Vizag News: విశాఖలో నడిరోడ్డుపైనే ఘోరంగా కొట్టుకున్న విద్యార్థులు - భారీగా ట్రాఫిక్ జామ్
Traffic Jam in Vizag: కాలేజీ విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలు విసురుకుని మరీ కొట్టుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయి.
Visakhapatnam News: విశాఖపట్నంలో విద్యార్థులు రెచ్చిపోయారు. రెండు గ్రూపులుగా విడిపోయిన ఓ కాలేజీ స్టూడెంట్స్ బాజీ జంక్షన్ సమీపంలో పరస్పరం దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో చాలా మంది గాయపడ్డారు. ట్రాఫిక్ జామ్ కారణంగా చాలా మంది ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ లోనే చిక్కుకుపోయారు.
ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలు విసురుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘర్షణ వెనుక కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యర్థి వర్గం తమపైనే ముందు దాడి చేశారంటూ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘర్షణకు పాల్పడిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యాన్ని కోరారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఘర్షణకు పాల్పడిన విద్యార్థులను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు. విచారణలో తేలిన వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.