YSRCP News: ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
Andhra Pradesh: జమిలీ ఎన్నికలు వస్తాయన్న ఆలోచనతో ఉన్న వైసీపీ ఆ దిశగా నాయకత్వ బలోపేతానికి చర్యలు తీసుకుంటోంది. సైలెంట్‌గా ఉంటున్న సీనయర్లను యాక్టివ్ చేసే పనిలో పడింది.
Srikakulam : వైసీపీ అధిష్టానం వైఖరి పట్ల అలకతో ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ విజయసాయి రెడ్డి గంటకు పైగా ఏకాంతంగా చర్చించారు. శ్రీకాకుళం జిల్లాలో అర్థాంతరంగా నిలిచిపోయిన వైసీపీ కార్యాలయ పనులు ఫునః ప్రారంభించేందుకు సూచనలివ్వడానికి విజయసాయిరెడ్డి శ్రీకాకుళం వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా అందులో ఏమాత్రం వాస్తవం లేదని అర్థమవుతోంది. నిజంగా పార్టీ కార్యాలయ పనుల మీదే వచ్చి ఉంటే ముందు ఆ పని చూసుకుని ఆ తరువాత ఆ పక్కనే ఉన్న ధర్మాన ఇంటికి వెళ్లి ఉండేవారు.
జిల్లాలో పార్టీ నాయకులు పార్టీ కార్యాలయానికి చేరుకోక ముందే ధర్మాన ఇంటికి విజయసాయిరెడ్డి నేరుగా వెళ్లి ఏకాంతంగా గంటకుపైగా చర్చించారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డితోపాటు విశాఖపట్నం నుంచి వచ్చిన చిన్న శ్రీను, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ బయట విజిటర్స్ హాల్లోనే ఉండిపోయారు. గంటకుపైగా మాట్లాడిన తరువాత బయటకు వచ్చినా ధర్మాన తన మౌనాన్ని వీడలేదు.
ఏకాంతంగా జరిపిన చర్చలో గడిచిన ఐదేళ్లలో పార్టీ చేసిన తప్పిదాలు, జగన్మోహన్‌రెడ్డి వ్యవహారశైలిని చర్చించుకుని ఒకరినొకరు ఓదార్చుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అటు ధర్మాన శిబిరం నుంచి కానీ, ఇటు విజయసాయిరెడ్డి వర్గం నుంచి కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆ తరువాత కాసేపు విజిటర్స్ హాల్లో అందరితో కలివిడిగా విజయసాయిరెడ్డి మాట్లాడినా ధర్మాన పెద్దగా జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. పార్టీ అధికారం కోల్పోయిన తరువాత ధర్మాన ప్రసాదరావు ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డిని కేవలం ఒక్కసారి మాత్రమే కలిశారు. ఆ తరువాత రెండుసార్లు జిల్లా నేతలతో జగన్ సమావేశమైనా ఆ కార్యక్రమానికి ధర్మాన వెళ్లలేదు.
శ్రీకాకుళం జిల్లాలో రాజశేఖరరెడ్డి జయంతి, వర్థంతి కార్యక్రమాల్లో కూడా ధర్మాన పాల్గొనలేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడితోపాటు,పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్ష పదవీ స్వీకార కార్యక్రమం జిల్లా కేంద్రానికి దూరంగా నరసన్నపేటలో పెట్టుకున్నారు. దానికి కూడా ధర్మానప్రసాదరావు హాజరుకాలేదు. కొద్దిరోజుల క్రితం జిల్లాలో పార్టీ ఆఫీసు పనులపై ఒక నిర్ణయం తీసుకోవడానికి జిల్లాలో వైసీపీ ఇన్‌ఛార్జ్‌లంతా రావాలని ధర్మాన క్రిష్ణ దాస్ పిలుపునిచ్చారు. ఎలాగూ పార్టీ కార్యాలయం లేదు కాబట్టి ఆ పక్కనే ధర్మాన ప్రసాదరావు బంగ్లా ఉందని, అందులో సమావేశమవుతున్నట్లు ప్రకటించారు. ధర్మాన ఇంట్లో సమావేశం పెట్టుకుంటే తాము ఎందుకు వస్తామంటూ తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి డుమ్మా కొట్టారు. తన బంగ్లాలో జరిగే సమావేశానికి కూడా ధర్మాన ప్రసాదరావు రాలేదు.
అంత వరకు తన మీటింగులకు ధర్మాన ప్రసాదరావు రాకపోవడానికి సీరియస్‌గా పరిగణించని జగన్మోహనరెడ్డి ఇంట్లో జరిగిన సమావేశానికి హాజరు కాకపోవడంపై దృష్టి సారించి విజయసాయిరెడ్డిని రాయబారిగా పంపినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర బాధ్యతలు మళ్లీ స్వీకరించిన తరువాత శ్రీకాకుళంలో పెట్టిన తొలి అడుగే ధర్మాన ఇంట్లో పెట్టారు.
జగన్మోహనరెడ్డి వ్యవహారశైలి మారితే రెండున్నరేళ్ల తరువాత ఏదో ఒక నిర్ణయం తీసుకుందామన్న ఆలోచనలో ధర్మాన ప్రసాద రావు ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు వస్తే గానీ జిల్లాలో పార్టీ కార్యక్రమాలు ఊపందుకోవన్న రిపోర్టు జగన్మోహనరెడ్డికి క్రిష్ణదాస్ ఇచ్చారట. ఈ మేరకు ధర్మాన అలక ఏ స్థాయిలోఉందో తెలుసుకోవాలని విజయసాయిరెడ్డి వచ్చినట్లు కనిపిస్తోంది.
అధికారంలో ఉన్నపుడు ధర్మాన ప్రసాదరావుతోపాటు అనేకమంది సీనియర్ నాయకులను పట్టించుకోలేదన్న ఆరోపణ ఉంది. అనేక అవమానాలు ఎదురయ్యాయి. ఇప్పుడు 2027లో జమిలి ఎన్నికలు వస్తాయన్న కారణంతో నాయకత్వాన్ని బలోపేతం చేయాలన్న కారణంతో రాయబేరాలు సాగించినట్లు తెలుస్తోంది. ధర్మానకు డిమాండ్లు ఏమీలేవని... జగన్మోహనరెడ్డి మైండ్సెట్ మారితే చాలంటున్నారు ధర్మాన అనుచరులు.
Also Read: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?