసి యాత్రను ప్రారంభించారు.