విశాఖ గీతం వద్ద గడబిడ- మెడికల్ కాలేజీలో భవనాలు కూల్చివేత- భారీగా మోహరించిన పోలీసులు
గీతం యూనివర్శిటీలో మరోసారి గడబిడ మొదలైంది. భారీ బందోబస్తుతో అక్కడ కట్టడాలను అధికారులు కూలుస్తున్నారు.
విశాఖలోని గీతం మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెడికల్ కాలేజీవైపు ఉండే కట్టడాలను కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వేకుజామున నాలుగు గంటల నుంచే అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. వారికి రక్షణగా భారీగా పోలీసులు ఆ ప్రాంతాన్ని మోహరించారు.
ఉదయం ఆ ప్రాంతం మీదు వెళ్లే ప్రయాణికులు, ప్రజలు ఒక్కసారి షాక్ అయ్యారు. రాత్రికి రాత్రే ఇలా బారికేడ్లు పెట్టి రాకపోకలకు అంతరాయం కల్పించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎండాడ, రుషి కొండవైపు రాకపోకలు నిలిపేశారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారో అనే సమాచారం మాత్రం ఎవరికీ తెలియక తికమక పడ్డారు.
గీతం యాజమాన్యం కూడా తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతోంది. పోలీసులు ఎందుకు వచ్చారో కూడా తమకు తెలియదని చెబుతోంది. ఈ హైడ్రామా కొనసాగిన కాసేపటికి ఆర్డీవో ఆధ్వర్యంలో నిర్మాణాలు తొలగింపు చేపట్టారు. దీంతో విషయం అందరికీ అర్థమైంది.
ఈ కట్టడాల తొలగింపునకు గతంలోనే ప్రభుత్వం యత్నించింది. అనుమతికి మించి ఈ కట్టడాలు నిర్మించారని ప్రభుత్వం ఆరోపించింది. అందుకే కట్టడాలను కూల్చేస్తున్నట్టు అప్పట్లో పేర్కొంది. దీనిపై కోర్టుకు వెళ్లిన గీతం యాజమాన్యం స్టే తెచ్చుకుంది. ఆ స్టే గడువు ముగియడంతో ఇప్పుడు మరోసారి నిర్మాణాలు పడగొట్టేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.
కట్టడాలు కూల్చేవేసే టైంలో ఎవరినీ అటువైపుగా వెళ్లనీయడంలేదు. ప్రధాన ద్వారాల వద్ద పోలీసులు మోహరించి అందర్నీ కట్టడి చేస్తున్నారు. కనీసం మీడియా ప్రతినిధులను కూడా అటువైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.