Vruksha Bandhan: రక్షా బంధన్ కాదిది వృక్షా బంధన్- విశాఖలో మహిళల వినూత్న వేడుక
Vrukhsa Bandhan: రాఖీ పండుగ అంటే అక్కా చెల్లెళ్లు, అన్నా,తమ్ముళ్లకు కట్టేదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ వైజాగ్ మహిళలు మాత్రం రక్షా బంధన్ ను వృక్షా బంధన్ చేసి 150 ఏళ్ల మర్రి చెట్టుకు రాఖీ కట్టారు.
Vrukhsa Bandhan: దేశం అంతటా సోదరీమణులు.. సోదరులకు రాఖీ కట్టి రాఖీ పండగను జరుపుకుంటారు. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. కానీ వైజాగ్ మహిళలు మాత్రం రాఖీ పండుగను విచిత్రంగా జరుపుకున్నారు. అన్నా, తమ్ముళ్లకు కట్టాల్సిన రాఖీని ఓ 150 ఏళ్ల మర్రి వృక్షానికి కట్టారు. అయితే ఇదేదో ఈరోజే మొదలు పెట్టిన కార్యక్రమం కాదులెండీ. గత పాతికేళ్లుగా మహిళలంతా వచ్చి ఈ మర్రి చెట్టుకి రాఖీ కట్టి వెళ్తున్నారు.
మర్రి చెట్టుకు రాఖీ ఎందుకు?
రాఖీ పండుగ అనేది అన్నా, చెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల మధ్య ఎంత బంధం బలపడేలా చేస్తుంది. ఒకరికి ఒకరు తోడున్నామనే భరోసా ఇస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వైజాగ్ అమ్మాయిలు మాత్రం ఈ పండుగను మరోలా సెలబ్రేట్ చేసుకున్నారు. రైల్వే గెస్ట్ హౌస్ లోని 150 ఏళ్ల మర్రి చెట్టుకు రాఖీ కట్టడం ద్వారా మనుషులకు..చెట్లకు మధ్య ఉండాల్సిన అనుబంధాన్ని చాటి చెప్పారు. ఈ చెట్టును రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా గతంలో కొట్టెయ్యాలని అధికారులు చూసినా.. 25 ఏళ్ల నుంచి దాన‌్ని అడ్డుకుంటూ వృక్షా బంధన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెబుతున్నారు గ్రీన్ క్లైమేట్ అనే ఎన్జీవో సంస్థ ప్రతినిధి రత్నం.
మానవాళి మనుగడకు వృక్ష జాతులే కీలకం..
వృక్షాబంధన్ కార్యక్రమం కోసం లోకల్ గా ఉండే వివిధ కళాశాలల నుంచి విద్యార్థినులను తీసుకువచ్చి వారితో చెట్టుకు రాఖీ కట్టించారు. మరో ప్రత్యేకత ఏంటంటే ఈ రాఖీలన్నీ సహజ సిద్దంగా దొరికే వివిధ చెట్ల విత్తనాలతో తయారు చేసినవే. మార్కెట్ లో లభించే ప్లాస్టిక్, పాలిథిన్ రాఖీల స్థానంలో దేశీయ విత్తనాలతో తయారు చేసే రాఖీలను ప్రోత్సహించడం కూడా తమ ప్రణాళికలో భాగం అని రత్నం చెబుతున్నారు. విత్తనాలతో తయారు చేసిన రాఖీలను చెట్ల కొమ్మలకు రాఖీలుగా కడ్తే.. పక్షులు విత్తనాలు తిని మట్టిలో విసర్జిస్తాయి. వాటి వల్ల మళ్లీ చెట్లు మొలకెత్తుతాయి. అవే వచ్చే రోజుల్లో మహా వృక్షాలుగా మారి వందల మందికి నీడనిస్తాయి. హరితహారంతో అందాల విశాఖను పర్యావరణ రహితనగరంగా మార్చుకోవచ్చని పర్యావరణ ప్రియులు చెబుతున్నారు.
ఆపదలో ఉన్నప్పుడు అన్నా, తమ్ముళ్లలాగే చెట్లూ ఆదుకుంటాయి..!
చెట్లు లేకపోతే జరిగే నష్టాన్ని గుర్తించిన గ్రీన్ క్లైమేట్ సంస్థ యజమానులు పర్యావరణ ప్రేమికలను ఏకం చేసి ఈ వృక్షా బంధన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సోదరుల లాగానే చెట్లను కూడా ఇంటి సభ్యులుగా భావించి వాటితో కూడా ఎమోషనల్ బంధాన్ని ఏర్పరుచుకోవాలని సంస్థ ప్రతినిధి రత్నం వివరిస్తున్నారు. మనం ఆపదలో ఉన్నప్పుడు వచ్చి ఆదుకునే అన్నా, తమ్ముళ్లలాగానే చెట్లు కూడా స్వచ్ఛమైన గాలిని అందించి.. మన ప్రాణాలను నిలుపుతున్నాయని పేర్కొంటున్నారు. పర్యావరణ పరిరక్షణలో చెట్ల పాత్ర చాలా గొప్పదని.. అందుకే మనం అంతా వందల ఏళ్ల నాటి చెట్లను కాపాడుకునేందుకు కృషి చేయాలని అక్కడికి వచ్చిన పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. అందులో తమను కూడా భాగం చేసినందుకు గ్రీన్ క్లైమేట ఎన్జీఓ సంస్థ యాజమాన్యానికి, సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.