Vizag Court: పిల్లలను చంపిన తండ్రి, కోర్టు సంచలన తీర్పు
Vizag Court: భార్యపై అనుమానం పెనుభూతమైంది. ఫలితంగా తన ఇద్దరు పిల్లల పాలిట తన తండ్రే కాలయముడయ్యాడు.
Vizag Court: భార్యపై అనుమానం పెనుభూతమైంది. ఫలితంగా తన ఇద్దరు పిల్లల పాలిట తన తండ్రే కాలయముడయ్యాడు. పిల్లలకు తనకు పుట్టలేదని ఆరోపిస్తూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపేశాడు. ఈ ఘటన 2016లో జరిగింది. దీనిపై విచారణ జరిపిన న్యాయ స్థానం నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా జి.నామవరం గ్రామానికి చెందిన పాలిక సత్తిబాబు వృత్తి రీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిర్మల అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హనీ, కార్తీక్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్ది కాలం వీరి జీవితం అన్యోన్యంగా సాగింది. ఆ తరువాత సత్తిబాబు, నిర్మల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
నిర్మలపై ప్రవర్తనపై సత్తిబాబు అనుమానం పెంచుకున్నాడు. భార్యతో రోజు గొడవ పడేవాడు. పిల్లలు తనకు పుట్టలేదని, వీరిని చంపుతానని బెదిరించేవాడు. 2016 సెప్టెంబరు 9న నిర్మలతో సత్తిబాబు గొడవ పడ్డాడు. ఆ తరువాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో మూడున్నరేళ్ల కుమార్తె హనీని, ఒకటిన్నర ఏళ్ల కుమారుడు కార్తీక్‌లను దిండుతో ఊపరి ఆడకుండా చేసి ఆపై దుప్పటితో ఉరివేసి చంపేశాడు.
దీనిపై నిర్మల ఫిర్యాదు మేరకు పాయకరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసుపై సోమవారం కోర్టు తుది విచారణ జరిపింది. నిందితుడు నేరం చేసినట్లు తేలడంతో సత్తిబాబుకు జీవిత ఖైదు, రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.