(Source: ECI/ABP News/ABP Majha)
TDP Protest: ముడసరలోవ పార్కు వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళన - భూములు ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్
TDP Protest: ముడసరలోవ భూములను "పిపిపి" పేరుతో ప్రైవేట్ వారికి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ముడసరలోవ పార్కు మెయిన్ గేటు వద్ద బైఠాయించారు.
TDP Protest: విశాఖ జిల్లాలోని ముడసరలోవ భూములను "పిపిపి" పేరుతో ప్రైవేట్ వారికి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ముడసరలోవ పార్క్ మెయిన్ గేట్ వద్ద టీడీపీ శ్రేణులు బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గండి బాబ్జి, బిమిలి టీడీపీ ఇన్ఛార్జ్ రాజబాబులు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం వాటర్ బాడీస్ ని టీడీపీ నేతలు పరిశీలించారు. ముడసరలోవ భూములు చాలా విలువైనవని.. ఇవి విశాఖ ప్రజల దాహార్తిని తీరుస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఉపయోగపడే ముడసరలోవ పార్కుని ప్రైవేటు పరం చేయడం దారుణం అని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో టీడీపీ అధికారంలోకి రాగానే కాన్సిల్ చేస్తామన్నారు.
దీనిపై వైసీపీ ఘాటుగా స్పందిస్తోంది. టీడీపీ లేనిపోని ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందంటోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మార్చేందుకు విశాఖ వేదిక కాబోతోందని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్, మార్చి 28,29 తేదీల్లో జీ20 సదస్సులు జరగబోతున్నాయన్నారు. త్వరలో వైజాగ్ రాజధాని కాబోతోందని, ముఖ్యమంత్రి కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నట్టు ఆయనే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా విశాఖ ఎగ్జిక్యూటివ్, అమరావతి లెజిస్లేటివ్, కర్నూలు న్యాయ రాజధానులుగా కొనసాగుతాయని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. డిసెంట్రలైజేషన్ కు కట్టుబడి ఉన్నామని, ఏ ప్రాంతాన్ని చిన్నచూపు చూసే ప్రసక్తి లేదని తెలిపారు. విశాఖపట్నం రాజధాని నిర్ణయం ఇప్పుడు తీసుకుందని కాదన్నారు. ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతిలో కనీసం సచివాలయం కూడా సరిగ్గా కట్టలేదని ఎద్దేవాచేశారు. వర్షం వస్తే సచివాలయంలో తడిసిపోయేపరిస్థితి ఉందని గతంలో తానుచేసిన కామెంట్లు గుర్తు చేశారు.
దేశంలో ఆంధ్రప్రదేశ్ 8వ అతిపెద్ద రాష్ట్రంగా ఎదిగిందన్నారు. 974కిలమీటర్ల సముద్రతీర్ ఉన్న రెండో అతిపెద్ద రాష్ట్రమని గుర్తు చేశారు. జీఎస్డీపీలో 11.43శాతంతో మూడేళ్లుగా మొదటిస్థానంలో ఉందన్నారు. నీతి ఆయోగ్ కూడా ఏపీ చేపడుతున్న సంస్కరణలను కీర్తిందని తెలిపారు. దేశంలో 11ఇండస్ట్రీయల్ కారిడార్స్ తీసుకొస్తుంటే అందులో మూడు క్లస్టర్లు ఏపీ నుంచి వస్తున్నాయన్నారు అమర్నాథ్. విశా నుంచి చెన్నై. చెన్నై నుంచి బెంళూరు, బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఇలా మూడు కారిడార్లు రాబోతున్నాయన్నారు. ప్రభుత్వం దగ్గర 49వేల ఎకరాలు భూములున్నాయని, పరిశ్రమలకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం స్కిల్ ఫోర్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
త్వరలో రాజధాని అవుతున్న విశాఖకు రావాలని పెట్టుబడిదారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో ఆహ్వానించారు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టెన్ రైజర్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. తాను కూడా త్వరలో విశాఖ రాజధానికి మారుతున్నానని స్పష్టం చేశారు. మార్చి 3, 4న విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగబోతోందని, అందరూ రావాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో బిజినెస్ ఎంత ఈజీగా చేయొచ్చో అక్కడికి వచ్చి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. దేశంలో వేగంగా వృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టేందుకు మీ సహకారం కావాలని వ్యాపారవేత్తలను జగన్ ను కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని చెప్పారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి చాలా ప్రత్యేకతలున్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్టర్లకు వివరించారు. భారత్ ను కూడా అంతర్జాతీయంగా ప్రత్యేక స్ధానంలో నిలబెట్టినందుకు ప్రధాని మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.