Paidithalli Temple: వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం - అంబరాన్నంటిన సంబరాలు
తొలేళ్ల పండుగలో భాగంగా సోమవారం (అక్టోబరు 11) రాత్రి 11 గంటలకు భాజా భజంత్రీలు, మేళతాళాలు, తప్పెట్ల మధ్య అమ్మవారి ఘటాలకు పూజలు నిర్వహించేందుకు కోటలోకి తీసుకొచ్చారు.
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ కార్యక్రమ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అందులో భాగంగా తొలి ఘట్టం తొలేళ్ల పండుగ. ఈ సంబరం వైభవంగా సాగింది. తొలేళ్ల పండుగలో భాగంగా సోమవారం రాత్రి 11 గంటలకు భాజా భజంత్రీలు, మేళతాళాలు, తప్పెట్ల మధ్య అమ్మవారి ఘటాలకు పూజలు నిర్వహించేందుకు కోటలోకి తీసుకొచ్చారు. వీటితో పాటు, పూజారులు, తలయారులు తరలి వచ్చారు. కోటలోని రౌండ్ మహల్ లో ఘటాలకు శక్తి పూజలు నిర్వహించారు. ఘటాలను తిరిగి గుడివద్దకు తీసుకొచ్చారు. అమ్మవారి చదురుగుడి వద్ద పూజారి అమ్మ వారి చరిత్రను చెప్పారు.
అనంతరం.. ఘటాల్లో నిల్వ చేసి పూజాది కార్యక్రమాలను నిర్వహించిన ధాన్యాపు విత్తనాలను రైతులకు పంచి పెట్టారు. వీటిని పొలాల్లో చల్లితే, అధిక దిగుబడులు వస్తాయని రైతుల విశ్వాసం. ఈ నేపథ్యంలో పూజారి చేతుల మీదుగా విత్తనాలను అందుకునేందుకు ప్రజలు విరగబడ్డారు. అనంతరం ఘటాలను భక్తుల దర్శనార్థం బడ్డీలా ఏర్పాటు చేశారు. ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి, పసుపు కుంకుమలతో మొక్కుబడులు తీర్చుకున్నారు. ఇలా తొలేళ్ల కార్యక్రమం ఘటాలు కోట వద్దకు తీసుకురావటం, శక్తి పూజలు నిర్వహించటం, తిరిగి అమ్మవారి కోవెలకు తరలిరావటం.. అందులోని ధాన్యాన్ని రైతులకు పంచిపెట్టడం.. ఘటాలకు భక్తులు పసుపు, కుంకుమ సమర్పణ కార్యక్రమాలన్ని మంగళవారం తెల్లవారుఝామున మూడు గంటల వరకు సాగాయి.
తొలేళ్ల పండుగను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావటంతో పురవీధులన్నీ జనసందోహంగా మారాయి. ప్రధానంగా కోట, సింహాచలం మేడ, మూడు లాంతర్లు, గంటస్థభం వీధులన్ని కిక్కిరిసిపోయాయి. ఆలయం వద్ద ఇసుక వేస్తే రాలన్నంత జనం బారులు తీరారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, పోలీసు బందోబస్తు చేపట్టారు.
దసరా వెళ్లిన మంగళవారం ఉత్సవాలు
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు 254 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ప్రతీయేటా విజయదశమి వెళ్ళిన మంగళవారం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతుంది. పైడితల్లి అమ్మవారి జాతరలో సిరిమానోత్సవానికి ప్రత్యేకత ఉంది. సిరిమాను (సిరిమానోత్సవం) అనేది భక్తి పూర్వకంగా జరుపుకునే ఒక ఉత్సవం.విజయనగరం పట్టణంలో శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం పేరిట ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం జరుగుతుంది. ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూర్చొని గుడికి ప్రదక్షిణ చెయ్యడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం.
ఈ సిరిమాను కోసం 33 మూరలు ఉండే వృక్షాన్ని కనిపెట్టడం సామాన్యులకు సాధ్యమయ్యే అంశం కాదు. ప్రతీ ఏటా సిరిమాను సంబరానికి సరిపడే వృక్షం లభించడం కూడా ఒక అద్భుత ఘట్టమే.
సిరిమాను రథం ఊరేగింపులో 8 ప్రధానమైన అంశాలు ఉంటాయి. అన్నింటిలో కీలకమైనది విశేషమైనది సిరిమాను సంబరం, సిరిమాను ఉపరితలంపై బిగించే ఇరుసు, దానిపై ప్రధాన పూజారి ఆసనం, ఆయన చేతిలో విసన కర్ర ప్రత్యేక ఆకర్షణలు. సిరిమాను తిరుగుతున్నంత సేపూ భక్తులు అరటి పళ్లు విసరడం ఆనవాయితీగా వస్తోంది. చూడముచ్చటగా, అత్యంత శోభాయమానంగా సువర్ణ వర్ణంతో కళకళలాడే సిరిమాను ప్రధాన ఆకర్షణ. ఈ సిరిమాను ముందు సాగే బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ఆకర్షణలుగా నిలుస్తాయి.
విజయనగర సామ్రాజ్య కాలంలో సిడిమ్రాను అనే ఉత్సవం జరిగేది. ఆ ఉత్సవం కూడా దాదాపు ఇదే పద్ధతిలో జరిగేది. అయితే భక్తులు కొక్కేనికి అమర్చిన పీఠంపై కాక, స్వయంగా తామే ఆ కొక్కేలకి వేలాడేవారు.