అచ్చెన్నాయుడు, దమ్ముంటే సవాలుకు ఒప్పుకో - లేకపోతే నడిరోడ్డుపై బ్యానర్ కడతాం: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
MLC Duvvada Srinivas: టెక్కలి పట్నంలో వైసీసీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మూడు రాజధానుల విషయంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు సవాల్ విసిరారు.
ఏపీలో మూడు రాజధానుల వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. అధికార వైసీపీ మూడు రాజధానులతో డెవలప్ మెంట్ సాధ్యమని చెబుతుందే, గతంలో అమరావతిని ఒప్పుకుని సీఎం వైఎస్ జగన్ మాట మార్చుతున్నారని టీడీపీ, బీజేపీ, జనసేన విమర్శిస్తోంది. ఈ క్రమంలో విశాఖ కేంద్రంగా రాజదాని ఏర్పాటు చేయాలంటూ మూడు రాజధానులకు మద్దతుగా.. టెక్కలి పట్నంలో వైసీసీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మూడు రాజధానుల విషయంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu)కు సవాల్ విసిరారు.
విశాఖలో రాజధాని వద్దు, అమరావతిలో రాజదాని కావాలని చెప్పి రాజీనామా చేస్తావా అని అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. పరిపాలనా రాజధాని కోసం నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని.. అమరావతి నినాదంతో నువ్వు, విశాఖ రాజధాని నినాదంతో తాను ఎన్నికలకు వెళ్దామా అని సవాల్ విసిరారు. నీ ఒంట్లో ఉత్తరాంధ్ర రక్తం ప్రవహిస్తే, దమ్ము దైర్యం ఉంటే రాజీనామా చేసి పోటీకి రావాలని టెక్కలి నడిరోడ్డు పై సవాల్ చేస్తున్నానన్నారు. ఈ సవాల్ లో ఏవరు గెలిస్తే ఆ నినాదమే రిఫరండంగా తీసుకుందాం అన్నారు.
24 గంటల్లో సవాల్ స్వీకరించు.. లేకపోతే బ్యానర్లు కడతాం
విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని వద్దు, అమరావతిలో రాజధాని కావాలని కోరుకునే అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఎన్నికలకు వస్తావా అని సవాల్ విసిరారు. అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. అచ్చెన్నాయుడు ప్రజల నుంచి తప్పించుకోవద్దని, నీకు ఇచ్చిన 24 గంటల గడువు ముగిస్తే అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి అని టెక్కలి నడిరోడ్డుపై బ్యానర్లు కడతామని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడం టీడీపీ నేతలకు ఇష్టం లేదని, అందుకే విశాఖను రాజధానిగా వద్దంటున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి సొంత ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్న వ్యక్తిగా అచ్చెన్నాయుడు చరిత్రలో నిలిచిపోతారన్నారు.
అచ్చెన్నాయుడు వాదన ఏంటంటే..
వికేంద్రీకరణ అంటే మూడు ముక్కలాట కాదని, వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసం చేస్తోందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గతంలో ఎంతో ఆలోచించి, అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామన్నారు. రాజధాని విషయంలో తాము ప్రణాళికబద్దంగా ముందుకు సాగామని, అమరావతిని అప్పటి ప్రతిపక్షం వైసీపీ కూడా అంగకీరించిందన్నారు. కానీ నేడు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, తమ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు, వైఎస్ జగన్ వికేంద్రీకరణ రాగం అందుకున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
మూడు రాజధానులు చేసే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామనప్పుడు ఎందుకు రాజీనామా చేస్తామని వైసీపీ నేతలు చెప్పలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం రాజీనామాల పేరుతో డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను రాజీనామా చేయమని అడిగే అధికారం ఎవరికీ లేదన్నారు అచ్చెన్నాయుడు. విజయనగరం జిల్లాకు గత మూడేళ్లలో మంత్రి బొత్స సత్యనారాయణ ఏం చేశారని ప్రశ్నించారు. రాజధానిని మార్చే అధికారం శాసనసభకు లేదని ఏపీ హైకోర్టు ఇదివరకే స్పష్టం చేసిందన్నారు.