Jagan Raheja Meeting: ఏపీ సీఎం జగన్ తో రహేజా భేటీ - రాష్ట్రంలో తొలి ఇనార్బిట్ మాల్ శంకుస్థాపనకు ఆహ్వానం
Jagan Raheja Meeting: విశాఖలో ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనుల శంకుస్థాపనకు సీఎం జగన్ ను రహేజా గ్రూపు ప్రెసిడెంట్ నీల్ రహేజా ఆహ్వానించారు.
APs first Inorbit mall in Vizag soon: ఏపీ కార్యనిర్వాహక రాజధాని విశాఖలో రహేజా గ్రూప్ రూ. 600 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఈ పెట్టుబడులపై రహేజా గ్రూపు ప్రెసిడెంట్ నీల్ రహేజా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రహేజా గ్రూప్ ఇనార్బిట్ మాల్ నిర్మాణం చేపట్టానున్నట్లు సీఎం జగన్ కు వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు జరిగిన ఈ భేటీలో రహేజా గ్రూప్ పెట్టుబడులపై కంపెనీ ప్రతినిధులు సీఎం జగన్ తో చర్చించారు.
ప్రస్తుతం చేపట్టనున్న ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనుల శంకుస్థాపనకు సీఎం జగన్ ను రహేజా గ్రూపు ప్రెసిడెంట్ నీల్ రహేజా ఆహ్వానించారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఇనార్బిట్ మాల్స్ సీఈఓ రజనీష్ మహాజన్, కె రహేజా గ్రూప్ ఆంధ్రా, తెలంగాణా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోనె శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.
ఏపీలో 14,500 కోట్ల రూపాయల వ్యయంతో అదాని డేటా సెంటర్ వైజాగ్ లో రూపుదిద్దుకుంటోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల కిందట డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశారు. తాజాగా విశాఖలో మరో భారీ ప్రాజెక్ట్ ఏర్పాటుకు రహేజా గ్రూపు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో తొలి ఇనార్బిట్ మాల్ నిర్మించేందుకు రహేజా గ్రూప్ అడుగులు వేస్తోంది. దాదాపు 17 ఎకరాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మించనున్నారు. అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మాణ పనుల శంకుస్టాపనకు హాజరు కావాలని సీఎం జగన్ ను రహేజా ఆహ్వానించారు. మరోవైపు సీఎం జగన్ త్వరలోనే విశాఖకు మకాం మార్చనున్నారు. రాష్ట్రానికి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను డెవలప్ చేయాలని, ఐటీ హబ్ గా రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial