కళింగ బ్లాక్‌లో సీఎం జగన్ కార్యాలయం, రుషికొండలో వేగంగా పనులు
విశాఖకు రాజధాని పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిసెంబరు నుంచే విశాఖ నుంచి పాలన అందించేందుకు రెడీ అవుతున్నారు.
విశాఖకు రాజధాని పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిసెంబరు నుంచే విశాఖ నుంచి పాలన అందించేందుకు రెడీ అవుతున్నారు. రుషికొండపై నాలుగు బ్లాకుల్లో మొత్తం 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భవనాల నిర్మాణం జరుగుతోంది. ముఖ్యమంత్రి నివాసంతో పాటు సీఎం కార్యాలయం ఉండనున్నాయి. ముఖ్యమంత్రి విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్ ద్వారా చేరుకునేలా బీచ్‌లోని హెలిప్యాడ్ ఉపయోగిస్తారన్న ప్రచారం సాగుతోంది. రుషికొండ చుట్టూ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసేశారు. కొండ చుట్టూ మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు పెట్టారు. 24 గంటలూ నిఘా పెట్టారు. కొండ వద్ద విశాఖ- భీమిలి బీచ్ రోడ్డు వైపు రెండు, కొండ వెనుక సముద్ర తీరంలో ఒక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరూ రాకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఎవరైనా వచ్చిన వెనక్కి పంపేస్తున్నారు.
కళింగ బ్లాక్‌లో సీఎంవో
సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో ఉండేందుకు విజయనగర బ్లాక్‌ను 3,764 చ.మీ.లతో నిర్మాణం చేస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే సముద్రం అందాలు ఆహ్లాదకరంగా కనిపించనున్నాయి. ఇందులోనే ప్రెసిడెన్షియల్ సూట్ గదులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం కళింగ బ్లాక్‌ను సిద్ధం చేస్తున్నారు అధికారులు. 5,753 చ.మీ.లలో కళింగ బ్లాక్ నిర్మాణం చేపట్టినప్పటికీ, ఆ తర్వాత 7,266 చ.మీ.లకు పెంచారు. ప్రస్తుతం నిర్మిస్తున్న నాలుగు భవనాల్లో ఇదే పెద్దది. 1,821.12 చ.మీ.లలో వేంగి బ్లాకులను ఇప్పటికే సిద్ధం చేయగా, 690.40 చ.మీ.లలో నిర్మిస్తున్న గజపతి బ్లాక్ పనులు చివరి దశలో ఉన్నాయి. ముఖ్యమంత్రి విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్ ద్వారా చేరుకునేలా బీచ్‌లోని హెలిప్యాడ్ ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో హెలీ టూరిజం నిర్వహించిన సమయంలో హెలిప్యాడ్ నిర్మించారు. అక్కడి నుంచి నేరుగా రుషికొండకు చేరుకునేలా ఇప్పటికే ఒక మార్గాన్ని కొండ వెనుక నుంచి ఏర్పాటు చేస్తున్నారు.
విశాఖలో భవనాలపై అధికారుల ఆరా
జగన్‌మోహన్‌రెడ్డి వైజగ్ కు మకాం మార్చేస్తానని ప్రకటించడంతో అధికారులు అవసరమైన ఏర్పాట్ల నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సీఎంవోలో కీలక అధికారుల నివాసాలకు అవసరమైన భవనాలను గుర్తించేందుకు ఐఏఎస్‌లతో ప్రభుత్వం కమిటీ నియమించింది. దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ, విశాఖ నగరంలో అందుబాటులో ఉన్న భవనాల వివరాలు సేకరించే పనిలో బిజీ అయ్యారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ విభాగం కార్యదర్శి పోలా భాస్కర్ ఇప్పటికే జిల్లా అధికారులతో పలు సార్లు సమావేశం అయ్యారు. ఏ యే ప్రాంతంలో ఏ యే భవనాలు ఖాళీగా ఉన్నాయి ? ఆ భవనాల విస్తీర్ణం ఎంత ? ఏ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉంది ? భద్రతాపరంగా లోపాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాలపై ఐఏఎస్ ల కమిటీ వివరాలు రాబడుతోంది. రుషికొండ వద్ద రాడిసన్ బ్లూ హోటల్ ఎదురుగా ఉన్న పర్యాటకశాఖకు చెందిన మూన్ ల్యాండ్ ప్రాజెక్టు స్థలంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Also Read: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 3,282 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేస్తోంది